లింగంపేట, జూలై 15: కొన్ని రోజులుగా వరణుడు ముఖం చాటేయడంతో పంటలు సాగు చేస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆశించిన స్థాయిలో వర్షాలు కురియక పోవడంతో నారుమళ్లు కాపాడుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. వానకాలంలో వరి పంట సాగు కోసం రైతులు జూన్లో అడపాదడపా కురిసిన వర్షాలకు రైతులు వరి నారుమళ్లు వేసుకున్నారు. జూలైలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురియలేదు.
సాధారణ వర్ష పాతం 116.2 మి.మీటర్లుగా నమోదు కావాల్సి ఉండగా మంగళవారం వరకు 57.9 మి.మీటర్లు వర్షపాతం (50 శాతం) మాత్రమే నమోదైంది. వర్షాలు కురియకపోవడంతో చెరువుల్లో నీటినిల్వలు తగ్గిపోగా.. మరోవైపు భూగర్భ జలాలు వేగంగా అడుగంటి పోతున్నాయి. మండలంలోని భవానీపేట గ్రామంలో ఆర్ల బాల సాయిలు అదే గ్రామానికి చెందిన బ్యాగరి సాయిలు పొలాన్ని కౌలుకు తీసుకుని వరి పంట సాగు చేసేందుకు సిద్ధమయ్యాడు.
వర్షాలు కురవకపోవడం, బారుబావి అడుగంటిపోవడంతో నారుమడి ఎండిపోయే దశకు చేరుకుంటున్నది. దీంతో ఎలాగైనా నారుమడిని కాపాడుకోవడానికి పంచాయతీ ట్రాక్టర్కు కిరాయి చెల్లించి నీటిని అందిస్తున్నట్లు రైతు ఆర్ల బాలసాయిలు తెలిపారు. ఎకరాకు పది వేల రూపాయలకు పొలం కౌలుకు తీసుకుని పంట సాగు చేస్తున్నట్లు వివరించారు. వర్షాలు కురియకపోతే పెట్టుబడితోపాటు కౌలు డబ్బులు అప్పులు చేసి చెల్లించాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.