కామారెడ్డి, సెప్టెంబర్ 23: బీబీపేట్ మండలంలోని మహాత్మా జ్యోతిరావు పూలే హాస్టల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. సరిపడా గదులు, మరుగుదొడ్లు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు సురేశ్ మాట్లాడుతూ..
బీబీపేట్లోని వసతిగృహంలో సమస్యలు తీవ్రంగా ఉన్నాయన్నారు. 250 మందికి సరిపోయే హాస్టల్ భవనంలో 430 మంది విద్యార్థులను ఉంచారని తెలిపారు. విద్యార్థుకు సరిపడా గదులు, బాత్రూంలు లేవని, వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సరైన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. పేరెంట్స్ కమిటీ ప్రతినిధులు కరుణ, లావణ్య, సోనీ, సుజాత, భారతి, రాజు, స్వామి, శ్రీనివాస్, మొగిలయ్య పాల్గొన్నారు.