ఖలీల్వాడి, జూన్ 6: ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాలు, యూనిఫామ్లు, షూస్ పేరిట మొదలైన వ్యాపారంపై మా దగ్గరే కొనాలి అనే శీర్షికన నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి డీఈవో దుర్గాప్రసాద్ స్పందించారు. ప్రైవేటు పాఠశాల ఆవరణలో బెల్టులు, యూనిఫామ్లు, పుస్తకాలు తదితర వాటి అమ్మకాలు చేపడితే చర్యలు తీసుకుంటామని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించే ముందు పాఠశాలకు ప్రభుత్వ అనుమతి ఉందో లేదో చూసుకొని అడ్మిషన్ తీసుకోవాలని సూచించారు. అవసరమైతే మండల విద్యాశాఖ అధికారిని సంప్రదించాలని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాలు, వేసవి శిక్షణలు, పాఠశాల ఆవరణలో క్రయవిక్రయాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాల పేరిట విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద 70శాతం ఫీజును ముందే చెల్లించాలని భయబ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిసిందని, ఇలాంటి సంఘటనలు మా దృష్టికి వస్తే నోటీసులు జారీ చేయకుండానే పాఠశాల అనుమతులని రద్దు చేస్తామని హెచ్చరించారు.