ఖలీల్‌వాడి, జూన్ 10: నిజామాబాద్ జిల్లాలో కొన్ని ప్రైవేటు పాఠశాలలు బెల్టు, యూనిఫామ్‌లు, పుస్తకాల విక్రయాలు చేపడుతున్నాయంటూ నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన కథనం ఆధారంగా డీఈవో దుర్గాప్రసాద్ ఓ ప్రకటన విడుదల చేశారు. పాఠశాల ఆవరణలో బెల్టు, యూనిఫామ్‌లు, పుస్తకాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా ఎలాంటి నోటీసులు జారీ చేయకుండానే ఆ పాఠశాల అనుమతులు రద్దు చేస్తామని ప్రకటనలో స్పష్టం చేశారు. కానీ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యాశాఖ అధికారి ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అధికారులకు చిక్కకుండా ఉండేందుకు మరో రూట్‌ను ఎంచుకున్నారు. విద్యార్థుల సామగ్రి, యూనిఫామ్‌లు, పుస్తకాల కొనుగోలుకు సంబంధించి ఇప్పటి వరకు డిజిటల్ మనీ ప్లాట్‌ఫామ్‌లు అయిన ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం తదితర వాటిని ఎంచుకున్నాయి. కానీ డిజిటల్ మనీ ద్వారా విక్రయాలు కొనసాగిస్తే తనిఖీల్లో దొరికే ఆస్కారం ఉండడంతో మరోదారిలో వెళ్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూలు చేసే ప్రతీది కూడా నగదు(క్యాష్) రూపంలోనే స్వీకరిస్తున్నారు. బెల్టు, యూనిఫామ్స్, పుస్తకాలతోపాటు ఫీజుల చెల్లింపులు ఇక నుంచి నగదు రూపంలోనే చెల్లించాలని పలువురు తల్లిదండ్రుల ఫోన్లకు మెస్సేజ్‌లు పంపుతున్నారు. దీంతో తల్లిదండ్రులు ఏం చేయాలో తెలియక ఇబ్బందులుపడుతున్నారు. ఈ విషయం సైతం విద్యాశాఖ అధికారి తెలిసినా పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
విద్యాశాఖ నుంచే ప్రైవేటుకు సలహాలు..
జిల్లా విద్యాశాఖ అధికారి ఇచ్చిన ప్రకటనతో ప్రైవేటు పాఠశాలలు కొత్తగా క్యాష్ ఫర్ సేల్ అనే విధంగా విద్యార్థుల తల్లిదండ్రులకు మెస్సేజ్‌లు పంపుతున్నాయి. డిజిటల్ మనీ ప్లాట్‌ఫామ్‌తో అయితే దొరికిపోతారనే భావనతో విద్యాశాఖలో పనిచేస్తున్న కొందరు అధికారులే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు సలహా ఇస్తున్నట్లు సమాచారం. మరోవైపు అధికారుల అండదండలతోనే బెల్ట్, యూనిఫామ్‌లు, పుస్తకాలు అమ్ముతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
తనిఖీలు శూన్యమేనా?
జిల్లా విద్యాశాఖ అధికారి ప్రకటన జారీ చేసిన కొద్ది సమయంలోనే పాఠశాల యాజమాన్యాలు తల్లిదండ్రులకు మెస్సేజ్‌లు పంపడంపై అనుమానం నెలకొన్నది. సదరు శాఖలో పనిచేస్తున్న వారే ముందస్తుగా సమాచారం ఇస్తున్నట్లు తెలిసింది. ప్రైవేటు పాఠశాలలు నిర్వహించే ఈ అక్రమ వ్యాపారానికి మామూళ్లు తీసుకునే కొంతమంది అధికారులు వత్తాసు పలుకుతున్నారని పలువురు తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 590 ప్రైవేటు పాఠశాలలుంటే 80శాతం పాఠశాలల్లో అమ్మకాలు జరుపుతున్నట్లు సమాచారం. ఇంత జరుగుతున్నా ఇప్పటి వరకు ఒక్క ప్రైవేటు పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన దాఖలాలు లేకపోవడం గమనార్హం.
దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం..
మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటున్నాం. త్వరలోనే తనిఖీలు నిర్వహి స్తాం. పాఠశాల ఆవరణలో బెల్టు, యూనిఫామ్‌లు, పుస్తకాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవడమే కాదు. అనుమతులు సైతం రద్దు చేస్తాం.