ములుగు : మున్సిపాలిటీ పరిధి గణేష్లాల్ పల్లిలో విషాదం చోటుచేసుకుంది. గ్రామ సమీపంలోని మొండి కుంటలో పడి ఒకేకుటుంబానికి చెందిన మాలోతు వినయ్ (15), రాజేష్ (12) మృతి చెందారు. అన్నదమ్ములైన ఇద్దరూ.. ఒకేరోజు మరణించడంతో తల్లిదండ్రులు దేవుడా.. ఎంత ఘోరం జరిగిపోయింది అని గుండెలవిసేలా రోదిస్తున్నారు.
మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన మాలోతు యాకూబ్ – సునీత దంపతులకు వినయ్, రాజేశ్ ఇద్దరు కుమారులు. రాఖీ పౌర్ణమికోసం వీరు శనివారం తల్లితో కలిసి ములుగు మున్సిపాలిటీ పరిధిలోని అమ్మమ్మ ఊరు గణేష్లాల్ పల్లికి వచ్చారు. ఆదివారం సాయంత్రం ఇద్దరూ మొండి కుంట సమీపంలో బహిర్భూమికి వెళ్లారు. ప్రమాదవశాత్తు తమ్ముడు రాజేష్ కుంటలో పడి మునిగిపోతుండగా అన్న వినయ్ అతడిని కాపాడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో వినయ్ కూడా నీళ్లలో పడిపోయాడు. కుంటలో మునిగి ఇద్దరు అన్నాదమ్ములు మృతి చెందారు. ఇద్దరి మృతదేహాలను ములుగు జనరల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.