కోటగిరి : సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి తెలంగాణలో శాశ్వతంగా నీటి సమస్యను పరిష్కరించారని శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణాస్వీకరణ కార్యక్రమానికి స్పీకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌గా తేళ్ల లావణ్య అరవింద్, వైస్ చైర్మన్‌గా లోని జగన్‌తో పాటు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్, నీటి సమస్యతో రైతులు నానా కష్టాలు పడ్డారని, తెలంగాణ రాష్ట్రం వచ్చాకా సీఎం కేసీఆర్ నేతృత్వంలో రైతుల సమస్యలను పూర్తిగా పరిష్కరించారని, గుర్తు చేశారు.
గతంలో ఏఎంసీలో రిజర్వేషన్లు ఉండేవి కాదని తెలంగాణ వచ్చాకా రిజర్వేషన్ ప్రకటించారని దీని ఆధారంగానే పదవులు వస్తున్నాయని తెలిపారు. పని చేసే వారికి కచ్చితంగా గుర్తింపు ఉంటుందన్నారు. అర్హులైన ప్రతి పేదోడికి డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తున్నామన్నారు. దేశంలోనే అందరి చూపు తెలంగాణ వైపు ఉందన్నారు. అనంతరం ఏఎంసీ, సహకార సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్పీకర్ ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి, జడ్పీటీసీ శంకర్‌పటేల్, సర్పంచ్ పత్తిలక్ష్మణ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ తేళ్ల లావణ్య అరవింద్, మండల కన్వీనర్ ఎజాజ్‌ఖాన్, ఏఎంసీ మాజీ చైర్మన్ నీరడి గంగాధర్, వైస్ ఎంపీపీ గంగాధర్, డీసీవో సింహచలం, ఆర్డీవో రాజేశ్వర్, డీఏవో గోవింద్, విండో చైర్మెన్లు శాంతేశ్వర్‌పటేల్, కూచి సిద్దూ, అశోక్‌పటేల్, శివరాజ్దేశాయ్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు సిరాజ్, కిశోర్‌బాబు తదితరులు వున్నారు.