నిజామాబాద్, ఆగస్టు 16, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) మొఖం చాటేసిన వానలు ఒక్కసారిగా దంచి కొడుతున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో విస్తారంగా కురుస్తోన్న వానలతో జలకళ సంతరించుకుంది. ఎడతెరపి లేకుండా శుక్రవారం అర్ధరాత్రి మొదలైన వాన శనివారం రోజంతా కురిసింది. జల్లులతో కూడిన వర్షమే అత్యధికంగా కురియడంతో ఉమ్మడి జిల్లా తడిసి ముైద్దెంది. భూగర్భ జలమట్టం అమాంతం పెరిగేందుకు ఈ వానలు ఉపకరించాయి. పలు చోట్ల సాధారణ వర్షాపాతం కంటే ఎక్కువే వాన పడటంతో భారీ వర్షాపాతం నమోదైంది. మొన్నటి వరకు లోటు వర్షాపాతం కొట్టుమిట్టాడిన మండలాల్లో అల్పపీడన ప్రభావం మూలంగా కురిసిన వానలతో కరువు ఛాయల నుంచి బయట పడేసింది. అల్పపీడన ప్రభావంతో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శనివారం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో ఏకధాటి వానలు కొనసాగాయి. ఎల్లో హెచ్చరిక జారీ కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తెరపి లేకుండా కురుస్తోన్న వానలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు, ప్రాజెక్టుల్లోకి వరద ప్రవాహం ఉధృతంగా కొనసాగుతోంది. కందకుర్తి త్రివేణి సంగమం వరదతో పోటెత్తుతోంది.
గోదావరి నదికి ధీటుగా మంజీరాలోనూ ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. ఎగువ కురుస్తోన్న భారీ వానలతో సంగారెడ్డి జిల్లాలోని సింగూర్ ప్రాజెక్టుకు 24,718 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తుండటంతో స్పిల్‌వే 5 గేట్లను ఎత్తి 43,176 క్యూసెక్కులు ఔట్‌ఫ్లో కొనసాగిస్తున్నారు. సింగూర్ ప్రాజెక్టు నుంచి వస్తోన్న నీరంతా మంజీరా నది గుండా నిజాంసాగర్ ప్రాజెక్టుకు పోటెత్తుతోంది. ఎగువ వరద రాకతో నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. మంజీరా నది పరివాహక ప్రాంతాల్లోనూ ప్రజలను ఇరిగేషన్ అధికారులు అప్రమత్తం చేశారు. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులకు 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 10 టీఎంసీలకు చేరువలో ఉంది. వరద ఉధృతి ఎగువ నుంచి భారీగా కొనసాగితే నాలుగైదు రోజుల్లో గేట్లు ఎత్తే అవకాశాలు ఉన్నాయి. సింగీతం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువైంది. కళ్యాణి ప్రాజెక్టు 409 అడుగులకు 408 అడుగులకు చేరింది. ఇన్‌ఫ్లో 350 క్యూసెక్కులు ఉండగా ఔట్ఫ్లోనూ అదే స్థాయిలో దిగువకు పంపిస్తున్నారు.
గోదావరి నదిలో భారీగా వరద నీరు పెరిగే అవకాశం ఉన్నది. ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద రానుంది. గోదావరి నదీ పరివాహక ప్రాంత ప్ర జలు అప్రమత్తంగా ఉండాలి. అలాగే పశువుల కాపర్లు, గొర్ల కాపరులు, చేపలు పట్టేవారు, రైతులు గోదావరి నదిని దాటేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నం చేయొద్దు. పోలీస్, రెవెన్యూ, గ్రామ పంచాయతీలకు అప్రమ త్తం చేశాం. ప్రజలు హెచ్చరికలు పాటించాలని కోరుతున్నాము.
– ఎం.చక్రపాణి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, పోచంపాడ్ డ్యామ్‌సైట్
శనివారం తెల్లవారుజాము నుంచే ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు భారీ వరద ఎగువ నుంచి రావడం ప్రారంభమైంది. అర్ధరాత్రి 12గంటలకు ఇరిగేషన్ శాఖ వెల్లడించిన వివరాల మేరకు 70వేల క్యూసెక్కులు వరద ప్రవాహం కొనసాగింది. ఉదయం 6గంటలకు 50వేల క్యూసెక్కులకు వరద తగ్గినప్పటికీ తిరిగి ఉదయం 9గంటల్లోపు 90వేల క్యూసెక్కులకు వరద ప్రవాహం అమాంతం పెరిగింది. ఈ వానాకాలం సీజన్లో దాదాపుగా లక్ష క్యూసెక్కులకు వరద ప్రవాహం చేరడం ఇదీ రెండోసారిగా ఇరిగేషన్ శాఖ చెబుతోంది. ఎస్సారెస్పీలో ప్రస్తుతం 1091 అడుగులు పూర్తి స్థాయి నీటి మట్టానికి 80.5 టీఎంసీలు నీటి నిల్వ సామర్థ్యం ఉంది. 1083 అడుగుల నీటి మట్టంతో ప్రస్తుతం పోచంపాడ్‌లో 52 టీఎంసీలు నీటి నిల్వ ఉంది. గతేడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 1081 అడుగుల నీటి మట్టంతో 48.071 టీఎంసీలు నీటి నిల్వ ఉంది. ఔట్ ఫ్లో 4952 క్యూసెక్కులు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా కాకతీయ కెనాల్‌కు 4వేలు క్యూసెక్కులు, అలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం 180 క్యూసెక్కులు నీళ్లను వదులుతున్నారు. భారీ వానలతో లక్ష్మీ, సరస్వతి, వరద కాలువకు, గుత్పా లిఫ్ట్‌కు నీటి విడుదలను నిలుపుదల చేశారు.