నిజామాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ విద్యా వ్యవస్థ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతున్నది. కొత్త జిల్లాగా ఏర్పడిన సమయంలో ఎస్సెస్సీ, ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రంలోనే టాప్‌లో నిలిచిన కామారెడ్డి పరిస్థితి ఇప్పుడు దారుణంగా మారింది. తాజాగా 2024-25 విద్యా సంవత్సరంలో ప్రభుత్వం ప్రకటించిన ఫలితాలతో కామారెడ్డి జిల్లా పరువు మొత్తం గంగలో కలిసినట్టయ్యింది. ఎస్సెస్సీలో 20వ స్థానంలో నిలువగా.. ఇంటర్లో ఏకంగా చివరగా 33వ స్థానంలో నిలిచి, పరువు మొత్తం పోగొట్టుకున్నది. ఈ ఫలితాలు ప్రభుత్వ బడుల్లో చదివే పేద, మధ్య తరగతి విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేశాయి. నిష్ణాతులైన ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఉంటారని, క్రమం తప్పకుండా క్లాసులు జరుగుతాయని, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు పంపిస్తే.. పరిస్థితి ఇలా మారడంపై తల్లిదండ్రులు తీవ్ర నిరాశను వ్యక్తంచేస్తున్నారు. ఉత్తీర్ణతా శాతం పెరిగినా.. బార్డర్ మార్కులతో గట్టెక్కిన వారే ఎక్కువ మంది ఉండడం గమనార్హం. పాఠశాల విద్య, ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లోపాలే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. వెనుకబడిన జుక్కల్ నియోజకవర్గంలో పరిస్థితులు మరీ దారుణంగా ఉండగా.. ఎల్లారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాల్లో పరిస్థితిపై పునః పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ప్రత్యేక దృష్టి పెడితేనే నూతన విద్యా సంవత్సరం గాడిలో పడే అవకాశం ఉన్నది.
ప్రభుత్వ పథకాలు, సంక్షేమ ఫలాలు అర్హులకు చేరితే.. ఆ పేరు కలెక్టర్‌కు దక్కుతుంది. ఏ శాఖకు అవార్డులు, రివార్డులు వచ్చినా.. ఢిల్లీ వరకు వెళ్లి సత్కారం పొందేది కూడా కలెక్టర్లే. అనంతరం అదనపు కలెక్టర్లు, ఆయా శాఖల అధికారులకు క్రెడిట్ దక్కుతుంది. కామారెడ్డిలో ప్రస్తుతం విద్యా వ్యవస్థ సరైన మార్గంలోకి రావాలంటే కలెక్టర్ చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. గత విద్యా సంవత్సరం విద్యా వ్యవస్థను గాలికి వదిలేయడంతోనే ఇలాంటి ఫలితాలు వచ్చాయని పలువురు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. సిలబస్ ఇన్‌టైమ్‌లో పూర్తిచేయకపోవడం, స్టడీ అవర్స్ సక్రమంగా నిర్వహించకపోవడం, విద్యార్థులను పరీక్షలకు సంసిద్ధత చేయకపోవడం ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు. ఇంటర్ ఫలితాల్లో 33వ స్థానంలో నిలిచినప్పటికీ.. ఇప్పటికీ ఏ ఒక్కరూ సమీక్షించలేదు. కొత్త విద్యా సంవత్సరంలో నూతన లక్ష్యాలను నిర్దేశించుకోలేదు. ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం పేద, మధ్య విద్యార్థులకు శాపంగా మారింది.
ఎస్సెస్సీ, ఇంటర్ పబ్లిక్ పరీక్షా ఫలితాల్లో అట్టడుగు స్థానంలో నిలిచినా.. ఈ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీ, ఉన్నతాధికారులకు ఏమాత్రం పట్టింపులేకుండా పోయింది. జిల్లా పరువు పోయినా.. వారికి కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదు. ఫలితాలపై ఒక్కరు కూడా కనీసం సమీక్ష నిర్వహించలేదు. ఈ విద్యాసంవత్సరంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చలు కూడా జరుగలేదు. లక్ష్యాలను కూడా నిర్దేశించుకోలేదు. రాష్ట్రస్థాయిలో పాఠశాల విద్య శాఖ నిర్వహించిన శిక్షణా కార్యక్రమాలు మినహా.. జిల్లాను చదువులో ముందు వరుసలో నిలిపేందుకు ప్రత్యేక కార్యాచరణను కూడా రూపొందించుకోలేదు. నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకొని వార్తల్లో నిలిచే జిల్లా విద్యాశాఖ తీరు మేడిపండు చందంలా ఉన్నది. కాంగ్రెస్ పాలనలో మితిమీరిన రాజకీయ జోక్యం, అక్రమ డిప్యూటేషన్లు, బదిలీల్లో పారదర్శకత లోపించడం, ఉపాధ్యాయ సంఘాల ఆరోపణలు తదితర కారణాలతో గందరగోళంగా తయారైంది. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి జిల్లా పరువును నిలబెట్టే ప్ర యత్నం చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
గతంలో పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో కామారెడ్డి జిల్లా ముందు వరుసలో ఉండేది. విచిత్రంగా గడిచిన కాలంలో ఘోరంగా పరువును పోగొట్టుకుంటున్నది. ఇంటర్లో జిల్లా కు 33వ స్థానం రావడం సిగ్గుచేటు. పదిలో 20వ స్థానంలో నిలిచింది. విద్యా శాఖపై పర్యవేక్షణ మరింత పెంచా లి. ప్రస్తుత విద్యా సంవత్సరంలోనైనా మెరుగైన ఫలితాల కోసం కృషిచేయాలి.
– చెలిమెల భానుప్రసాద్, బీఆర్ఎస్ యువజన విభాగం కామారెడ్డి పట్టణ అధ్యక్షుడు
పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో కామారెడ్డి జిల్లా స్థానం ఇంతగా దిగజారడానికి కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలే ప్రధాన కారణం. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకపోవడంతో విద్యా వ్యవస్థ భ్రస్టు పడుతున్నది. మరోవైపు అందుబాటులో ఉన్న కొద్ది మంది టీచర్లు ఇతర వ్యాపారాల్లో తలామునకలవుతున్నారు. పాఠశాలలకు సరిగా రావడం లేదు. అలాంటి వారిపై నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలి. పేద, మధ్య తరగతి వర్గాల పిల్లలకు భరోసాను కల్పించాలి.
-ముదాం అరుణ్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి.