నిజామాబాద్, జనవరి 24, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అనేక హామీలు గుప్పించింది. రైతులకు ప్రధానంగా పెట్టుబడి సాయం రూ.15వేలు, రైతుబీమా, రూ.2లక్షల్లోపు రుణమాఫీ, సకాలంలో ఎరువులు, విత్తనాలు, సాగుకు ఉచిత విద్యుత్, సాగు నీరు, పంట ఉత్పత్తుల కొనుగోళ్లు వంటివి అనేకం ఉన్నాయి. ఆరుగాలం శ్రమించి పంటలు పండించిన రైతులను ప్రోత్సహించేందుకు పంట ఉత్పత్తులకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ చెల్లిస్తామంటూ పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలికారు.
ధాన్యానికి మాత్రమే బోనస్ వర్తింపజేస్తామని అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. ఆ తర్వాత సన్న వడ్లకు మాత్రమే ఇస్తామంటూ బుకాయించారు. సీన్ కట్ చేస్తే సన్న వడ్లకు సైతం క్వింటాకు రూ.500 బోనస్ సరిగా అమలు కావడం లేదు. 2024-25 యాసంగిలో ధాన్యం అమ్ముకున్న రైతులకు చిల్లి గవ్వ బోనస్ జమ కాలేదు. యాసంగి, వానాకాలం సీజన్లు ముగిసి 2025-26 యాసంగి వచ్చినప్పటికీ బోనస్ బకాయిలు చెల్లింపుపై ప్రభుత్వంలో చలనం కనిపించడం లేదు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకు దిక్కూ మొక్కూ లేకుండా పోయింది. ఏ సీజన్లో ఏ పథకం అమలవుతుందో తెలియని సందిగ్ధంలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. కేసీఆర్ పరిపాలనలో ఠంచనుగా అమలైన రైతు అనుకూల పథకాలన్నీ అతీగతీ లేకుండా పోతున్నాయి.
నీటి మూటలవుతోన్న హామీలు…
కామారెడ్డి జిల్లాలో విచిత్రకకరమైన పరిస్థితి దాపురించింది. మొన్న వానాకాలం సీజన్లో బోనస్‌ను అమలు చేసినప్పటికీ ఇప్పటికీ రూ.15కోట్లు ఇంకా పెండింగ్‌లో ఉండటం అంతు చిక్కడం లేదు. ఇలా అరకొరగా బోనస్ వర్తింపజేసి చేతులు దులుపుకున్న ఘటనలు కళ్ల ముందే సాక్షాత్కారమై నిలుస్తుండగా కాంగ్రెస్ పాలకుల్లో మాత్రం బాధ్యత కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రైతు డిక్లరేషన్‌లో పంటలకు బోనస్ కింద రూ.500 అందిస్తామని పేర్కొని సన్న వడ్లకు మాత్రమే పరిమితం చేసింది. ఇచ్చిన అబద్ధపు హామీని సైతం కాంగ్రెస్ పార్టీ సరైన రీతిలో అమలు చేయడం లేదు.
గడిచిన నాలుగు సీజన్లలో బోనస్ చెల్లించిన పరిస్థితులు అరకొరగానే ఉన్నాయి. గత యాసంగిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.449 కోట్లు మేర బోనస్ బకాయిలు పేరుకు పోయాయి. నిజామాబాద్ జిల్లాలో రూ.360 కోట్లు, కామారెడ్డి జిల్లాలో రూ.89కోట్లు మేర యాసంగి సీజన్‌కు సంబంధించి బోనస్ బకాయి పెండింగ్‌లోనే కొనసాగుతోంది. కామారెడ్డిలో గతేడాది యాసంగికి రూ.89కోట్లు, గత వానాకాలం రూ.15కోట్లు కలిపితే రూ.103కోట్లు బకాయిలు పేరుకు పోయాయి. రైతులంతా ఆశగా బోనస్ కోసం ఎదురు చూస్తున్నారు. క్వింటా సన్న వడ్లకు రూ.500 చొప్పున బోనస్ వస్తే తమకు లాభం జరుగుతుందని సంబుర పడుతుంటే ప్రభుత్వం రైతుల ఆశలపై నీళ్లు చల్లుతోంది. అసంబద్ధమైన హామీలిచ్చి రైతులను ఆకర్షించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడేమో బోనస్‌పై శ్రద్ధ వహించడం లేదు.
ఇతర పంటలకు కష్టమే…?
పంటలకు బోనస్ వర్తింపజేస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మాట మార్చిన తీరుపై రైతులంతా ఆగ్రహావేశాలు వెళ్లగక్కుతున్నారు. వరి సాగు చేసే రైతులతో పాటుగా పసుపు, పత్తి, మొక్కజొన్న, అపరాల సాగు చేసే అన్నదాతలంతా బోనస్ ఇవ్వాలంటున్నారు. సాగులో ఇబ్బందులు, ఇతర పంటల్లో వెలుగు చూసే శ్రమను దృష్టిలో పెట్టుకుని అన్ని పంటలకు క్వింటాకు రూ.500 చొప్పున సాయం అందిస్తే రైతుకు ఉపకారం జరుగుతుందన్న అభిప్రాయం అంతటా వెలుగు చూస్తోంది. సన్న వడ్లకే బోనస్ వర్తింపు తూతూ మంత్రంగా సాగుతోన్న ఈ సమయంలో మిగిలిన పంటలకు బోనస్ రావడం కష్టతరమైన ప్రక్రియగా రైతులు భావిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో పసుపు సాగు సుమారుగా 25వేల ఎకరాల నుంచి 30వేల ఎకరాల్లో కొనసాగుతుంది.
ఏటా జనవరిలో పసుపు పంట చేతికి వస్తుంది. ఈ సమయంలో పసుపు పంటకు కనీస మద్ధతు ధర దక్కకపోవడంతో రైతన్నలకు నష్టాలు తప్పడం లేదు. పసుపు సాగు చేసే వారికి బోనస్ అందిస్తే రైతులకు ప్రోత్సాహకంగా ఉండటంతో పాటుగా పసుపు సాగు మరింత పెరిగే వీలుందని అన్నదాతలు చెబుతున్నారు. సన్న వడ్లకే సక్రమంగా క్వింటాకు రూ.500 ప్రోత్సాహం దక్కని ఈ దయనీయ దుస్థితిలో మిగిలిన పంటలకు కాంగ్రెస్ పార్టీ ప్రోత్సాహం అందివ్వడం కష్టమేనన్న అభిప్రాయంతో కర్షకులు నిట్టూరుస్తున్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో హామీలన్నీ తుంగలో తొక్కిన దుస్థితి వెలుగు చూస్తుండటంపై అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడే రైతులకు సాగు సంబురం కనిపించిందని చెబుతున్నారు.