కంఠేశ్వర్, ఫిబ్రవరి 2 : నిజామాబాద్ కార్పొరేషన్లో అధికారుల కొరత స్పష్టంగా కనిపిస్తున్నది. కార్పొరేషన్లో దాదాపు పనులన్నీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో నెట్టుకోస్తుండడంతో పాలనపూర్తిగా స్తంభించింది. హెల్త్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్.. ఇలా ఏ విభాగం చూసినా పూర్తిగా అవుట్సోర్సింగ్ సిబ్బందిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొన్నది.
మున్సిపల్ కార్పొరేషన్‌కు ప్రభుత్వం ఇప్పటివరకు ఎంహెచ్‌వోను నియమించలేదు. పారిశుద్ధ్య నిర్వహణపై పూర్తిగా నిఘా కొరవడింది. ఎంహెచ్వో లేకపోవంతో అడిగేవారు లేక సానిటేషన్ సిబ్బంది ఆడింది ఆట.. పాడింది పాటగా మారింది.
టౌన్ ప్లానింగ్ విభాగం గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేకుండా పోయింది. చేతులు తడిపితే చాలు ఎక్కడైనా అక్రమ నిర్మాణం ఎంతవరకైనా చేసుకోవచ్చనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఓ వ్యక్తి అక్రమ నిర్మాణానికి సంబంధించి కార్పొరేషన్లో ఫిర్యాదు చేయగా పట్టించుకోవడంతో చివరికి టౌన్ ప్ల్లానింగ్ విభాగంపై కలెక్టర్‌కు సైతం ఫిర్యాదు చేశారు. జనవరి 31న టౌన్ ప్లానింగ్ అధికారి సత్యనారాయణ పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో నూతన టౌన్ ప్లానింగ్ అధికారిని నియమిస్తారా లేక ఎంహెచ్వో పోస్ట్లాగా వదిలేస్తారా వేచి చూడాల్సిందే.
మూడు నెలల్లోనే ఇద్దరు సీసీలు బదిలీ అయ్యారు. గతంలో కమిషనర్ సీసీగా పనిచేసిన అంజత్ ఖాన్ డిప్యుటేషన్‌ను కలెక్టర్ రద్దు చేశారు. అనంతరం సీసీగా బాధ్యతలు చేపట్టిన రాకేశ్‌ను ఇంజినీరింగ్ విభాగానికి బదిలీ చేశారు. రెండు నెలల్లోనే రాకేశ్ కూడా బదిలీ కావడంతో ఎస్టాబ్లిష్మెంట్ విభాగంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మహ్మద్ ఇర్ఫాన్‌ను కమిషనర్ సీసీగా నియమించారు. రెండు సంవత్సరాలుగా పనిచేస్తున్న అడిషనల్ కమిషనర్ శంకర్ కూడా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో వరంగల్ నుంచి ఓ అధికారి జిల్లాకు వస్తున్నట్లు సమాచారం.
కార్పొరేషన్‌లోని రెవెన్యూ విభాగంలో అంతర్గత బదిలీలు జరిగాయి. రెవెన్యూ ఆఫీసర్‌గా పనిచేస్తున్న నజీర్‌ను అదే విభాగంలోని ఆర్టీఐ కోర్టు కేసులు విభాగానికి బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఖదీర్ పాషాను నియమించారు. నజీర్‌ను కేవలం నాలుగు నెలల్లోనే రెవెన్యూ విధుల నుంచి తప్పించి, మరో అధికారికి బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశమైంది.
కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు ఇటీవల మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకాధికారిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికైనా కార్పొరేషన్ పాలన గాడిలో పడేనా అని పలువురు చర్చించుకుంటున్నారు. కార్పొరేషన్లో సమస్యపై అప్లికేషన్ ఇస్తే నెలలు గడిచినా పరిష్కారం కావడం లేదని నగర ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చిన్నచిన్న సమస్యలకు కూడా 10 సార్లు కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకాధికారి పాలనలోనైనా సమస్యలు పరిష్కారం కావాలని కోరుతున్నారు.
అడిషనల్ కమిషనర్ శంకర్ బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో వరంగల్ నుంచి డిప్యుటీ కమిషనర్‌గా పనిచేసిన అధికారి వస్తున్నట్లు సమాచారం. కానీ ఇప్పటివరకు అధికారంగా ఎలాంటి సమాచారం లేదు. టౌన్ ప్లానింగ్‌కు సంబంధించి డీటీసీపీ నుంచి నియామకం జరగాలి. ఇప్పటివరకైతే టౌన్ ప్లానింగ్ అధికారి నియామకంపై ఎలాంటి సమాచారం లేదు. రెవెన్యూ విభాగంలో పనిఎక్కువగా ఉండడం.. నజీర్ ఆర్టీఏ కోర్టు విభాగానికి బదిలీ చేసి, ఖదీర్పాషాను ఆర్వోగా నియమించాం.
– దిలీప్‌కుమార్, మున్సిపల్ కమిషనర్