రాష్ట్ర ప్రభుత్వం వైద్యవిద్యతోపాటు నర్సింగ్ విద్యకూ పెద్దపీట వేస్తున్నది. సర్కారు దవాఖానల్లో నర్సుల కొరత అధిగమించేందుకు జిల్లాకో నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయం విదితమే. అందులో భాగంగానే కామారెడ్డి జిల్లా బాన్సువాడలో బీఎస్సీ నర్సింగ్ కళాశాల ఏర్పాటైంది. శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి చొరవతో ప్రారంభమైన ఈ కళాశాల పేద విద్యార్థులకు వరంలా మారింది.
బీర్కూర్, జూలై 31 :
ప్రభుత్వ వైద్యంలో నాణ్యతా ప్రమాణాల మెరుగు కోసం రాష్ట్ర సర్కారు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే వైద్య కళాశాలలతోపాటు నర్సింగ్ కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడలో నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేసింది. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చొరవతో ఏర్పాటైన బీఎస్సీ నర్సింగ్ కళాశాల పేద విద్యార్థుల పాలిట వరంలా మారింది. బాన్సువాడలో ఏర్పాటైన ఈ కళాశాలలో చుట్టుపక్కల జిల్లాల విద్యార్థులు సైతం చదువుతున్నారు. జిల్లాలో చాలా వరకు పేద, మధ్యతరగతి విద్యార్థులు అధిక సంఖ్యలో ఉన్న నేపథ్యంలో నర్సింగ్ విద్య అందుబాటులో ఉండడంతో సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కోర్సుకు డిమాండ్..
ప్రస్తుతం బీఎస్సీ నర్సింగ్ కోర్సుకు డిమాండ్ ఉన్న నేపథ్యంలో బాన్సువాడలో కళాశాల ఏర్పాటుతో ఆ క్రేజ్ మరింత పెరిగింది. ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి ప్రైవేటు, ప్రభుత్వ దవాఖానల్లో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. గతంలో ఈ కోర్సుల్లో సీట్లు దొరకని విద్యార్థులు చాలా మంది మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రా ష్ర్టాలకు వెళ్లి లక్షలు చెల్లించి చదివారు. ఈ క్రమంలోనే బా న్సువాడలోనే నర్సింగ్ కళాశాలను ప్రారంభించడంతో విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వలస పోవడం తప్పడంతోపాటు ఖర్చులు కూడా తగ్గాయి.
వందకు వంద సీట్లు భర్తీ..
బాన్సువాడ నర్సింగ్ కళాశాలకు మొదటి ఏడాది వంద సీట్లు కేటాయించారు. అందులో మొదటి విడుత కౌన్సెలింగ్‌లో 56 మంది విద్యార్థినులు ప్రవేశం పొందగా, రెండో విడుతలో 44 మంది చేరారు. మొత్తం వంద మందికి సీట్లు కేటాయించగా ప్రస్తుతం ఒకరు మినహా మిగతా 99 మంది విద్యార్థినులు చదువుతున్నారు. ప్రస్తుతం ఐదుగురు డిప్యుటేషన్ ఫ్యాకల్టీలతో విద్యాబోధన కొనసాగుతున్నది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన 33శాతం మంది విద్యార్థినులు నర్సింగ్ విద్యను అభ్యసిస్తున్నారు.
బాలికల చదువుకు పోచారం కృషి..
బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన పేద విద్యార్థినుల చదువుకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కృషి చేస్తున్నారు. గతంలో ఇక్కడ పదో తరగతి పూర్తయిన వెంటనే బాలికలకు వివాహాలు చేసేవారు. బాల్య వివాహాలను నిర్మూలించాలనే సంకల్పంతో జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయించారు. అనంతరం నియోజకవర్గంలో గురుకుల పా ఠశాల, కళాశాలలు సైతం ఏర్పాటు చేసి ఇంటర్మీడియట్ వరకు చదువు కొనసాగించేలా చర్యలు తీసుకున్నారు. అం దులో భాగంగానే నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు పాఠశాల విద్య నుంచి తమ కాళ్లపై తాము నిలబడే వరకూ బాలికలకు చేయూతనందిస్తున్నారు.
విద్యార్థినులతో పాటు అల్పాహారం తింటున్న స్పీకర్ (ఫైల్)
బీఎస్సీ నర్సింగ్ కళాశాల ఏర్పాటుతోపాటు నూతన భవన నిర్మాణం కోసం స్పీకర్ పోచారం పట్టువదలని విక్రమార్కుడిలా కృషి చేశారు. అందులో భాగంగానే రూ.40కోట్లతో కళాశాలకు శాశ్వత భవనాన్ని నిర్మించేందుకు ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా భూమి పూజ చేశారు. ప్రస్తుతం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మరోవైపు రూ.10కోట్లతో నర్సింగ్ కళాశాలకు అవసరమయ్యే వసతులను కల్పించారు. కళాశాల ఏర్పాటు.. ప్రారంభం కాగానే వదిలేయకుండా స్పీకర్ పోచారం ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. కళాశాలను సందర్శిస్తూ విద్యార్థినుల బాగోగులు తెలుసుకుంటున్నారు. ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ విద్యార్థినులకు పెట్టే భోజనాన్ని సైతం పరిశీలిస్తున్నారు.
మహిళలే మొదటి మెట్టు
సమాజానికి బాలికలు, మహిళలే మొద టి మెట్టులాంటివారు. అందుకే ప్రతి విషయంలోనూ మహిళలకే మొదటి ప్రాధాన్యతనిస్తాను. బాలికలు చదువుకుంటే బాల్య వివాహాలు ఆగడంతోపాటు నా లక్ష్యం నెరవేరుతుంది. పాఠశాల మొదలుకొని నర్సింగ్ కళాశాల వరకు బాలికల విద్యకే ప్రాధాన్యమిస్తాను. నర్సింగ్ కళాశాలను మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటా.
– పోచారం శ్రీనివాసరెడ్డి, స్పీకర్
ఇక్కడ పనిచేయడం ఆనందంగా ఉంది..
బాన్సువాడలో నూతనంగా ప్రారంభమైన బీఎస్సీ నర్సింగ్ కళాశాలలో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. కళాశాల నూతనంగా మంజూరైనా వసతులకు కొరత లేదు. కళాశాల ప్రారంభమైన మరుసటి రోజునే స్పీకర్ పోచారం కళాశాలకు రావడంతో షాక్ అయ్యాను. కానీ ఆయన విద్యాభివృద్ధిపై చూపే చిత్తశుద్ధిని చూసి ఆశ్చర్యపోయాను.
– హన్సిలి, ప్రిన్సిపాల్, బీఎస్సీ నర్సింగ్ కళాశాల, బాన్సువాడ
బీఎస్సీ నర్సింగ్ చదవాలన్నదే లక్ష్యం
తాను చిన్నప్పటి నుంచి బీఎస్సీ నర్సింగ్ చదవాలని అనుకున్నా. నా లక్ష్యం నెరవేరినందుకు సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ విద్యపై చూపుతున్న శ్రద్ధతో అందరికీ చదువుపై ఆసక్తి పెరుగుతున్నది. ఇలాంటి లక్ష్యమున్న సీఎం దొరకడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నా.
– బి.జ్యోత్స్న, నాగిరెడ్డిపల్లి, సంగారెడ్డి జిల్లా
స్పీకర్‌కు రుణపడి ఉంటాం..
తెలంగాణలో మొదటి నర్సింగ్ కళాశాలను తెచ్చిన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి మేం రుణపడి ఉన్నాం. ఆయన కళాశాల తేవడంతోనే ఈరోజు నాతోపాటు 99 మంది విద్యార్థినులు సంతోషంగా చదువుకుంటున్నారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన మాదిరిగా జిల్లాకు ఒక నర్సింగ్ కళాశాల ఏర్పాటైతే బాగుండేది.
– టి.వెంకట ప్రమీల, టేకులపల్లి, ఖమ్మం జిల్లా
బాన్సువాడ వాసులు అదృష్టవంతులు
బాన్సువాడ నియోజకవర్గంలో స్పీకర్ పోచారం పుట్టడం ఇక్కడి వారి అదృ ష్టం. ఆయన విద్య విషయంలో, బాలికలపై చూపే ప్రేమ అంతా ఇంతా కాదు. బాన్సువాడలో బీఎస్సీ నర్సింగ్ కళాశాల ప్రారంభంకాగానే అడ్మిషన్ తీసుకు న్నాం. మరుసటిరోజే ఆయన వచ్చి మా తో కలిసి అల్పాహారం చేశారు. ఎలాంటి ఇబ్బంది ఉన్నా తానున్నానని ఓ తండ్రిలా భరోసానివ్వడం సంతోషాన్నిచ్చింది.
– బి. ప్రియాంక, ముత్తారం గ్రామం, జనగాం జిల్లా