నిజామాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ (Nizamabad) పట్టణంలో ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్, వివిధ సంఘాల నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు. సోమవారం తెల్లవారుజామునే పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్‌ను అదుపులోకి తీసుకుని 4th టౌన్ పీఎస్‌కు తరలించారు.
ఈ సందర్భంగా రాజేశ్వర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో నియంత పాలన సాగుతున్నదన్నారు. అధికారంలోకి వస్తే ఏడో గ్యారంటీగా స్వేచ్ఛ, ప్రజాస్వామిక హక్కులను కాపాడతానని హామీ ఇచ్చి ప్రశ్నించే గొంతులను అరెస్ట్ చేయటం దుర్మార్గమని మండిపడ్డారు.
విద్యారంగంలో నేడు అనేక సమస్యలు ఉన్నాయని, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులను మూడేండ్లుగా విడుదల చేయడం లేదని, దీంతో రూ.8 వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ వస్తున్న తరుణంలో జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
విద్యారంగాన్ని విస్మరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి పట్టభద్రుల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు.
ప్రజాస్వామిక వాదులు అక్రమ అరెస్టులను ఖండించన్నారు.