Rowdy sheeters counseling | వినాయక నగర్, ఏప్రిల్ 10 : రౌడీ షీటర్ల తీరు మారకుంటే పీడీ యాక్ట్ అమలు చేస్తామని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట రెడ్డి హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని ఐదో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఆయన గురువారం రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ నిజామాబాద్ సీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు రౌడీషీటర్ల ప్రవర్తన లో మార్పు తీసుకువచ్చేందుకు ఈ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రౌడీషీటర్ల నేర చరిత్ర, వారి పై ఉన్న కేసుల వివరాలు, ప్రస్తుత జీవన విధానం, ఉద్యోగ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి నుండి రౌడీ షీటర్స్ ఉన్న వారు ఎలాంటి కేసులోనైనగా తల దూర్చరాదని సూచించారు.
ఈ కౌన్సిలింగ్ హాజరైన వారిలో ఎవరైనా భవిష్యత్తులో నేరాలలో పాలుపంచుకుంటే చట్టం లో ఉన్న యాక్ట్ ల ప్రకారం శాశ్వతంగా జైలు జీవితం గడపాల్సి వస్తుందని ఏసీపీ హెచ్చరించారు. ఈ సందర్భంగా చాలా కాలం నుండి రౌడీషీటు ఓపెన్ అయి ఉండి గత పది సంవత్సరాల నుండి ఎలాంటి నేరాల్లో పాల్గొనకుండా సత్ప్రవర్తన కలిగి ఉన్న వ్యక్తు లను గుర్తించి వారి యొక్క రౌడీషీట్లను తీసేసే ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, 5వ టౌన్ ఎస్ఐ గంగాధర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.