మోర్తాడ్/భీమ్‌గల్, జూలై 29: బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటామని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా న్యాయంగా ఎదుర్కొంటామని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేసే వరకు ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన వేల్పూర్ ఘటనలో బెయిల్‌పై వచ్చిన పల్లికొండ గ్రామానికి చెందిన రంగుల గంగాధర్‌గౌడ్, భీమ్గల్కుచెందిన మహేశ్, పసుల నితీశ్, లాలా, రహ్మన్ కుటుంబాలను వేముల మంగళవారం పరామర్శించారు.
అక్రమ కేసులకు భయపడవద్దని, ఎటువంటి కష్టం వచ్చినా అండగా ఉంటానని భరోసా ఇచ్చి, మనోధైర్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్‌కు చెందిన నంగి దేవేందర్‌రెడ్డి అనే కాంగ్రెస్ నాయకుడు వేల్పూర్‌లోని తన ఇంటికి వచ్చి దాడికి దిగాడని తెలిపారు. దాడిచేయడానికి వచ్చిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయకుండా, ఆ దాడిని అడ్డుకునే క్రమం లో జరిగిన చిన్న తోపులాటను కారణంగా తీసుకుని పోలీసులు తమ కార్యకర్తల మీద అక్రమంగా హత్యాయత్నం కేసులు పెట్టడం శోచనీయమన్నారు.
దీనిని ప్రజాపాలన అంటారా అని ప్రశ్నించారు. ప్రజల పక్షాన హామీల అమలు కోసం ప్రశ్నించిన వారిపై రేవంత్ సర్కారు చేస్తున్న కక్షసాధింపు చర్యలని స్పష్టమవుతుందని తెలిపారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై పెట్టిన ఈ కేసులన్నీ అక్రమమని హైకోర్టు స్పష్టం చేస్తూ అందరికీ బెయిల్ మంజూరు చేసిందన్నారు. పోలీసులు ఇకనైనా రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి చుట్టంలా కాకుండా చట్టానికి లోబడి పనిచేయాలని, లేకుం టే అటువంటి పోలీసులు భవిష్యత్తులో తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.