నిజాంసాగర్/బిచ్కుంద/ పెద్దకొ డప్గల్, జూలై 3: నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని పంటలకు సాగునీటిని వెంటనే విడుదల చేయాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ రైతులకు సాగునీటి కష్టాలు రాకుండా చూసుకున్నారని గుర్తుచేశారు. శుక్రవారం ఆయన మహ్మద్‌నగర్, పెద్దకొడప్గల్తోపాటు బిచ్కుంద మండలంలోని కందర్పల్లిలో పర్యటించారు. మహ్మద్‌నగర్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు సాగు నీటి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. వానాకాలం ప్రారంభమైన నేపథ్యంలో రైతులు నారుమళ్లను సిద్ధం చేసుకొని నాట్లు వేసేందుకు సన్నద్ధమయ్యారని, సాగునీరు లేక ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. మండలంలో అధిక విస్తీర్ణంలో వరి సాగు ఉన్నందున, రైతులు సకాలంలో నాట్లు వేసుకునేలా వెంటనే నిజాంసాగర్ నీటిని విడుదల చేయాలని ప్రభుత్వం, నీటి పారుదల శాఖ అధికారులను డిమాండ్ చేశారు. నీటిని విడుదల చేయకపోతే రైతులు రహదారులపైకి వచ్చి ఆందోళన బాట చేపట్టే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు.
ఆయిల్‌పామ్ సాగుతో రైతులకు నేడు సిరులు కురుస్తున్నాయని షిండే అన్నా రు. బిచ్కుంద మండలంలోని కందర్పల్లిలోని ఆయిల్‌పామ్ సేకరణ కేంద్రాన్ని సందర్శించారు. పంట దిగుబడి, నాణ్య త, రైతులకు అందుతున్న సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా షిండే మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రత్యామ్నాయ సాగు సంకల్పం ఒక్కొక్కటిగా ఫలితాలను ఇస్తున్నదని, ఆయన ముందు చూపుతో తెచ్చిన ఎన్నో విప్లవాత్మక పథకాలు నేడు రైతులకు సిరులు కురిపిస్తున్నాయని పేర్కొన్నారు. అనంతరం ఆయిల్‌పామ్ సేకరణ సంస్థ ప్రతినిధులు షిండేను శాలువాతో సన్మానించారు.
నియోజకవర్గంలో ‘సర్’లో భాగంగా కొనసాగుతున్న ఇంటింటి సర్వేలో అర్హుల ఓట్లు తొలగిపోకుండా బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. ఆయన పెద్దకొడప్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, నాయకులు, బీఎల్ఏలతో సమావేశమయ్యారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున్న ఇంటింటి ఓటరు గణనపై సమీక్ష నిర్వహించారు. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోకుండా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.