ఒకవైపు నిరసనలు.. మరోవైపు నిలదీతలతో గ్రామసభలు జనాగ్రహానికి గురయ్యాయి. హామీల అమలులో విఫలమైన రేవంత్ సర్కారు తీరుపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. లబ్ధిదారుల ఎంపిక జాబితాల్లో అర్హుల పేర్లు గల్లంతు కావడంతో ప్రజలు అధికారులను నిలదీశారు. రైతుభరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ ఆత్మీయ భరోసా పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం మంగళవారం ఉమ్మడి జిల్లాలో నిర్వహించిన గ్రామ, వార్డు సభలు రచ్చరచ్చగా మారాయి. ఆయా పథకాలకు సంబంధించి అర్హుల పేర్లు జాబితాలో లేకపోవడం, కొన్ని పథకాలకు ఒకే ఇంటి నుంచి ముగ్గురు, నలుగురిని ఎంపిక చేయడం వివాదాస్పదమైంది. అనేక లోటుపాట్లతో కూడిన జాబితాలు ప్రదర్శించడంపై ప్రజలు నిలదీయడంతో గ్రామసభల్లో గందరగోళం నెలకొన్నది. మరోవైపు, పోలీసు పహారా నడుమ సభలు నిర్వహించడం, లొసుగులపై ప్రశ్నిస్తున్న ప్రజలపై వారు జులుం ప్రదర్శించడం విమర్శలకు తావిచ్చింది.
మోర్తాడ్, కమ్మర్పల్లి మండలాల్లో ప్రారంభమైన గ్రామసభల్లో ప్రజలు అధికారులను నిలదీశారు. రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకుని ఏడాది గడుస్తున్నా సర్వేలో తమ ఇండ్లకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. రాని వారు దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో రాజశ్రీనివాస్ సూచించగా, ఎన్నిసార్లు దరఖాస్తులు చేసుకోమంటారని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపికలో కూడా అనుమానాలు ఉన్నాయని, ఒకే ఇంట్లో ముగ్గురు, నలుగురిని ఎంపిక చేయడం అనుమానాలకు తావిస్తున్నదని ఆరోపించారు. తిమ్మాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఆత్మీయభరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డుల విషయంలోలబ్ధ్దిదారుల ఎంపిక సరిగా జరగలేదని, ఉన్నవారికే అన్ని ఇస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారులను ప్రశ్నించేందుకు వచ్చిన మహిళలను పోలీసులు వచ్చి అక్కడి నుంచి పంపించి వేశారు. అమీర్‌నగర్ గ్రామంలో ప్రభుత్వ పథకాలపై ప్రజలు అధికారులను నిలదీశారు.
కమ్మర్పల్లి మండలం నర్సాపూర్ గ్రామం లో మంగళవారం జరిగిన గ్రామసభ రచ్చరచ్చగా సాగింది. రైతుభరోసాకు సంబంధించి అధికారుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుభరోసాలో పేర్లు ఎలా తొలగించారని నిలదీశారు. ఇష్టం వచ్చి నట్లు పేర్లు తొలగించడం ఏమిటని ప్రశ్నించారు. సభ రచ్చరచ్చగా మారుతుండడంతో పోలీసులు వచ్చి ప్రజలను అక్కడి నుంచి నెట్టేయడం కలకలం రేపింది.
జాబితాల్లో అవకతవకలపై డిచ్పల్లి, ధర్పల్లి తదితర మండలాల్లోనూ జనం నిలదీశారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల కోసం అధికారులతో వాగ్వాదానికి దిగారు. అన్ని అర్హతలున్నప్పటికీ తమ పేర్లు జాబితాలో రాలేదని, ప్రభుత్వ ఉద్యోగులు, బడా వ్యాపారుల పేర్లు మాత్రం ఎలా వస్తాయని ప్రశ్నించారు. తనకు నలుగురు కొడుకులున్నారని, ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నా తన పేరు జాబితాలో రాలేదని నడిపల్లికి చెందిన వికలాంగురాలైన ఆశాబేగం ఆవేదన వ్యక్తం చేశారు. అద్దె ఇంట్లో ఉంటున్న తమ పేర్లు జాబితాలో రాలేదని జ్యోతి కౌర్, రూప వాపోయారు. ధర్పల్లి మండలం రామడుగు, దుబ్బాక గ్రామాల్లో అర్హులైన వారికి ఇండ్లు, రేషన్ కార్డులు మంజూరు కాలేదని అధికారులను నిలదీశారు. ఇండ్లు ఉన్న వారికి మళ్లీ ఇందిరమ్మ ఇండ్లు ఎలా కేటాయిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాల్కొండ మండలంలోని వన్నెల్(బి)లో పేదలకు కాకుండా పెద్దలకు, ప్రభుత్వ ఉద్యోగులకు, భూమి ఉన్న వారి కుటుంబాలకు రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఎలా ఇస్తారని ఆందోళన చేశారు.
ప్రభుత్వ పథకాల ఎంపికలో అర్హులైన వారి పేర్లు లేకపోవడంపై జనం మండిపడ్డారు. బోధన్ మండలం కల్దుర్కి, పెడగాపల్లి, ఎరాజ్‌పల్లి, మినార్పల్లి, హంగర్గ, పెంటకుర్దు తదితర గ్రామాల్లో నిర్వహించిన గ్రామసభల్లో జనాగ్రహం వెల్లువెత్తింది. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా , ఇందిరమ్మ ఇండ్ల పథకాలు ఇస్తామని చెప్పారని, ఇప్పుడు లిస్టులో చూస్తే అర్హులమైన తమ పేర్లు రాలేవని జనం మండిపడ్డారు. కల్దుర్కిలో రేషన్‌కార్డు, ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా పథకాలలో తమ పేర్లు రాలేదని అధికారులను పలువురు నిలదీశారు. పెగడాపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులు చేసినా, గుంట భూమి లేకున్నా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద తమ పేరు ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. రేషన్ కార్డుల జాబితాలో పేర్లు లేవని, మళ్లీ సర్వే చేపట్టాలని డిమాండ్ చేశారు. సాలూరా మండలంలోని జాడిజమాల్‌పూర్, సాలంపాడ్ గ్రామాల్లోని గ్రామసభలలో గందరగోళం నెలకొన్నది. ఎన్నికల ముందు అందరికీ రేషన్‌కార్డులు ఇస్తామని చెప్పి, ఇప్పుడు తూతూ మంత్రంగా కొంత మందికే ఇస్తున్నారని మండిపడ్డారు. ఇందిరమ్మ ఆత్మీయ భరో సా పథకాలకు సంబంధించిన సర్వే సరిగా చేయలేదని, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో అర్హు ల పేర్లు లేవని ఆందోళన వ్యక్తంచేశారు. అర్హులైన వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించగా, ఎన్నిసార్లు దరఖాస్తు చేయాలని ప్రజలు నిలదీశారు.
మాక్లూర్, జనవరి 21: ఇండ్లు ఉన్నోళ్లకే ఇండ్లు ఇస్తారా? అని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి అధికారులను నిలదీశారు. మాక్లూర్ మండలంలోని మామిడిపల్లి, కల్లడి, గంగరమంద, అమ్రాద్‌లో మంగళవారం నిర్వహించిన గ్రామ సభల్లో ఆయన పాల్గొన్నారు. అమ్రాద్‌లో లబ్ధిదారుల జాబితాను తహసీల్దార్ శేఖర్ ప్రకటించగా, రాకేశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థలం ఉన్న వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూ రు చేయాల్సి ఉండగా, ఇప్పటికే ఇండ్లు ఉన్న వారికి ఎలా మంజూరు చేస్తారని ప్రశ్నించారు. ఇల్లు ఉన్నోడికి ఇస్తే రూ.5 లక్షలు తీసుకుని వాళ్లు ఎంజాయ్ చేయడానికేనా? అని నిలదీశారు. పేదలకు ఇవ్వాల్సిన రేషన్ కార్డులు ఉన్నోళ్లకే ఎలా మంజూరవుతాయని ప్రశ్నించారు.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ, గాంధా రి, నస్రుల్లాబాద్, బీర్కూర్, నాగిరెడ్డిపేట తదితర మండలాల్లో ప్రజలు అధికారులను నిలదీశారు. అనర్హుల పేర్లు జాబితాలో ఉండడం, అర్హుల పేర్లు గల్లంతు కావడంపై ప్రశ్నించారు. బాన్సువాడ మండలంలోని జక్కల్‌దాని తండా, ఇబ్రహీంపేట్ తండాల్లో రేషన్‌కార్డుల కోసం అధికారులను నిలదీశారు. నస్రుల్లాబాద్ మండలం బొమ్మన్‌దేవ్‌పల్లిలో అర్హులకు రేషన్ కార్డులు ఇవ్వలేదని, భూములు ఎక్కువ ఉన్నవారికి ఇచ్చారని అధికారులను నిలదీశారు. గాంధారిలో నిర్వహించిన గ్రామ సభలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లు రాలేదని, అనర్హుల పేర్లు జాబితాలో ఉన్నాయని గ్రామస్తులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌరారంలో ఆత్మీయభరోసా పథకంలో అనర్హుల పేర్లు వచ్చాయని, వారి పేర్లు తొలగించాలని గ్రామస్తులు కోరారు.