బోధన్, నవంబర్ 9: బోధన్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి మహ్మద్ షకీల్ నామినేషన్ సందర్భంగా గురువారం నిర్వహించిన ర్యాలీతో బోధన్ పట్టణం గులాబీమయమైంది. గులాబీరంగు జెండాలతో నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన జనంతో పట్టణంలోని ప్రధాన రహదారులు కిక్కిరిసిపోయాయి. సుమారు నాలుగు కిలోమీటర్ల బోధన్ పట్టణంలో ట్రాఫిక్ స్తంభించింది. పట్టణ శివారులో ప్రారంభమైన ర్యాలీ ఆచన్‌పల్లి, శక్కర్‌నగర్ చౌరస్తా, బస్‌స్టాండ్ మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు కొనసాగింది. నామినేషన్ ర్యాలీకి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్యఅతిథిగా వచ్చారు. ర్యాలీలో టాప్లేని వాహనంలో కవిత, బీఆర్ఎస్ అభ్యర్థి మహ్మద్ షకీల్‌తో కలిసి ప్రజలకు అభివాదం చేశారు. జై కేసీఆర్, జై కవిత, జై షకీల్ నినాదాలతో పట్టణం మార్మోగింది. ర్యాలీ ముగిసిన తర్వాత బీఆర్ఎస్ అభ్యర్థి మహ్మద్ షకీల్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజాగౌడ్‌కు నామినేషన్ పత్రాలను సమర్పించారు. బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ సతీమణి ఆయేషా ఫాతిమా, బోధన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వరరావు దేశాయ్, బీఆర్ఎస్ బోధన్ మండలం అధ్యక్షుడు గోగినేని నరేంద్రబాబు (నర్సయ్య) ఉన్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థి మహ్మద్ షకీల్ నామినేషన్ ర్యాలీలో పాల్గొనేందుకు కారులో గురువారం ఉదయం బోధన్ పట్టణానికి వస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు పట్టణ శివారులో ట్రాఫిక్ సమస్య ఎదురైంది. బీఆర్ఎస్ నామినేషన్ ర్యాలీకి పెద్ద ఎత్తున జనం తరలిరావడంతో కవిత ప్రయాణిస్తున్న కారు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయింది. దీంతో ఆమె ద్విచక్రవాహనంపై ర్యాలీ స్థలానికి చేరుకున్నారు.
రెంజల్/ఎడపల్లి/నవీపేట, నవంబర్ 9: బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్‌కు మద్దతుగా నామినేషన్ సందర్భంగా గురువారం రెంజల్ మండలం నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు బోధన్ పట్టణకు తరలివెళ్లారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు భూమారెడ్డి, ఉపాధ్యక్షుడు హజీఖాన్ తదితరులు ఉన్నారు. ఎడపల్లి మండలం నుంచి పార్టీ నాయకులు తరలివెళ్లారు. నవీపేట మండలం నుంచి పార్టీ మండల అధ్యక్షుడు వి.నర్సింగ్‌రావు ఆధ్వర్యంలో పలు గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు వాహనాల్లో బోధన్‌కు తరలి వెళ్లారు.