నవీపేట/బాన్సువాడ రూరల్, మార్చి 17: వంట గ్యాస్ కోసం తంటాలు తప్పడం లేదు. పశ్చిమాసియలో ఉద్రిక్తతల నేపథ్యంలో మన దగ్గర ఎల్పీజీకి కొరత ఏర్పడుతుందన్న భయాందోళనకు తోడు బుకింగ్, సరఫరాల్లో సాంకేతిక చిక్కులు వినియోగదారులను గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిలిండర్ల కోసం ఉదయం నుంచే జనం ఏజెన్సీల ముందు బారులు తీరుతున్నారు.
బాన్సువాడలోని ఇండేన్ గ్యాస్ ఏజెన్సీతో పాటు నవీపేటలోని భారత్ గ్యాస్ ఏజెన్సీ ఎదుట మంగళవారం భారీగా జనాలు పడిగాపులు కాశారు. నవీపేటలో తెల్లవారుజామున 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు క్యూ కట్టారు. మండుటెండలోనూ గ్యాస్ కోసం వేచి ఉన్నారు. మరోవైపు, గ్రామీణ ప్రాంతాలకు సిలిండర్ల సరఫరా నిలిపి వేయడంతో బాన్సువాడలోని ఏజెన్సీ ఎదుట వినియోగదారులు బారులు తీరారు. పల్లెల నుంచి భారీగా తరలి వచ్చిన ప్రజలు మండుటెండను సైతం లెక్క చేయకుండా లైన్లో నిలబడి సిలిండర్లు తీసుకున్నారు. సిలిండర్ బుక్ చేసుకున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో ఎందుకు సరఫరా చేయడం లేదని నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.