కంటేశ్వర్, మార్చి 21 : ఏఐసీసీ పిలుపు, పీసీసీ ఆదేశాల మేరకు శుక్రవారం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అధ్యక్షతన రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, మాజీ ఎమ్మెల్యే ఆరికల నర్సారెడ్డి, సిరిసిల్ల గ్రంథాలయ చైర్మన్ సంతోశ్, నుడ చైర్మన్ కేశ వేణు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. అందరి భవిష్యత్ కోసం జై బాపు, జై భీమ్, జై సంవిదాన్ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. దేశ ప్రజలకు సమాన హక్కులు, సమన్యాయం కల్పించిన రాజ్యాంగాన్ని కాలరాస్తూ అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరును ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి మండలం, గ్రామంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగ సిద్ధాంతాలకు బీజేపీ తూట్లు పొడుస్తూ పరిపాలన కొనసాగిస్తుందని, దానిని అడ్డుకోవాల్సిన బాధ్యత భారత పౌరులందరిపై ఉందని పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ మాట్లాడుతూ..రాజ్యాంగ పరిరక్షణ అనేది ప్రజలందరి బాధ్యత అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలు చేయడం ద్వారా దేశంలో బీజేపీ చేస్తున్న కుట్రలను ప్రజలకు వివరించవచ్చు అన్నారు. గ్రామ గ్రామాన క్షేత్రస్థాయిలో పాదయాత్రలు చేయడం ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వాటిని పరిష్కరించే విధంగా దోహద ఉపయోగపడుతుందన్నారు. ప్రతి మండలంలో ఈ నెల 28వ తేదీ వరకు రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలు నిర్వహించి తెలంగాణ రాష్ట్రంలో అన్నిటికంటే ముందు నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ రూరల్ బాల్కొండ నియోజకవర్గంలో ఈ కార్యక్రమము పూర్తిచేసే విధంగా కంకణ బద్ధులమై పని చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బాల్కొండ ఇన్చార్జి సునీల్ రెడ్డి, ఆర్మూర్ ఇన్చార్జి వినయ్ రెడ్డి, ప్రచార కమిటీ కో ఆర్డినేటర్ ఏబీ శ్రీనివాస్, పీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి నగేశ్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ రమేశ్‌రెడ్డి, మార్క్‌ఫెడ్ చైర్మన్ మర గంగారెడ్డి, ప్రచార కమిటీ మెంబర్ జావేద్ అక్రమ్, మాజీ పీసీసీ కార్యదర్శి భూపాల్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు గోపి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపూల్ గౌడ్, NSUI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణురాజ్, జిల్లా ఓబీసీ అధ్యక్షుడు నరేందర్ గౌడ్, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు సంతోష్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు లింగం, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు యాదగిరి, జిల్లా ఫిషర్మాన్ అధ్యక్షుడు శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు అవెజ్ ఖాన్, ఈసా, సుమన్, సాకినాల శివకుమార్, పి.గంగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, వివిధ మండలాల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
Padayatras : రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యంగా పాదయాత్రలు : ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి