ఒకప్పుడు రోగులకు మెరుగైన వైద్యసేవలందించి, రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖాన ప్రస్తుతం సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నది. బీఆర్ఎస్ హయాంలో అన్ని వసతులు కల్పించడంతో జీజీహెచ్‌కు ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా పొరుగు రాష్ర్టాల నుంచి రోగులు వచ్చేవారు. గత కేసీఆర్ సర్కార్ ప్రజావైద్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో ప్రజలకు ప్రభుత్వ దవాఖానలపై నమ్మకం ఏర్పడింది. దీంతో జిల్లా కేంద్ర దవాఖానకు నిత్యం వేల సంఖ్యలో రోగుల తాకిడి ఉండేది. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో దవాఖానల్లో గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు మందులు, మరోవైపు దవాఖానలో వైద్య సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తున్నది. ప్రభుత్వ ఉదాసీన వైఖరితో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
-ఖలీల్‌వాడి, డిసెంబర్ 16
జిల్లా ప్రభుత్వ దవాఖానలో మందుల కొరత వేధిస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రతిరోగానికి మందులు అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం ఇండెంట్ పెట్టినా రాని పరిస్థితి. వైద్యులు రాసిన మందులు కూడా అందుబాటులో ఉంచలేకపోతున్నారు. న్యూరో, గైనిక్, బీపీ, థైరాయిడ్‌కు తదితర మందులు అందుబాటులో లేకపోవడంతో బయటికి వెళ్లి కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొన్నది.
పేదలకు ఒకేసారి అన్ని రకాల టెస్టులు చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం టీ-హబ్ అత్యాధునిక పరికరాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. వందలాది మందికి రక్తనమూనా పరీక్షలు నిర్వహించారు. కానీ ప్రస్తుతం కొన్ని పరీక్షలకు మాత్రమే రక్తనామునా సేకరణ చేస్తున్నారు. క్యాథ్‌ల్యాబ్, సిటీస్కాన్, టీఫా స్కానింగ్ తదితర పరికరాలు జీజీహెచ్‌లో ఉన్నప్పటికీ వైద్యుల కొరతతో అవి నిరుపయోగంగా మారిపోయాయి. ఇటు ప్రభు త్వ దవాఖానల్లో వైద్యపరీక్షలు, వైద్యం అందకపోవడం, అటు ప్రైవేట్ దవాఖానల్లో ఇష్టం వచ్చినట్లు ఫీజులు వసూలు చేస్తుండడంతో పేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
జీజీహెచ్‌లో తాగునీటి సమస్య నిరంతరంగా కొనసాగుతున్నది. బోరు పనిచేయకపోవడంతో తాగునీరు అందుబాటులో లేదని అధికారులు తెలుపుతున్నారు. దీంతో రోగులు, వారితో ఉండే కుటుంబీకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యలపై దవాఖాన సూపరింటెండెంట్‌ను వివరణ కోరేందుకు ఫోన్ చేయగా స్పందన కరువైంది.
ఏడంతస్తుల మేడలో ఏర్పాటు చేసిన జిల్లా ప్రభుత్వ దవాఖానకు నిత్యం వేల సంఖ్యలో అవుట్ పేషెంట్లు వస్తుంటారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జీజీహెచ్‌లో నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. రోగులకు మెరుగైన వైద్యం అటుంచితే.. దగ్గు, జలుబు, జ్వరాలకు మందులు ఇచ్చే పరిస్థితి లేదు. వచ్చిన రోగులకు వైద్య సేవలు అందించేందుకు సరిపడా వైద్య సిబ్బంది లేకపోవడం గమనార్హం. ఒకప్పుడు ఇక్కడ పదుల సంఖ్యలో సీనియర్ వైద్యులు ఉండేవారు. ప్రభుత్వం 18 మంది ప్రొఫెసర్లును బదిలీ చేయడంతో వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. ఫలితంగా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం పీజీ డాక్టర్లతోనే వైద్యం అందిస్తున్నారు. ఉన్న కొద్దిమంది సీనియర్లు ఉన్నా దవాఖానలో సరైన సదుపాయాలు లేకపోవడంతో పూర్తిస్థాయిలో వైద్యసేవలందించని పరిస్థితి నెలకొన్నది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేదలకు అన్ని రకాల వైద్యసేవలు అందించాలని ఉద్దేశంతో జీజీహెచ్‌లో కోట్ల రూపాయలు వెచ్చించి అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తెచ్చింది. ఏ ఒక్క రోగి హైదరాబాద్‌కు వెళ్లకుండా ఇక్కడే కార్పొరేట్‌కు దీటుగా వైద్య సేవలు అందించింది. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఏడాదికాలంగా జీజీహెచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వహించడమే కాకుండా ప్రభుత్వ దవాఖానల్లో నిర్వహణను గాలికొదిలేసింది. ఇప్పటివరకు జీజీహెచ్‌లో సౌకర్యాల కల్పనపై దృష్టిసారించిన దాఖలాలు లేవు. మందులు, వైద్య సిబ్బంది కొరత వేధిస్తున్నా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం గమనార్హం.