నిజామాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కొత్త రేషన్ కార్డుల కథ డంపింగ్‌యార్డుకు చేరినట్లు కనిపిస్తున్నది!. సర్వే ప్రక్రియలో తీవ్ర జాప్యంపై దరఖాస్తుదారుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. అలాగే, గ్రామసభల సమయంలోనూ మళ్లీ అప్లికేషన్లు స్వీకరించింది. దాదాపు ఏడాదిన్నర గడిచినా దరఖాస్తులకు మోక్షం లభించలేదు. కొత్త రేషన్ కార్డుల జారీ మొదలు కాలేదు. దీంతో సర్కారు తీరుపై లబ్ధిదారులు నిట్టూరుస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులపై తలకు మించిన భారం మోపింది. వివిధ పథకాల అమలు, పర్యవేక్షణను రెవెన్యూ అధికారులకే అప్పగించింది. దీంతో వారు రేషన్ కార్డుల పరిశీలనను వేగవంతం చేయలేక పోతున్నారు. ధరణి స్థానంలో ఏప్రిల్ 14న భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం దానిపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించింది. దీంతో భూ భారతి సదస్సుతో రెవెన్యూ వర్గాలు బిజీగా మారాయి. మొన్నటిదాకా రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తులు ఆహ్వానించగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల జారీలో రెవెన్యూ వర్గాలు తలామునకలయ్యాయి. ఈ క్రమంలో ఒక్కో మండలానికి సుమారుగా 30 వేల నుంచి 50వేల వరకు దరఖాస్తులు రాగా, వాటిని క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలించడం అధికారులకు తలకు మించిన భారంగా మారింది. మరోవైపు, ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం నెలకొనడంతో రెవెన్యూ యంత్రాంగాన్ని పురామయించారు. ఇలా రెవెన్యూ అధికారులు వివిధ పని ఒత్తిళ్లలో ఉన్న తరుణంలో దరఖాస్తుల పరిశీలన, సర్వే ప్రక్రియలో జాప్యం నెలకొంది. ఈ సమస్యను ప్రభుత్వం గుర్తించడం లేదు. పరిష్కారానికి చొరవ తీసుకోవడం లేదు. ఫలితంగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి నెలల తరబడి నిరీక్షణ తప్పడం లేదు. మరోవైపు, కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో చాలా మంది పాత రేషన్ కార్డు నుంచి పేర్లను తొలగించుకున్నారు. తద్వారా రెంటికి చెడ్డ రేవడి అన్నట్లు వారి పరిస్థితి తయారైంది.
అధికారం కోసం కాంగ్రెస్ నోటికొచ్చిన హామీలిచ్చింది. వాటి అమలు సాధ్యమా.. లేదా? అన్నది పట్టించుకోకుండా వరాలు కురిపించింది. ఆరు గ్యారంటీల్లో భాగంగా అనేక హామీలు గుప్పించిన కాంగ్రెస్.. గద్దెనెక్కాక ఏ ఒక్కటీ పూర్తిగా అమలు చేయలేక చేతులెత్తేసింది. రుణమాఫీ, రైతుభరోసా అరకొరగానే అమలు చేసింది. కల్యాణలక్ష్మి కింద ఇస్తామన్న తులం బంగారం హామీ మాయమై పోయింది. పింఛన్ల పెంపు, మహిళందరికీ పెన్షన్లు, యువతులకు స్కూటీలు.. ఇలా ఎన్నింటినో రేవంత్ సర్కారు అటకెక్కించింది. ఇక రేషన్ కార్డుల విషయంలోనూ ప్రభుత్వం అలాగే వ్యవహరిస్తున్నది. ఏడాదిన్నర దాటుతున్నా రేషన్ కార్డుల జారీని పూర్తి చేయలేదు. నిరంతర ప్రక్రియగా చేపడుతామని చెప్పినప్పటికీ, ఆ ప్రక్రియే మొదలు కాలేదు. దీంతో లబ్ధిదారులు సర్కారు తీరుపై దుమ్మెత్తి పోస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో కొత్తగా రేషన్ కార్డుల జారీ ప్రక్రియను పరిశీలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. ఈ నెల మొదటి వారం వరకు జారీ చేసిన కొత్త కార్డుల సంఖ్య కేవలం 63 మాత్రమే. అవి కూడా ప్రజాపాలన గ్రామసభల్లో భాగంగా కొద్ది మందికి ఏదో నామమాత్రంగా అందించారు. ఇక, పాత రేషన్ కార్డుల్లో పేర్లు నమోదుకు దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య లక్షల్లో ఉండగా, కేవలం 4 వేల మందికే మోక్షం లభించింది. నిజామాబాద్ జిల్లాలో గత ఏప్రిల్ వరకు 4,02,154 రేషన్ కార్డులుండగా, ఆ సంఖ్య మే నెల మొదటి వారానికి 4,02,217కు చేరింది. 17 నెలల ప్రజాపాలనలో జిల్లా వ్యాప్తంగా వేలాది దరఖాస్తులు రాగా, 67 మందికే కొత్త రేషన్ కార్డులు అందించారు. మిగిలిన దరఖాస్తులు పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. రెవెన్యూ అధికారులే స్వయంగా దరఖాస్తుదారుల చెంతకు వెళ్లి వివరాలను పరిశీలన చేస్తున్నారు. ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో డాటాను పొందుపర్చి వివరాలను ప్రభుత్వానికి చేరవేస్తున్నారు. ఏప్రిల్, 2025 నాటికి జిల్లాలో మొత్తం 13,10,012 మంది రేషన్ లబ్ధిదారులు ఉండగా, ఇప్పుడా ఈ సంఖ్య 13,14,465కు చేరింది. పాత రేషన్ కార్డుల్లో కొత్తగా పేర్లు చేర్చిన వారి వివరాలు 4453 మందికి మోక్షం లభించింది.