ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బండి వ్యాఖ్యలను నిరసిస్తూ శనివారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆందోళన కార్యక్రమాలు వెల్లువెత్తాయి. మండల కేంద్రాలతోపాటు పట్టణాల్లో సంజయ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. అనంతరం ఎంపీ సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. కవితను కించపరిచేలా మాట్లాడిన బండి సంజయ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, కవితతోపాటు మొత్తం మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.