కోటగిరి, ఏప్రిల్ 16: వడ్ల కాంటాలు ప్రారంభం కావడం లేదు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కల్లాలు దాటడం లేదు. దీంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ధాన్యం కొనుగోళ్లలో అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంటాలు ప్రారంభించాలని ఎన్నిసార్లు గోడు వెల్లబోసుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని మండి పడుతున్నారు. అకాల వర్షాలు కురిస్తే ఆర్నెళ్ల కష్టం చేతికందకుండా పోతుందని వాపోతున్నారు.
రైతులు ఈ యాసంగిలో భారీగా వరి సాగు చేశారు. ప్రస్తుతం పంట కోతలు జోరందుకున్నాయి. అయితే, కోత కోసి, ఆరబెట్టి రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. కొన్నిచోట్ల కేంద్రాలు ప్రారంభించినా కాంటాలు మొదలవలేదు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన అనుమతులు రాకపోవడం, రైస్‌మిల్ అలాట్మెంట్లు కాకపోవడంతో ధాన్యం కల్లాలు దాటడం లేదు. ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా వడ్ల రాశులే కనిపిస్తున్నాయి.
అప్పులు చేసి, కష్టపడి పంట పండిస్తే కొనుగోలు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరి కోసి, ఎండబెట్టి కుప్పగా పోసి 20 రోజులవుతున్నా కాంటాలు ప్రారంభం కాలేదని మండిపడుతున్నారు. ఎండలోనే ఉన్న వడ్లు నూకలు అవుతున్నాయని, పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకునే వారు లేరని సుద్దులం తండా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వమని గొప్పులు చెప్పుకోవడమే తప్పితే అన్నదాతల ఇబ్బందులను పట్టించుకునే వారే లేరని వాపోతున్నారు. ఎక్కడపడితే అక్కడ వరి కుప్పులు పోశామని, ఎండకు ఎండి పోతున్నాయని తెలిపారు. ఒకవేళ అకాల వర్షం వస్తే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వడ్లు కొనుగోలు చేయాలని ఐకేపీ వారికి అడిగితే తమకు లేదని అంటున్నారని, కొత్తపల్లి సహకార సం ఘం వారికి అడిగితే ఐకేపీ వారికి ఉన్నదని.. ఇలా పొంతన లేని మాటలు చెబుతున్నారని రైతులు వాపోతున్నా రు. కాంటాలు ప్రారంభించక పోవడంపై ఐకేపీ ఏపీఎంను వివరణ కోరగా, గతేడాది కొనుగోలు కేంద్రం ఉండేదని, కానీ తమకు ఈసారి సుద్దులం తండా లేదని చెప్పారు. మరోవైపు, కొత్తపల్లి సీఈవో వివరణ కోరితే, ఐకేపీకి ఉండేదని, తమకు ఇంకా సుద్దులం తండా కేంద్రం గురించి సమాచారం రాలేదని చెప్పారు.
వడ్లు కుప్పులు పోసి 20 రోజులు అవుతున్నది. మండుటెండలో వడ్లు ఉంటున్నాయి. కాంటా చేయాలని ఎన్నిమార్లు అడిగినా అధికారులు పట్టించుకుంటలేరు. రైతులబాధలు వోళ్లకు పట్టవా..? ఎండకు వడ్లు ఎండి నూకలు అవుతున్నాయి. అప్పులు చేసి పంట పండిస్తే, చివరకు కాంటా చేసే దిక్కులేదు. అధికారులు స్పందించి కాంటాలు ప్రారంభించాలి.
– గోవింద్ నాయక్, సుద్దులం తండా, కోటగిరి మండలం
వడ్లు కొనుగోలు చేస్తలేరు. కోత కోసి 20 రోజులైంది. వడ్లు కుప్పపోసి 15 రోజులు దాటింది. వడ్లు కాంటా చేయాలని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకుంటలేరు. అకాల వర్షం వస్తే మా పరిస్థితి ఏంది? ఉన్నతాధికారులు స్పందించి వెంటనే వడ్లు కాంటాలు పెట్టించాలి.
– ఫిరాజీ నాయక్, సుద్దులం తండా, కోటగిరి మండలం