కంటివెలుగు కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాలో విశేష స్పందన లభిస్తున్నది. ఊరూరా విజయవంతంగా కొనసాగుతున్నది. రెండు జిల్లాల్లో కలిపి నేత్ర పరీక్షల సంఖ్య ఇప్పటికే ఐదు లక్షలు దాటింది. లక్షకు పైగా కళ్లద్దాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ప్రజలకు కంటి సమస్యలు లేకుండా చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ‘కంటివెలుగు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దృష్టి సమస్యలు దూరం చేసి, కొత్త వెలుగులు నింపుతున్నారు. జనవరి 19న రెండో విడుత కంటివెలుగు కార్యక్రమం ప్రారంభం కాగా, నాటి నుంచి నేటి వరకూ ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తున్నది. సెలవులు పోనూ 46 రోజుల పాటు శిబిరాలు నిర్వహించగా, ఉదయం నుంచే జనం బారులు తీరుతున్నారు. వైద్యులు నేత్ర పరీక్షలు చేసి, అవసరమైన వారికి కండ్లద్దాలు, మందులు ఇస్తున్నారు. గురువారం నాటికి 5.40 లక్షల మంది నేత్ర పరీక్షలు చేయించుకున్నారు. 1.05 లక్షల మందికి కళ్లజోళ్లు అందించారు. శిబిరాల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నది.
– కామారెడ్డి/ఖలీల్‌వాడి, మార్చి23
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది. అంధత్వరహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఊరూరా శిబిరాలను ఏర్పాటుచేసి కంటిపరీక్షలు చేస్తున్నారు. అధికారిక సెలవులు, శని, ఆదివారాల్లో తప్ప మిగితా రోజుల్లో కంటి వెలుగు శిబిరాలు కొనసాగుతున్నాయి.18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అంగన్వాడీ, ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లి అర్హులను గుర్తిస్తున్నారు. కంటివెలుగు ఆహ్వాన పత్రాలను అందజేసి వైద్య శిబిరాలకు తరలిస్తున్నారు. దగ్గరుండి కంటిపరీక్షలు చేయిస్తున్నారు. చిన్నచిన్న కంటి సమస్యలతో బాధపడుతున్నవారికి శిబిరంలోనే మందు లు ఇస్తున్నారు. ప్రతి శిబిరంలో రీడింగ్ గ్లాసెస్ అందుబాటులో ఉంచుతూ అవసరమైనవారికి పంపిణీ చేస్తున్నారు.
దృష్టిలోపం ఉన్న వారి వివరాలను సేకరించి కళ్లద్దాల కోసం ఆర్డర్ ఇస్తున్నారు. వారం రోజుల్లో తయారుచేయించి ఆరోగ్య కార్యకర్తలు ఇంటికి వెళ్లి అందజేస్తున్నారు. ఆపరేషన్ అవసరం ఉన్న వారిని హైదరాబాద్‌కు రెఫర్ చేస్తూ ఉచితంగా శస్త్రచికిత్స చేయిస్తున్నారు. శిబిరాలకు హాజరయ్యేవారికి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో కంటివెలుగు కార్యక్రమం ప్రారంభం నుంచి పల్లెలు, పట్టణాల్లో ఇప్పటివరకు 46 రోజులపాటు శిబిరాలు ఏర్పాటు చేశారు. ప్రజలు ఉత్సాహంగా శిబిరాలకు తరలిస్తున్నారు. కామారెడ్డి, నిజామాబాద్ కలెక్టర్లు జితేశ్ పాటిల్, రాజీవ్‌గాంధీ హన్మంతుతోపాటు జిల్లా వైద్యాధికారులు నిరంతరం శిబిరాలను తనిఖీ చేసి సమస్యలుంటే వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నారు. పలు గ్రామాల్లో కంటి వెలుగు శిబిరాలను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారంభి స్తున్నారు. ప్రజలకు కంటి వెలుగు కార్యక్ర మంపై అవగాహన కల్పిస్తున్నారు. కంటి వెలుగు శిబిరాలకు వచ్చేలా చర్యలు తీసు కుంటున్నారు.
5,40,095 మందికి కంటి పరీక్షలు
రాష్ట్రంలో ఇప్పటివరకు 46 రోజులపాటు కంటివెలుగు శిబిరాలు నిర్వహించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 109 వైద్య బృందాలతో శిబిరాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 5,40,095 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 1,05,680 మందికి కళ్లద్దాలను అందజేశారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 44 బృందాలతో 606 శిబిరాలను ఏర్పాటుచేశారు. ఈ శిబిరాల్లో 2,35,023 మందికి కంటి పరీక్షలు చేసి, దృష్టిలోపం ఉన్న 36,497 మందికి కంటి అద్దాలను అందజేశారు. జిల్లాకు ఇప్పటికే 41,130 కళ్లద్దాలను కేటాయించారు. ఒక్కో శిబిరంలో ప్రతిరోజూ సుమారు 120 నుంచి 130 మందికి కంటి పరీక్షలు చేస్తుండగా, 44 బృందాలు రోజుకు 5 వేలకు పైగా పరీక్షలు నిర్వహిస్తున్నాయి.
నిజామాబాద్ జిల్లాలో 65 వైద్య బృందాలతో శిబిరాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 3,05,072 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించి, 69,183 మందికి కళ్లద్దాలను అందజేశారు. చిన్నచిన్న సమస్యలు ఉన్నవారికి మందులు, రీడింగ్ గ్లాసెస్ అందజేస్తున్నారు. దృష్టిలోపం ఉన్న వారికి ప్రిస్క్రిప్షన్‌తో రిఫర్‌చేసి వారికి ఉన్న సమస్య మేరకు అద్దాలను తయారు చేసేందుకు ఆర్డర్ ఇస్తున్నారు. వారంరోజుల్లో అద్దాలు రెడీ అయ్యాక ఆశ కార్యకర్తలు ప్రజల ఇంటికే వెళ్లి అందజేస్తున్నారు. ఆధునిక యంత్రాల సహాయంతో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడంతోపాటు మందులు, కళ్లద్దాలను అందజేయడంపై ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
మా జీవితాలకు వెలుగిచ్చిండు..
మాది పేదకుటుంబం. ప్రైవేటు దవాఖానకు వెళ్లి డాక్టర్‌కు చూపించుకోవాలంటే బాగా పైసలు తీసుకుంటున్నరు. తెలంగాణ సర్కారు కంటివెలుగు పెట్టి ఉచితంగా కండ్లను పరీక్ష చేసిండ్రు. సూపు తక్కువ ఉన్నదని పైసలు తీసుకోకుండనే అద్దాలు, మందులిచ్చిండ్రు. లేదంటే గిట్లనే గుడ్డిగుడ్డిగ కాలం గడిపెటోళ్లం. మా జీవితాలకు వెలుగిచ్చిండు.
-శోభారాణి, కామారెడ్డి
మంచిగా కనవడుతున్నది..
చాలా రోజుల నుంచి కండ్లు సరిగా కనబడ్తలేవు. చాలా ఇబ్బంది పడేదాన్ని దవాఖానకు పోవాలంటే వట్టిగైతదా.. ఇన్నాళ్ల నుంచి పైసల్ లేక డాక్టర్‌కు చూయించుకోలేదు. మాలాంటి వారిని కేసీఆర్ సార్ దేవునిలాగా ఆదుకుంటున్నడు. ఒక మిషిన్తోని ఫ్రీగానే కండ్ల పరీక్షజేసిండ్రు. తర్వాత అద్దాలిచ్చిండ్రు. ఇప్పడు మంచిగ కనవడుతున్నది.
-సుజాత, కామారెడ్డి
గరీబోళ్ల దేవుడు.. కేసీఆర్
చాలా మంది పేదలు పైసలకు భయపడి దవాఖానకు పోతలేదు. కండ్లు కనిపియ్యకున్నా గట్లనే కాలం గడిపేస్తున్నరు. నాలాంటి గరీబోళ్లకు సీఎం కేసీఆర్ దేవుడిలాంటి మనిషి. అన్ని రకాలుగా ఆదుకుంటున్నడు. అద్దాలు కూడా ఇస్తున్నరు. ఇంతకుముందు గరీబోళ్లను ఎవ్వరూ పట్టించుకోలేదు. తెలంగాణ సర్కారు వచ్చినంకనే బతుకులు బాగైతున్నాయి.
-వెంకట రమణ
కేసీఆర్ దయతోనే కండ్లద్దాలు..
నా కండ్లు మసక.. మసక అయినయి. చాలా రోజుల నుంచి సరిగా కనిపియ్యక చాలా కష్టమైంది. ప్రైవేట్ల చూయించుకోవాలంటే చాలా పైసలు గావాలె. ఇక గింతే అనుకున్నా. సీఎం కేసీఆర్ దయతోనే కంటిపరీక్షలు చేయించుకున్న. ఫ్రీగానే కండ్లు చూసి అద్దాలు కూడా ఇచ్చిండ్రు. నేనైతే కండ్లద్దాలు తీసుకుంట అనుకోలేదు. కేసీఆర్‌ను దేవుడు చల్లగా చూడాలె.
-మేరు హనీఫా, కామారెడ్డి