రామగిరి, జూలై 21: రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ సర్వ నాశనం చేస్తున్నదని, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంటు, స్కాలర్ షిప్పులను వెంటనే విడుదల చేయాలని మంగళవారం నల్లగొండలోని లయన్స్ భవనంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, విద్యార్థి సంఘాల నేతలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు, మేధావులు డిమాం డ్ చేస్తూ కాంగ్రెస్ ఫ్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు.
బీఆర్ఎస్ నాయకుడు ఏనుగు రాకేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, మేధావులు పాల్గొన్నారు. రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యఅతిథిగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి హాజరు కాగా మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల భగత్, మాజీ ఎమ్మె ల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఉద్యమకారుడు డాక్టర్ చెరుకు సుధాకర్, విద్యార్థి, ప్రజా సంఘాలు, కళాశాలల యాజమాన్యాలు, పార్టీల నేతలు మాట్లాడా రు.
వీరితోపాటు సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు బొనగిరి దేవేందర్, బీసీ, ప్రజా సంఘాల నేతలు మిర్యాల యాదగిరి, దుడుకు లక్ష్మీనారాయణ, ఐతగోని జనార్దన్‌గౌడ్, రావుల శ్రీనివాస్‌రెడ్డి, కొం డూరు సత్యనారాయణ, పాలడుగు నాగార్జున, ఎండీ రఫీ, ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు హనుమంతు యాదవ్, మల్లారెడ్డి, రాజేందర్‌రెడ్డి, బీఆర్ఎస్వీ, డీవైఎఫ్ఐ, పీడీఎస్‌యూ, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఎంఎస్ఎఫ్, ఎంజీయూ, స్వేరోస్ విద్యార్థి సంఘాల జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు పిల్లుట్ల రవి, బొమ్మరబోయిన నాగార్జున, వాడపల్లి నవీన్, షోయబ్, మల్లం మహేశ్, ఇం దూరి సాగర్, వంశీకృష్ణ, శంకర్, మాచర్ల సుధీర్, రాపోజు శ్రీజ, కార్పొరేటర్లు, వివిధ సంఘాల నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
10 వేల మంది విద్యార్థులతో నల్లగొండలో గర్జన.. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి
అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు హెలికాప్టర్లలో పర్యటిస్తూ రూ.లక్షలు ఖర్చు చేస్తూ..విద్యార్థుల ఫీజులకు డబ్బులు లేవనడం దారుణమని విమర్శించారు. పెండింగ్ బకాయిల కోసం నల్లగొండ కేంద్రంగా 10 వేల మంది విద్యార్థులు, తల్లిదండ్రులతో భారీ ఉద్యమ గర్జన చేపడతామని హెచ్చరించారు. దీనికి కేటీఆర్ హాజరవుతారని తెలిపారు. ఎంజీ వర్సిటీ వీసీ యూనివర్సిటీని నాశనం చేస్తున్నారని, సంస్కరణలంటూ వర్సిటీలోని విద్యార్థులను భయభ్రంతులకు గురిచేస్తూ పేద విద్యార్థులను చదువుకు దూరం చేసేలా వ్యహరిస్తున్నారన్నారు. ఆయన సంస్కరణలతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వందలాది కళాశాలలు మూతపడ్డాయని, దీంతో వాటిలో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బంది సైతం రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు.
అప్పులు చేసి కళాశాలలు నిర్వహించలేకనే మూసివేశాం.. మారం నాగేందర్‌రెడ్డి
2021 నుంచి కళాశాలలకు ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలు ఉన్నాయి. 2001 నుంచి 2026 వరకు కళాశాలలను నిర్వహించాం. కరెంట్ బిల్లులు, మున్సిపల్ ట్యాక్స్‌లు, అధ్యాపకులు, సిబ్బంది వేతనాలు అప్పులు చేసి చెల్లించలేక కళాశాలలను మూసివేశాం. ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. యాజమాన్యాలు అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్నారు. మరికొంత మంది అదే ఆలోచనలో ఉన్నారు. అలాంటి ఆలోచన వద్దని భరోసా ఇస్తూ మనోధైర్యంతో బతుకుతున్నాం. ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న రూ.11 వేల కోట్లను విడుదల చేయాలి. వీటిలో యాదాద్రి, సూర్యాపేట కంటే నల్లగొండ జిల్లాకు చాలా అన్యాయం జరుగుతోంది. కళాశాలల యాజమాన్యాలను ఆదుకొని అధ్యాపకులకు ఉపాధి కల్పించాలి.
విద్యా వ్యవస్థ నిర్వీర్యం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి
కాంగ్రెస్ పాలన అంటేనే సంక్షోభమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి మండిపడ్డారు. కేవలం 30 నెలల కాలంలోనే రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను నాశనం చేశారని విమర్శించారు. తెలంగాణను శాశ్వతంగా బ్రష్టు పట్టించాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యాశాఖను తన వద్దే ఉంచుకొని, విద్యా రంగాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంటు, స్కాలర్‌షిప్పుల బకాయిలను విడుదల చేసే వరకు విద్యార్థులకు, యాజమాన్యాలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. ఈ అంశాలపై ప్రభుత్వంపై శాసన మండలిలో పోరాటం చేస్తామన్నారు.
కేసీఆర్ హయాంలో పురోగతి .. మాజీ ఎమ్మెల్యే నోముల భగత్
కేసీఆర్ పాలనలో గురుకులాలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసి విద్యారంగాన్ని అద్భుతంగా తీర్చిదిద్దామన్నారు. కానీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విద్యావ్యవస్థను ఎలా నాశం చేయాలో అలా చేసిందన్నారు. గత 30 నెలలుగా గురుకులాలతోపాటు ఆశ్రమ పాఠశాలలను, పాఠశాలలను నిర్వీ ర్యం చేశారన్నారు. విద్యా వ్యవస్థను కాపాడుకోవాలంటే మళ్లీ కేసీఆర్ ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు.
విద్యకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి..మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
విద్యా ప్రమాణాల పెంపుపై ప్రభుత్వాలు దృష్టి సారించకపోవడం వల్లే మన దేశం 78 ఏండ్లుగా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉండిపోయిందని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. రూ. 3 లక్షల కోట్ల పైచిలుకు బడ్జెట్ ఉన్న తెలంగాణలో కేవలం రూ.11వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంటే, స్కాలర్షిప్ బకాయిలను నిరుపేద విద్యార్థుల భవిష్యత్తు కోసం వెచ్చించాలన్న సోయి లేకపోవడం దుర్మార్గమన్నారు.
ఉద్యమం ఆగదు.. బీఆర్ఎస్వీ ప్రధాన కార్యదర్శి నాగార్జున
ఫీజు రీయింబర్స్‌మెంటు, స్కాలర్‌షిప్పులను విడుదల చేసే వరకు ఉద్యమం ఆగదు. ఇప్పటికే పలు పర్యాయాలు ఉద్యమాలు చేసినా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఎంతో మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. ప్రభుత్వం నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం.స్కాలర్షిప్పులు విడుదల చేసే వరకు విద్యార్థులకు, కళాశాలల యాజమాన్యాలకు అండగా ఉంటాం.
ఇది సామాజిక సమస్య.. బీఆర్ఎస్ నేత ఏనుగు రాకేశ్‌రెడ్డి
ఫీజు రీయింబర్స్‌మెంటు, స్కాలర్షిప్ సమస్య కేవలం కళాశాలలది మాత్రమే కాదని, ఇదొక సామాజిక సమస్య అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచన మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగు రాకేశ్‌రెడ్డి తెలిపారు. నాడు ఎన్టీఆర్ మధ్యాహ్న భోజనం, ఉచిత విద్య, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం, కేసీఆర్ విదేశీ విద్య స్కాలర్షిప్పులతోపాటు పేద విద్యార్థుల కోసం గురుకులాలను వారి పాల నా కాలాల్లో అమలు చేశారని గుర్తు చేశారు. మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ, హెలికాప్టర్లు, ప్రచారాలకు లక్షల కోట్లు ఉంటాయి.. కానీ, పేద విద్యార్థుల ఫీజులకు నిధులు ఉండవా అని ప్రశ్నించారు. ఫీజులు చెల్లిస్తే కమీషన్లు రావు కాబట్టే ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. వాటిని విడుదల చేసే వరకు విద్యార్థులకు, కళాశాలల యాజమాన్యాలకు అండగా ఉంటూ పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు.
ఎన్నోసార్లు ధర్నాలు చేశాం.. డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మహేశ్
పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంటు, స్కాలర్షిప్పులు మంజూరు చేయాలని ఇప్పటికే పలు పర్యాయాలు ధర్నాలు, నిరసనలు చేశాం. అయినా ప్రభుత్వానికి విద్యార్థులపై కనికరం కలగడం లేదు. వైఎస్ తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంటు పథకానికి తూట్లు పొడిచేలా జీవోలు తెస్తూ విద్యావ్యవస్థను నాశనం చేస్తున్నారు. రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఫీజు రీయింబర్స్‌మెంటు, సాల్కర్షిప్పులు విడుదల చేసి పేద విద్యార్థుల చదువులతోపాటు కళాశాలల యాజమాన్యాలకు భరోసా కల్పించాలి. లేని పక్షంలో విడుదల చేసే వరకు ఉద్యమం ఆగదు. జరుగబోయే పరిమాణాలకు ప్రభుత్వమే బాధ్య త వహించాల్సి ఉంటుంది.
ఉద్యమ ఆకాంక్షలు రేవంత్‌కు తెలియవు.. చెరుకు సుధాకర్
తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమాల్లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ నుంచి కేసీఆర్ వరకు విద్యార్థుల భవిష్యత్తే ప్రధాన ఎజెండాగా పనిచేశారని ఉద్యమ కారుడు డాక్టర్ చెరుకు సుధాకర్ గుర్తుచేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి ఉద్యమంతో సంబంధం లేకపోవడం వల్లే విద్యాశాఖ మంత్రిగా ఉంటూ విద్యా రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలను విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలన్నారు. లేని పక్షంలో జరుగబోయే వాటికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.