(స్పెషల్ టాస్క్ బ్యూరో) న్యూఢిల్లీ, జూలై 21: నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతలు, జెన్‌జీ యువత, విద్యార్థులు దేశ రాజధాని ఢిల్లీలో నెలరోజుల నుంచి పెద్దయెత్తున పోరాటం చేస్తున్నారు. సోమవారం పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నించిన విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జీ చేయడం, బాష్పవాయు గోళాలు ప్రయోగించడంతో పరిస్థితి మరింతగా దిగజారింది. విద్యార్థులపై కేంద్రం సాగిస్తున్న దమనకాండపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆందోళనలు ఉద్ధృతమవుతుండటంతో సీజేపీ నేతలతో కేంద్రం సంప్రదింపులు కూడా మొదలుపెట్టింది. జెన్‌జీ ఉద్యమంతో బీజేపీ ప్రభుత్వానికి సెగ తగిలిందంటూ సర్వత్రా చర్చ మొదలయ్యింది. ఇది గమనించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆయన పరివారం కథ క్లైమాక్స్‌లో హైడ్రామాకు తెరతీశారు. స్వాతంత్య్ర భారత దేశంలో ఎన్నడూ చూడని విధంగా ప్రధాన ప్రతిపక్ష నేత ప్రధానమంత్రి ఇంటి ముందే ధర్నాకు దిగారు. దీంతో జెన్ జీ ఉద్యమం క్రెడిట్ చోరీకి కాంగ్రెస్ ప్రయత్నించినట్టు మంగళవారం జరిగిన పరిణామాలను బట్టి అర్థమవుతున్నదని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతుండటం గమనార్హం
ఉన్నట్టుండి హడావుడి
నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేతో పాటు మరికొందరు విద్యార్థులు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద గత నెల 20న నిరసన దీక్ష చేపట్టారు. ఆ తర్వాత ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్షకు దిగారు. దాదాపు నెలరోజులుగా సీజేపీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. సోమవారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో పార్లమెంట్ ముట్టడికి సీజేపీ నేతలు, విద్యార్థులు ప్రయత్నించడం.. పోలీసులు లాఠీఛార్జీ చేయడం వివాదాస్పదమయ్యింది. ఈ క్రమంలో జెన్ జీ యువతకు సోషల్‌మీడియాలో పెద్దయెత్తున మద్దతు లభించింది. ఇది గమనించిన రాహుల్‌గాంధీ ఆయన పరివారం.. 31 రోజుల తర్వాత మంగళవారం ఉన్నట్టుండి ప్రధాని మోదీ ఇంటిని ముట్టడించి పెద్ద డ్రామాకు తెరతీసింది.
ఖర్గే ఇంటి నుంచి ప్రధాని నివాసానికి
మంగళవారం మధ్యాహ్నం తొలుత కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఇంటిముందుకు చేరుకొన్న రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ తదితరులు అక్కడి నుంచి లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని ఇంటి ముట్టడికి బయల్దేరారు. సాయంత్రం మోదీ ఇంటి ముందు ధర్నాకు దిగారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి జితేంద్రసింగ్.. రాహుల్‌తో చర్చలు జరిపారు. ఆ తర్వాత సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్‌యాదవ్ కూడా ఈ ధర్నాలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాలు చేయాలని నినదించారు. ఈ క్రమంలో రాహుల్, ప్రియాంక, అఖిలేశ్‌తో పాటు కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకొన్న పోలీసులు బస్సులో అక్కడి నుంచి తరలించారు.
రాహుల్ మాట తప్పారు..
నీట్ పేపర్ లీకేజీపై పార్లమెంట్లో చర్చిస్తే ధర్నాను ముగిస్తామంటూ చర్చల సమయంలో మాటిచ్చిన రాహుల్ ఆ తర్వాత మాటతప్పారని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ ఆరోపించారు. నీట్ లీకేజీపై పార్లమెంట్లో తొలుత చర్చను మాత్రమే కోరిన రాహుల్.. తర్వాత ప్రధాన్ రాజీనామా చేయాలని మాటమార్చారని దుయ్యబట్టారు. ప్రతిపక్ష నేత ఇలా మాటతప్పడం దురదృష్టకరమని, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. అయితే, తమ డిమాండ్లను కేంద్రం నెరవేర్చకపోవడంతోనే ధర్నాను కొనసాగించినట్టు కాంగ్రెస్ ఎంపీ సయ్యద్ నజీర్ హుస్సేన్ పేర్కొన్నారు.
బీజేపీతో రాహుల్ కుట్ర: ఆప్
విద్యార్థి ఉద్యమం తారాస్థాయికి చేరిన సమయంలో దాన్ని నిర్వీర్యం చేయడానికి రాహుల్ ప్రయత్నిస్తున్నారని ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) నేత సోమ్‌నాథ్ భారతి ఆరోపించారు. ‘ప్రస్తుత నీట్ వివాదాన్ని డైవర్ట్ చేయడానికి బీజేపీతో కాంగ్రెస్ చేతులు కలిపింది. బీజేపీ ఒత్తిడికి రాహుల్ తలొగ్గారు. ఒకవేళ, రాహుల్ నిజంగా విద్యార్థులకు సంఘీభావం ప్రకటించాలని కోరుకొంటే జంతర్‌మంతర్‌కు వెళ్లొచ్చుగా. ప్రధాని ఇంటి ముందు ధర్నా ఎందుకు?’ అని సోమ్‌నాథ్ భారతి నిలదీశారు.
ముమ్మాటికీ బీజేపీ-కాంగ్రెస్ డ్రామానే!
ప్రధాని ఇంటి ముందు కాంగ్రెస్ నేతల ధర్నాను నెటిజన్లు తీవ్రంగా తప్పుబట్టారు. విద్యార్థుల నిరసనలు నెలరోజుల నుంచి జరుగుతుంటే, ఫీల్డ్‌లో కనిపించని కాంగ్రెస్ నేతలు.. తుది దశలో ఎంటరై క్రెడిట్ చోరీకి విఫలయత్నం చేస్తున్నారని పలువురు ఎద్దేవా చేశారు. మంగళవారం సాయంత్రం పీఎం ఇంటిముందు కాంగ్రెస్ నేతల ధర్నా.. పోలీసుల రంగప్రవేశం.. రాహుల్ తదితరుల అరెస్ట్.. ఇదంతా ఇష్యూను డైవర్ట్ చేయడానికేనని దుయ్యబట్టారు. దీన్నంతా చూస్తుంటే, విద్యార్థుల ఉద్యమాన్ని నీరుగార్చేందుకు బీజేపీ-కాంగ్రెస్ ఆడిన డ్రామాగా కనిపిస్తున్నదని కౌశల్ అనే నెటిజన్ అనుమానం వ్యక్తం చేశారు. కట్టుదిట్టమైన భద్రత కలిగిన ప్రధాని ఇంటి ముందు వరకూ కాంగ్రెస్ నేతలు ఎలా వెళ్లగలిగారని మరో నెటిజన్ అవినాశ్ ప్రశ్నించారు. బీజేపీ హస్తం లేదంటారా? అని ఓ ఎమోజీ పెట్టారు.
స్వతంత్ర భారతంలో తొలిసారి!
ప్రధానమంత్రి ఇంటి ముందు ప్రతిపక్ష నాయకుడు ధర్నా చేయడం దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత బహూశా ఇదే తొలిసారి కావొచ్చని రాజకీయ పండితులు మంగళవారం ఉదంతాన్ని గుర్తుచేసుకొంటూ అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ సమీపంలో, ఇండియా గేట్ దగ్గర, జంతర్‌మంతర్ తదితర ప్రాంతాల్లో ధర్నాలు సాధారణమని, అయితే, ప్రధాని ఇంటి ముందు ఇదే తొలిసారని అంటున్నారు. 1975నాటి జేపీ మూమెంట్, 2020లో జరిగిన రైతు ఉద్యమంలో కూడా ఎవ్వరూ ప్రధాని ఇంటి ముందు ఆందోళనలు చేపట్టలేదని గుర్తు చేశారు.