పసుపుబోర్డు ఏర్పాటు మాటలకే పరిమితమైంది. ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించినప్పటికీ అతీగతీ లేకుండా పోయింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ పర్యటనకు వచ్చిన మోదీ పసుపుబోర్డుపై ప్రకటన చేశారు. పది నెలలు దాటిపోతున్నా అడుగు ముందుకు పడింది లేదు. దశాబ్దాల రైతుల కల నెరవేరిందీ లేదు. బోర్డు పేరిట ఎన్నికల ముందర హడావుడి చేయడం, ఆ తర్వాత వదిలేయడం బీజేపీకి అలవాటుగా మారింది. పసుపు రైతుల భావోద్వేగాలతో ఆటలాడడం అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్‌కు మాత్రమే చెల్లింది. మూడు దశాబ్దాలుగా రగులుతున్న పసుపు బోర్డు ఏర్పాటు ప్రక్రియను కేంద్రంలో అధికారాన్ని చెలాయించిన, చెలాయిస్తున్న ప్రభుత్వాలు పట్టించుకోలేదు.
2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు కమలం పార్టీ నిజామాబాద్ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ బోర్డు తీసుకొస్తానని బాండ్‌పేపర్ సైతం రాసిచ్చారు. లేకపోతే రాజీనామా చేస్తానని చెప్పి రైతుల ఓట్లు దండుకున్నారు. ఎంపీగా గెలిచాక ఆ అంశాన్ని పట్టించుకోలేదు. ఐదేళ్ల క్రితం రాజ్‌నాథ్ సింగ్, ప్రకాశ్ జవదేకర్లు ఇచ్చిన మాటిచ్చి తప్పారు. సరిగ్గా మొన్నటి ఎన్నికల ముందర ఏకంగా ప్రధానమంత్రి మోదీ పసుపుబోర్డు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ, పది నెలలు గడుస్తున్నా అది కార్యరూపం దాల్చలేదు.
-నిజామాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
పసుపు బోర్డు ఏర్పాటు విషయంలో ఆది నుంచీ భారతీయ జనతా పార్టీ తీరు నవ్వి పోదురు గాక నాకేంటి అన్న చందంగా మారిం ది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో నిజామాబాద్ ఎంపీగా కల్వకుంట్ల కవిత ఇదే అంశంపై పార్లమెంట్లో తీవ్రంగా పోరాటం చేశారు. ప్రధాని మోదీకి, నాటి వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు దఫాదఫాలుగా వినతులు సమర్పించారు. 2017లో కవిత వి న్నపాలకు స్పందించి నిజామాబాద్‌లో స్పైసెస్ బోర్డు ఎక్స్టెన్షన్ ఆఫీస్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. కానీ ఈ ప్రతిపాదనను కవిత తిరస్కరించారు. తదనంతరం 2019 ఎన్నికల్లో తనను గెలిపిస్తే పసుపుబోర్డును ఐదు రోజుల్లోనే తెస్తానంటూ ధర్మపురి అర్వింద్ రై తులను మభ్యపెట్టి గెలిచాడు. ఐదేండ్ల తన పదవీ కాలంలో పాత హామీలో భాగంగా స్పైసెస్ బోర్డు ఎక్స్టెన్షన్ కార్యాలయం మిన హా పసుపుబోర్డు ఏర్పాటే లేకుండా పోయింది.

లోక్‌సభ, రాజ్యసభలో పసుపు బోర్డు ఏర్పాటుపై పలువురు ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించగా అలాంటి ఆలోచనే లేదని రాతపూర్వకంగా సమాధానాలు ఇచ్చారు. సీన్ కట్ చే స్తే, 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు అక్టోబర్ 3, 4 తేదీల్లో తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ.. పసుపుబోర్డు ఏర్పాటు చేస్తామంటూ ప్రకటన చేశారు. ఇదే హామీని సాగదీస్తూ పార్లమెంట్ ఎన్నికల వర కూ పొడిగిస్తూ వచ్చారు. రైతులను నమ్మించేందుకు ఒక సర్క్యూలర్‌ను జారీ చేసి కేంద్ర సర్కారు చేతులు దులుపుకొన్నది.కానీ, మూడోసారి అధికారంలోకి వచ్చి రోజులు గడుస్తున్నా పసుపు బోర్డు ఊసే లేకుండా పోయింది. పసుపు బోర్డు విషయంలో బీజేపీ పాలకుల తీరు పదేళ్ల కాలంలో రకరకాలుగా మారుతుండగా, తుదకు ఏం జరుగుతుందో తెలియక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
ఎన్నికలు ముగియడంతో బీజేపీ నేతలెవ్వరూ ఇచ్చిన హామీలపై నోరు మెదపడం లేదు. పసుపుబోర్డు అంశాన్ని పక్కన పడేసినట్లు కనిపిస్తున్నది. గతంతో పోలిస్తే రాష్ట్రంలో బీజేపీ అత్యధికంగా 8 లోక్‌సభ స్థానాలను గెలుచుకున్నది. అందులో నిజామాబాద్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకున్నది. పసుపుబోర్డు పేరిట నిజామాబాద్‌లో బీజేపీ రెండుసార్లు గెలిచింది. అయినా ఆ హామీ నెరవేర్చింది లేదు. 2029లోనైనా పసుపుబోర్డు ఏర్పాటు అవుతుందా? అన్న సంశయం రైతుల్లో నెలకొన్నది. సాక్షాత్తు ప్రధాని మోదీ ఇచ్చిన హామీ 10 నెలలు దాటిపోయినా ఆచరణలోకి రాకపోవడంపై ఆశ్చర్యం కలిగిస్తున్నది.
ఎంపీ అర్వింద్ మాత్రం ఈ అం శంపై ఎక్కడా నోరెత్తడం లేదు. ఎంపీగా రెండోసారి గెలిచిన త ర్వాత బాధ్యతగా పసుపుబోర్డు ఏర్పాటుపై ప్రజలకు వివరాలు చెప్పాల్సి ఉం డగా, ఇంతవరకూ అలాంటి ప్రయత్నమే చేయడం లేదు. ఈ తీరును చూస్తుంటే అస లు పసుపుబోర్డు ఏర్పాటవుతుందా? మోదీ ఇచ్చిన మాట మేరకు తూతూ మంత్రంగా ఏర్పాటు చేస్తారా? చేస్తే ఎక్కడ చేస్తారు? అన్నది అంతు చిక్కడం లేదు. ఒకవేళా కేంద్రం పసుపుబోర్డు ఏర్పాటు విషయంలో సీరియస్‌గా ఉన్నట్లయితే ఇ ప్పటికే స్థల సేకరణకు ప్రయత్నాలు ప్రారంభమయ్యేవి. లేదంటే కార్యాలయాలు, పరిశోధన క్షేత్రాల కోసం కదలిక వచ్చేది. కానీ ఇంతవరకు నిజామాబాద్ జిల్లా యంత్రాంగానికి అలాంటి ఆదేశాలు రాకపోవడం కొసమెరుపు.
పసుపుబోర్డు ఏర్పాటు నీటి మీది రాతలుగానే మిగిలి పోతున్నది. 2019లో బీజేపీని గెలిపిస్తే బోర్డు తెస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటను బీజేపీ నిలబెట్టుకోలేదు. మొన్నటి ఎన్నికల్లో ఏకంగా ప్రధానమంత్రి హామీ ఇచ్చినా అతీగతీ లేకుండా పోయింది. మాట ఇచ్చి తప్పడం సరికాదు. దయచేసి రైతులను మోసం చేయొద్దు.
– శ్రీకాంత్ యాదవ్, పసుపు రైతు, బోదెపల్లి, బాల్కొండ