Nizamabad | కంటేశ్వర్, నవంబర్ 28 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వెల్నెస్ హాస్పిటల్లో కిడ్నీకి పాక్షిక నిప్రెక్టమీ శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. కుడివైపు కిడ్నీ(మూత్రపిండం)కి పాక్షిక నిప్రెక్టమీ శస్త్ర చికిత్స చేసి సగం కిడ్నీని కాపాడమని వెల్నెస్ ఆసుపత్రి యూరాలజీ వైద్యులు ఎలసాని ప్రశాంత్ రెడ్డి అన్నారు. నగరంలోని ఖలీల్ వాడి వెల్నెస్ హాస్పిటల్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గాంధారికి చెందిన మద్దెల కాశయ్య వయస్సు (60) 10 రోజుల క్రితం వెల్నెస్ ఆసుపత్రికి వచ్చారని, ఆయనకు అన్ని రకాలుగా వైద్య పరీక్షలు నిర్వహించామని చెప్పారు. కాగా కిడ్నీలో కొంతవరకు క్యాన్సర్ గడ్డలాగా ఏర్పడడంతో పూర్తిగా కిడ్నీని తొలగించకుండా ఎక్కడైతే క్యాన్సర్ గడ్డ ఏర్పడిందో ఆ భాగాన్ని తొలగించినట్లు చెప్పారు.
ప్రస్తుతం సగం తొలగించిన తర్వాత మిగతా సగం తో యథావిధిగా కిడ్నీ ఫంక్షన్ జరుగుతుందని తెలిపారు. చికిత్స పూర్తయిన తర్వాత మూడు రోజులు ఆస్పత్రిలో అబ్జర్వేషన్ లో ఉంచి సగం కిడ్నీ పనితీరును పూర్తిగా పరిశీలించిన అనంతరం డిస్చార్జ్ చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఉపాధ్యక్షుడు బోదు అశోక్ కుమార్ మాట్లాడుతూ నిజామాబాద్ వెల్నెస్ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ సర్జరీ చాలా తక్కువ ఖర్చుతో అంతర్జాతీయ ప్రమాణాలతో మేము వైద్యం అందిస్తున్నామని అన్నారు. ఎవ్వరైనా సరే నిజామాబాద్ ప్రజలు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు వెల్నెస్ ఆసుపత్రిలో సేవలను వినియోగించుకోవాలని కోరారు.
అతి తక్కువ ఖర్చుతోనే హైదరాబాద్ వెళ్లకుండా నిజామాబాదులోనే వైద్యం అందించేందుకు వెల్నెస్ ఆసుపత్రి వైద్యులు అందుబాటులో ఉంటారన్నారు. ఆపరేషన్ హెడ్ హరికృష్ణ గౌడ్ మాట్లాడుతూ నిజామాబాద్ చుట్టుపక్కల చాలామంది పేద ప్రజలు ఉంటారని, వారి కోసం నిజామాబాద్ లో తక్కువ ఖర్చులతో నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెల్నెస్ ఆసుపత్రి మేనేజర్ సతీష్, కాశయ్య కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.