కామారెడ్డి/ కంఠేశ్వర్, జూన్ 14 : పెండింగ్‌లో ఉన్న ధరణి దరఖాస్తుల పరిష్కారానికి మరోసారి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సీసీఎల్ఏ (రాష్ట్ర భూ పరిపాలన విభాగం) కమిషనర్ నవీన్‌మిట్టల్ కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పెండింగ్ ధరణి సమస్యల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు. ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ద్వారా పెండింగ్ ధరణి దరఖాస్తుల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న ధరణి దరఖాస్తుల పరిష్కారానికి మరోసారి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. తహసీల్దార్ నుంచి కలెక్టర్ స్థా యి వరకు పెండింగ్ ఉన్న అన్ని దరఖాస్తులనూ త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషిచేయాలని సూచించారు. కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పా టిల్ మాట్లాడుతూ..జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ధరణి దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. వీసీలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, ఆర్డీవోలు రంగనాథరావు, ప్రభాకర్, రమేశ్ రాథోడ్ పాల్గొన్నారు.
నవీన్‌మిట్టల్‌తో వీసీ అనంతరం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు ఆర్టీవోలు,తహసీల్దార్లతో సమావేశమై కీలక సూచనలు చేశారు. బోధన్ తహసీల్ కార్యాలయ పరిధిలో ఎక్కువ సంఖ్యలో ధరణి ధరఖాస్తులు అపరిష్కృతంగా ఉన్నాయని, సత్వరమే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏ ఒక్క దరఖాస్తు కూడా పెండింగ్ లో ఉంచకుండా వారం వ్యవధిలోపు అన్నింటినీ పరిష్కరించాలని అన్నారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాతో ముడిపడిన అర్జీలను కూడా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అధి కారు లను ఆదేశించారు. అర్జీలపై చేపట్టిన చర్యల గురించి దరఖాస్తుదారుడికి వివరాలు తెలియజేయడంతో పాటు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరచాలని సూచించారు. ప్రజావాణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం కోసం చేపడుతున్న చర్యలకు సంబంధించి రోజువారీగా నివేదికలు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. వీసీలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఆర్డీవోలు రాజేంద్రకుమార్, రాజాగౌడ్, రాజేశ్వర్, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, తహసీల్దార్లు పాల్గొన్నారు.