మోర్తాడ్, జూలై 11: మోర్తాడ్ మండలంలో పేరుకే సక్రమం అంతా అక్రమం అన్నట్లుగా కొనసాగుతుందీ ఇసుక రవాణా. సుంకెట్, ధర్మోరా గ్రామశివారుల్లోని పెద్దవాగులో ఇసుకను తరలించేందుకు అధికారులు అనుమతినిచ్చారు. వేబిల్లులు మంజూరు చేస్తున్నారు. అయితే ఉదయం 9గంటలకు అధికారులు వచ్చిన తర్వాత ఇసుక రవాణా చేపట్టాలి. వేబిల్లులు చూపించి సంబంధిత ట్రాక్టర్ను తీసుకురావాల్సి ఉంటుంది. కానీ అందుకు విరుద్ధంగా ఇసుక రవాణా కొనసాగుతున్నది. గురువారం ధర్మోరా శివారులోని పెద్దవాగు నుంచి ఇసుక రవాణాకు 40 వేబిల్లులు ఇవ్వగా అధికారులు లేకుండానే ఇసుక తవ్వకాలు మొదలయ్యాయి. తెల్లవారుజామున 5 నుంచి సాయంత్రం 5గంటల వరకు దాదాపు 12గంటలపాటు ఇసుక రవాణా నిర్విరామంగా సాగింది. ఇసుకను ట్రాక్టర్లలో కూలీలతో నింపించాల్సింది పోయి ఏకంగా పొక్లెయిన్ పెట్టి తోడేస్నున్నారు. ఇచ్చిన 40వేబిల్లుల ఇసుకను తరలించేందుకు రెండుమూడు గంటల సమయం సరిపోతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అధికార పార్టీకి చెందిన నాయకుల కనుసన్నల్లోనే ఇసుక రవాణా జరుగుతుండడంతో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని తెలుస్తుంది. ఇంటిని నిర్మించే యజమానులు ఇసుక అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవడం లేదు. ఇసుక రవాణా చేసే వారే గ్రామపంచాయతీల్లో ఇంటి యజమానుల పేరిట దరఖాస్తు చేసుకొని వేబిల్లులు పొందుతున్నట్లు సమాచారం. వేబిల్లులో ఉన్నట్లుగా కాకుండా ఇష్టం వచ్చిన చోట ఇసుకను విక్రయిస్తున్నారు. సక్రమం ముసుగులో అక్రమంగా ఇసుకను తరలిస్తుండడంపై అధికారులు చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వర్షాలు పడితే వాగులోని ఇసుకను తరలించలేమని తెలిసి అధికార పార్టీ నాయకులు తక్కువ వే బిల్లులు ఉన్నా.. ఎక్కువ మొత్తంలో ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే భీమ్గల్ కప్పలవాగు, మోర్తాడ్ మొండివాగు, పాలెం పెద్దవాగు, ఏర్గట్ల మండలం బట్టాపూర్ తదితర ప్రాంతాల నుంచి పొక్లెయిన్లు పెట్టి మరి ఇసుకను తరలించిన సంఘటనలతో అధికార పార్టీ నాయకులు ఏమేరకు అక్రమ ఇసుకను తరలించారో స్పష్టమవుతున్నది. ఈ విషయం గాలిదుమారంగా మారడంతో వేబిల్లుల పేరిట ఇసుక అక్రమరవాణాకు తెరలేపినట్లు తెలుస్తున్నది. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ ఇసుకరవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ధర్మోరా వాగు నుంచి ఇసుకను తరలించేందుకు అనుమతి ఇచ్చాం. గురువారం ఇసుకను తీసుకెళ్లడానికి 40 వేబిల్లులు ఇచ్చాం. వేబిల్లుల ప్రకారమే ఇసుకను తీసుకెళ్లాలి. అక్రమంగా ఇసుకను తరలిస్తే చర్యలు తీసుకుంటాం.