తెలంగాణ సంస్కతీ సంప్రదాయాలకు ప్రతీకైన సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం కాంగ్రెస్ పాలనలో నిర్లక్ష్యానికి గురవుతున్నది. ఆలయ అభివృద్ధిని రేవంత్ సర్కారు విస్మరిస్తుండడంతో అసౌకర్యాలతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బీఆర్ఎస్ పాలనలో ప్రారంభించిన ఆలయ అభివృద్ధి పనులు కొన్ని పెండింగ్‌లో ఉండగా, పూర్తి చేయడంపై కాంగ్రెస్ సర్కారు శ్రద్ధచూపడం లేదు. దేవాదాయశాఖ మంత్రి ఇచ్చిన హామీలకు దిక్కులేకుండా పోయింది.
చేర్యాల, జూలై 21: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న ఆలయానికి వచ్చే భక్తులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య బస చేసేందుకు కాటేజీలు లేకపోవడం. ప్రస్తుతం ఉన్న కాటేజీలు స్వామి వారి భక్తులు(దాతలు) సొంత ఖర్చులతో నిర్మించినవి కావడంతో ఉత్సవాల సమయంలో గదులు కావాలంటే లభించని పరిస్థితి నెలకొంది. కాటేజీల సమస్య పరిష్కరించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి డోనర్ స్కీం ప్రారంభించారు.
ఆలయానికి సమీపంలో అన్ని వసతులతో 100 కాటేజీలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. డోనర్ స్కీం ప్రారంభించిన విషయం తెలుసుకున్న భక్తులు రూ.1.50 కోట్ల విరాళాలు ఇచ్చారు. ఒక్కో కాటేజీకి రూ. 15లక్షల చొప్పున ఖర్చు చేసి నిర్మాణ పనులు ప్రారంభించేందుకు దేవాదాయశాఖ అనుమతి ఇవ్వడం లేదు. దీంతో కాటేజీల నిర్మాణానికి మోక్షం కలగడం లేదు. భక్తుల నుంచి వసూలు చేసిన రూ.1.50 కోట్లు స్వామి వారి ఖజానాలో వేసి ఆలయ అధికారులు చేతులు దులుపుకొన్నారు.
బీఆర్ఎస్ హయాంలో కొత్త జిల్లాల ఏర్పాటు చేసి సంవత్సరం పూర్తయిన సమయంలో మల్లన్న క్షేత్రానికి గదులు సమస్య గుర్తించిన కేసీఆర్, 50 గదులు నిర్మించేందుకు నిధులు మంజూరు చేశారు. ఆలయం నుంచి కొన్ని నిధులు, మరిన్ని నిధులు పంచాయతీరాజ్‌శాఖ నుంచి చెల్లించేందుకు అన్ని అనుమతులు ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నరేండ్లు గడుస్తున్నా 50 గదుల భవన నిర్మాణ పనులు పూర్తిచేయడం లేదు. దీంతో భక్తుల గదుల సమస్య ఎదుర్కొంటున్నారు.
భక్తులు మొక్కుల రూపంలో చెల్లించిన మిశ్రమ బంగారంతో బీఆర్ఎస్ హయాంలో అప్పటి మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక శ్రద్ధ వహించి మల్లన్నస్వామికి బంగారు కిరీటం తయారు చేయించి, కల్యాణోత్సవం రోజు స్వామి వారికి సమర్పించారు.కాంగ్రెస్ సర్కారు వచ్చిన అనంతరం దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అమ్మవార్లకు భక్తులు సమర్పించిన బంగారంతో కిరీటాలు తయారు చేసి కల్యాణోత్సవం రోజు సమర్పిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి హామీ ఇచ్చి ఏండ్లు గడుస్తున్నా, ఇప్పటి వరకు కిరీటాల తయారీలో ఎలాంటి పురోగతి లేదు.
కొమురవెల్లి మల్లన్న ఆలయ గుట్ట పై నిర్మించిన ఢమరుకం, త్రిశూలం ఏర్పాటు నిర్మాణ పనులు సైతం చివరి దశకు చేరుకున్నా, వాటిని వివిధ రకాల సాకులతో పెండింగ్‌లో పెట్టారు.స్వామి వారి ఆలయానికి రోజురోజుకూ భక్తుల తాకిడి పెరుగుతున్నది. ప్రస్తుతం ఉన్న అధికారులు, సిబ్బంది సరిపోవడం లేదని కొత్తగా సిబ్బందిని నియమించేందుకు (క్యాడర్ స్ట్రెంత్) అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆలయ అధికారులు ఏడాది కిత్రం ఫైల్ అందజేశారు. దానిపై దేవాదాయశాఖ కమిషనర్ సంతకం చేసినప్పటికీ, ఓ సెక్షన్లో అధికారి మాత్రం తన చేతులు తడపలేదని వివిధ సాకులు చూపించి ఫైల్‌ను పక్కన పెట్టినట్లు సమాచారం.దీంతో పాటు డిప్యూటీ కమిషనర్ హోదా కలిగిన కొమురవెల్లి మల్లన్న ఆలయానికి రెగ్యులర్ ఈవోను నియమించకుండా కొన్నేండ్లుగా ఇన్చార్జిలను నియమిస్తున్నారు. దీంతో మల్లన్న ఆలయంలో భక్తులకు సరైన సేవలు అందడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.