నిజామాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. పంట కోతలు మొదలు నుంచి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించే వరకు ఎన్నో ఆటంకాలను అధిగమించాల్సిన పరిస్థితి. యాసంగి పంట కొనుగోళ్లలో అంతులేని నిర్లక్ష్యం తాండివిస్తున్నది. ధాన్యం కొనాలంటూ రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేయాల్సిన దుస్థితి దాపురించింది. కొనుగోలు కేంద్రాల్లో లారీలు, హమాలీల కొరతతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. దీనికితోడు చిల్లర దోపిడీకి అంతులేకుండా పోతున్నది. కల్లాల్లో విక్రయించిన ధాన్యం సంచులు తరలించాలంటే లారీ యజమానులు బెదిరింపులకు పాల్పడుతున్నారు.
సంచికి రూ.2నుంచి రూ.4వరకు లారీ ఓనర్లు, డ్రైవర్లు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఒకవైపు ధాన్యం కొనుగోలు ప్రక్రియలో జాప్యం నెలకొనగా, మరోవైపు అకాల వర్షాలు రైతులను ఆగమాగం చేస్తున్నాయి. కొనుగోలు కేంద్రాలు, కల్లాలు, రోడ్లపై ధాన్యం నిల్వలు తడిసి ముద్దవుతున్నా.. అధికారులు తమకేమీ పట్టునట్లుగా వ్యవహరిస్తున్నారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పత్తా లేకుండపోవడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నట్లుగా ఉమ్మడి జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగంగా జరగడంలేదు. సన్న వడ్లకు బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే కారణంతోనే జాప్యం చేస్తున్నట్లు బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది.
కేసీఆర్ హయాంలో సమన్వయంతో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ జరిగేది. రవాణా, వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్, సహకార, పౌరసరఫరాల శాఖ, పౌరసరఫరాల సంస్థ అధికారులు నిరంతరం సమన్వయంతో పని చేసేవారు. లారీల కొరత ఇప్పుడు తీవ్రంగా వేధిస్తోంది. గతంలో ఇదే సమస్య తలెత్తితే రోడ్లపై ట్రాన్స్పోర్ట్ అధికారులు అందుబాటులో ఉన్న వాహనాలను కల్లాలకు మళ్లించిన రోజులున్నాయి. కానిప్పుడు పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. ఉన్నతాధికారులు కేవలం కలెక్టరేట్ సమీక్షలకే పరిమితమవుతున్నారు. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఉమ్మడి జిల్లాల్లో ధాన్యం నిల్వలు తడిసిపోయాయి. తడిసిన ధాన్యాన్ని వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించడంలేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ధర్పల్లి మండలం లో మూడు రోజుల క్రితం చిల్లర దోపిడీ వ్యవహారంపై లారీ యజమానాలు, డ్రైవర్లతో రైతులకు ఘర్షణ చోటుచేసుకున్నది. రాత్రివేళ వడ్ల సంచులను తరలించాలంటే బస్తాకు రూ.2 చొప్పున డబ్బులు ముట్టజెప్పాలంటూ పట్టుబట్టడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. డబ్బులు ఇచ్చేవరకు లారీలను కదపకపోవడంతో మిగిలిన చోట్ల బస్తాలను తరలించడానికి జాప్యం నెలకొంటున్నది. మరోవైపు తరుగు పేరుతో రైతులను రైస్ మిల్లర్లు నిలువునా ముంచేస్తున్నారు. కల్లాల్లో క్వింటాలుకు 2 కిలోలు చొప్పున కోత పెడుతుండడంతో అన్నదాతలు లోబోదిబోమంటున్నారు. రైస్ మిల్లులకు బస్తాలు చేరిన తర్వాత క్వింటాలుకు మరో 2కిలోల నుంచి 3 కిలోల చొప్పున కోత విధిస్తున్నారు. పంట పండించడం ఒక ఎత్తయితే ఆ పంటను అమ్ముకోవడం కత్తిమీది సాములా మారింది. కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. కాంటా అయిన ధాన్యం తరలించడంలేదు. లారీల్లో లోడింగ్లోనూ జాప్యం నెలకొంటున్నది. కేంద్రాల నుంచి ధాన్యం తరలించినా, అన్ లోడింగ్ కాకపోవడంతో రైస్ మిల్లులు వద్ద లారీలు బారులు తీరుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదు. కనీసం జిల్లా ఇన్చార్జి మంత్రి, ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యేలు కొనుగోలు తీరుపై కనీసం కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.
కొనుగోలు కేంద్రానికి తీసుకు వచ్చిన వడ్లు ఎప్పుడు కొంటరో తెలియడం లేదు. అకాల వానకు వడ్లు తడిసి పోయాయి. హమాలీలు లేరు. వడ్లు నింపడానికి సంచులు కూడా ఇస్తలేరు. ఎప్పుడు కొంటారని అడిగితే సమాధానం ఇస్తలేరు.
తడిసిన ధాన్యం కొనాలి… ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దయ్యింది.వడ్లను కోసిన వెంటనే తీసుకువస్తే కొనేందుకు ముందుకు రావడం లేదు. తేమ ఉన్నదని దాటవేస్తున్నారు. ఇప్పుడు వాన పడి, వడ్లు తడిసిపోయాయి. మా పరిస్థితి అర్థం కావడం లేదు. తడిసిన ధాన్యం కొనాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
– లత, ముబారక్‌నగర్
కండ్ల ముందే భారీ వానకు వడ్లు తడుస్తుంటే గుండె తరుక్కుపోయింది. వానలో కొట్టుకు పోతున్న వడ్లను చేతులతో ఎత్తి కుప్ప పోసుకున్నాం. మా పరిస్థితి చూస్తుంటే ఏడుపు వస్తుంది. గతంలో ఇలా ఎప్పుడూ కాలేదు.
– పెంచలయ్య, రెడ్డి క్యాంప్
పది రోజుల క్రితం మేం పంట కోసి ధాన్యం తీసుకువచ్చినం.తేమ శాతం ఎక్కువ ఉందంటే ఆరబెట్టుకుంటున్నాం. సరైన వసతులు ఇక్కడ లేవు. మార్కెట్ యార్డులోనే నేలపై వడ్లు ఆరబోసుకున్నాం. వానకు తడిసి పోయాయి. టార్పలిన్లు కూడా దిక్కులేవు. సమయానికి వడ్లు కొని ఉంటే ధాన్యం తడిసేది కాదు.
– ధనలక్ష్మి, తారకరామనగర్