లింగంపేట, డిసెంబర్ 26 : కొన్నిరోజులుగా కామారెడ్డి జిల్లాలోని తాడ్వాయి, లింగంపేట మండలాల పరిధిలోని ఆయా గ్రామాల్లో చిరుతల సంచారం.. ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నది. రెండు నెలల వ్యవధిలో రెండు మండలాల పరిధిలోని గ్రామాల్లో చిరుతల సంచారం పెరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. అటవీ ప్రాంతంలో ఉండాల్సిన చిరుతలు శివారు గ్రామాల్లోకి వస్తున్నాయి. లింగంపేట మండలంలోని మెంగారం, కంచుమహల్, కొండాపూర్, మోతె, ఎల్లారం, కోమట్పల్లి, పోతాయిపల్లి, లోంకల్పల్లి గ్రామాల్లో ఇటీవల కాలంలో చిరుతలు కనిపించాయి. తాడ్వాయి మండలంలోని ఎర్రాపహాడ్, ఎండ్రియాల్ తదితర గ్రామాల్లోనూ చిరుత సంచరించినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. వారం పది రోజుల వ్యవధిలో తాడ్వాయి మండలం ఎర్రాపహాడ్, లింగంపేట మండలం మోతె గ్రామాల్లో చిరుతలు లేగ దూడలు, గొర్రెలను చంపినట్లు తెలిపారు.
తాజాగా తాడ్వాయి మండలం ఎర్రాపహాడ్ గ్రామంలోని చెవిటి మల్లయ్యకు చెందిన గొర్రె కళేబరాన్ని గుర్తించారు. మూడు రోజులుగా గొర్రె కనిపించకపోవడంతో గాలించగా అటవీ ప్రాంతంలో దాని కళేబరాన్ని గుర్తించినట్లు గ్రామస్తులు తెలిపారు. పదిహేను రోజుల క్రితం గాంధీనగర్ గ్రామ శివారులోని గుట్టపై నుంచి దిగి కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై సంచరించినట్లు చెప్పారు. చిరుత సంచారంతో గ్రామీణ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ, పోలీసు శాఖల అధికారులు సూచిస్తున్నారు. రాత్రిపూట ప్రయాణాలు, వ్యవసాయ క్షేత్రాల వద్దకు వెళ్తున్న సమయంలో రైతులు, వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. బోనులు ఏర్పాటు చేసి చిరుతలను ఇతర ప్రాంతాలకు తరలించాలని అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు.
చిరుతల సంచారం పెరగడంతో వ్యవసాయ క్షేత్రాల వద్దకు వెళ్లడానికి రైతులు సైతం జంకుతున్నారు. లింగంపేట మండలంలోని లోంకల్పల్లి, మెంగారం, బోనాల్, కంచుమహల్, కొండాపూర్, మోతె, ఎల్లారం, గాంధీనగర్, కోమట్పల్లి, పోతాయిపల్లి, పోల్కంపేట తదితర ప్రాంతాల్లో చిరుతల సంఖ్య పెరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. మండలంలో సుమారు ఆరు నుంచి ఎనిమిది చిరుతలు ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.