నిజామాబాద్ సిటీ/విద్యానగర్, ఫిబ్రవరి 10: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు హేతుబద్ధంగా జరగలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఉద్యోగుల ఆధ్వర్యంలో భోజన విరామ సమయంలో కలెక్టరేట్లలో నల్లబ్యాడ్జీలు ధరించి గురువారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ అలుక కిషన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్ష, ఉద్యోగుల కోరిక అనుగుణంగానే రాష్ట్రం ఏర్పడిందని, రాష్ట్ర ఏర్పాటుపై వ్యతిరేక భావంతో ఉన్న ప్రధాని మోదీ తీరు మార్చుకోవాలన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ చిత్రామిశ్రాకు ఉద్యోగులు వినతిపత్రం అందజేశారు. కామారెడ్డి కలెక్టరేట్లో ఉద్యోగులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. కామారెడ్డిలో నిర్వహించిన కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ప్రధాని తెలంగాణపై వివక్ష చూపడం బాధాకరం అని అన్నారు. రాష్ట్రం ఏ ఒక్కరి వల్ల రాలేదని అనేక మంది ఉద్యోగులు, నాయకులు, విద్యార్థుల పోరాటం ఫలితంగా వచ్చిందన్నారు. నిజామాబాద్‌లో నిర్వహించిన కార్యదర్శి అమృత్‌కుమార్, సుమన్‌కుమార్, జాకీర్ హుస్సేన్, గంగాకిషన్, గోవర్ధన్, సునీత, జాఫర్ హుస్సేన్, శ్రీనివాస్, సంజీవయ్య, అతీఖ్, పురుషోత్తం, రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు రమణరెడ్డి, అజ్మీర్ రామ్‌జీ, స్వామి, వివిధ శాఖ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డిలో నిర్వహించిన కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి సాయిలు, సహ అధ్యక్షుడు నాగరాజు, ట్రెజరర్ దేవరాజు, ఉపాధ్యక్షుడు చక్రధర్, సాయిలు, జాయింట్ సెక్రటరీ రాజ్‌కుమార్, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.