e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home నిజామాబాద్ ఇల్లే.. పిల్లలకు రక్ష

ఇల్లే.. పిల్లలకు రక్ష

ఇల్లే.. పిల్లలకు రక్ష
  • ప్రతిరోజూ పౌష్టికాహారం అందించాలి
  • తల్లికి కరోనా సోకినా.. బిడ్డకు పాలు ఇవ్వొచ్చు
  • పిల్లలకు వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి
  • ‘నమస్తే తెలంగాణ’ ఫోన్‌ఇన్‌లో పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్‌ జి.హరికృష్ణ
  • చిన్నారులు బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

‘సెకండ్‌ వేవ్‌లో కరోనా వైరస్‌ తొందరగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు కొవిడ్‌ నిబంధనలు పాటించాలి. పిల్లలు ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజూ వారికి రోగనిరోధక శక్తిని పెంచే విధంగా పౌష్టికాహారాన్ని అందించాలి. తల్లికి కరోనా సోకినా.. తగిన జాగ్రత్తలు పాటిస్తూ బిడ్డకు పాలు ఇవ్వొచ్చు. పెద్దవారికి కరోనా సోకితే హోం ఐసొలేషన్‌లో ఉంటూ.. పిల్లలను దగ్గరికి రానివ్వకుండా చికిత్స తీసుకోవాలి. దీంతో పిల్లలకు కరోనా సోకే అవకాశం ఉండదు. పెద్దవారు కొన్ని వారాల పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది’ అని ప్రముఖ పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్‌ జి.హరికృష్ణ అన్నారు. నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు నిర్వహించిన ‘నమస్తే డాక్టర్‌’ ఫోన్‌ఇన్‌ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. జిల్లాతో పాటు పలు ప్రాంతాల నుంచి తల్లిదండ్రులు అడిగిన ప్రశ్నలకు డాక్టర్‌ హరికృష్ణ సమాధానాలు ఇచ్చారు.

నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. పిల్లలకు కరోనా సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?-రాజు, తడ్‌పాకల
డాక్టర్‌: ప్రస్తుతం రెండోవేవ్‌లో పిల్లలు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇది పుట్టిన పిల్లల నుంచి యుక్త వయస్సు పిల్లల వరకు ఎవ్వరికైనా సోకవచ్చు. పిల్లలకు కరోనా సోకకుండా ఉండాలంటే ముఖ్యంగా జనసమూహం ఉన్న ప్రదేశాలకు పిల్లలను వెళ్లనివ్వొద్దు. రెండు సంవత్సరాలపైన పిల్లలకీ విధిగా మాస్కు ధరించే అలవాటు చేయాలి. మాస్కుతో కచ్చితంగా నోరు, ముక్కు కవర్‌ అయ్యే విధంగా చూసుకోవాలి.

నాకు, మా భర్తకు, మా నాలుగేండ్ల బాబుకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం మా ముగ్గురికి నెగిటివ్‌ వచ్చింది. అయితే బాబుకు భవిష్యత్తులో ఏమైనా సమస్యలు వస్తాయా..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?-శ్వేత, నిజామాబాద్‌.
డాక్టర్‌ : కరోనా నుంచి పిల్లలు కోలుకున్న తర్వాత కూడా నాలుగు నుంచి ఆరు వారాలపాటు జాగ్రత్తలు తీసుకోవాలి. నెగిటివ్‌ వచ్చిందని పిల్లలు బయట తిరుగకుండా చూసుకోవాలి. రెండు నెలల పాటు పౌష్టికాహారం, పండ్ల రసం, ఆకు కూరలను అందించాలి. రక్తహీనత, బలహీనంగా లేకుండా చూసుకోవాలి. ఇమ్యూనిటీ పెంచే విధంగా విటమిన్‌ సీ, విటమిన్‌ ఏ ఉన్న ఆహారం అందించాలి.

పిల్లలకు కరోనా ఏ విధంగా సోకే అవకాశం ఉంది? కరోనా రాకుండా ఎలాంటి రక్షణ తీసుకోవాలి..?-మహమూదాబేగం, వినాయక్‌నగర్‌, నిజామాబాద్‌.
డాక్టర్‌: ఇంట్లో ఎవరైనా కుటుంబ సభ్యులకి కొవిడ్‌ సోకితే.. అది ఇంటిల్లిపాదికి సోకుతుంది. పిల్లలు ఆడుకోవాడానికి బయటికి వెళ్తుంటారు. జనసమూహాల్లోకి వెళ్లినప్పుడు కరోనా సోకే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలను బయటికి వెళ్లనివ్వకుండా ఇంట్లోనే ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిదండ్రులు కూడా కొవిడ్‌ నిబంధనలు పాటించాలి.

పిల్లల్లో కరోనా లక్షణాలు ఎలా గుర్తించాలి..?-మురళి, కళ్యాపూర్‌.
డాక్టర్‌: పిల్లలో తీవ్రమైన జ్వరం, తలపోటు, జలుబు, గొంతునొప్పి, దగ్గు, వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, శరీరంపైనా అప్పుడప్పుడు దద్దుర్లు, కండ్లు ఎర్రబడడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడం కరోనా లక్షణాలు. ఇలాంటి లక్షణాలు ఉంటే చిన్నారులకు కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయించాల్సిన అవసరం ఉంది. ఈ కరోనా సమయంలో పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది.

నాకు తొమ్మిది నెలల పాప ఉంది. ఈ సమయంలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవచ్చా. వ్యాక్సిన్‌ తీసుకుంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..? -యజ్ఞ, సుచిత్ర, హైదరాబాద్‌.
డాక్టర్‌: కొవిడ్‌ వ్యాక్సిన్‌ను ధైర్యంగా తీసుకోవచ్చు. పాపకు తల్లిపాలు ఇస్తు న్న సమయంలో కూడా టీకా వేయించుకోవచ్చు. వ్యాక్సిన్‌ తీసుకోవడం ద్వారా ఎలాంటి నష్టం జరిగే అవకాశం లేదు. ప్రస్తుత కరోనా సమయంలో పిల్లలకు తప్పకుండా తల్లిపాలు ఇవ్వాలి.

పిల్లలకు కరోనా రాకుండా తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? -శ్రీనివాస్‌, భీమ్‌గల్‌.
డాక్టర్‌: తల్లిదండ్రులు కొవిడ్‌ నిబంధనలు తప్పకుండా పాటించాలి. అత్యవసరం ఉంటనే తప్ప ఇంట్లో నుంచి బయటికి వెళ్లకూడదు. బయటికి వెళ్లినప్పడు రెండు మాస్కులు ధరించాలి. భౌతికదూరం పాటించాలి. తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంట్లో కూడా మాస్కు ధరించడం మంచిది. పెద్దలు కొవిడ్‌ నిబంధనలు పాటించకుంటే చిన్నారులకు కూడా కరోనా సోకే ప్రమాదం ఉంది.

నేను కొవిడ్‌ పాజిటివ్‌ వ్యక్తిని. మా ఎనిమిది నెలల బాబుకు పాలు ఇవ్వొచ్చా..? – సబిత, నిజామాబాద్‌.
డాక్టర్‌: బాబుకు పాలు ఇవ్వడం మానేయవద్దు. ప్రస్తుతం ఎండాకాలంలో తల్లిపాలు ఇవ్వకపోతే బాబుకు సోడి యం లవణంలో హెచ్చుతగ్గులు వస్తా యి. మోచేతి వరకు శుభ్రం చేసుకొని, త్రిబుల్‌ లేయర్‌ మాస్కు ధరించి, ప్రతి రెండు గంటలకు ఒకసారి పాలు ఇవ్వొ చ్చు. తల్లిపాలతో పిల్లలకు కరోనా సోక దు. పాలు ఇచ్చిన అనంతరం బాబును వేరే గదిలో ఉంచడం మంచిది.

కరోనా నుంచి కోలుకున్న చిన్నారులకు దీర్ఘకాలిక పరిణామాలు ఏమైనా ఉంటాయా..? – గంగాప్రసాద్‌, బోధన్‌
డాక్టర్‌: చిన్నారులు కరోనా నుంచి కోలుకున్న అనంతరం నాలుగు వారాల పాటు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అతితక్కువ మంది పిల్లల్లో మల్టీసిస్టమిక్‌ ఇన్‌ఫ్లామెట్రీ సిండ్రోమ్‌ వస్తుంది. పిల్లలకు బలవర్ధకమైన ఆహారంతో పాటు పండ్లు ఇవ్వాలి.

కుటుంబీకుల్లో ఎవరైనా కరోనా బారిన పడితే చిన్నారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? – శ్రీనివాస్‌, బోధన్‌
డాక్టర్‌: కుటుంబసభ్యుల్లో ఎవరికైనా కరోనా నిర్ధారణ అయితే భయపడొద్దు. మిగతా వారందరూ సర్జికల్‌ ట్రిపుల్‌ లేయర్‌ మాస్క్‌ ధరించాలి. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారు పిల్లలకు దూరంగా ఉండాలి. రెండేండ్లు దాటిన పిల్లలు సర్జికల్‌ మాస్కు ధరించేలా చూసుకోవాలి. ఇంటిని ప్రతి రోజూ డెటాల్‌తో శుభ్రం చేస్తూ.. కొవిడ్‌ నిబంధనలు పాటించాలి.

పిల్లల్లో ఎలాంటి లక్షణాలు ఉంటే డాక్టర్‌ను సంప్రదించాలి..? – రాము, నిజామాబాద్‌.
డాక్టర్‌: సాధారణంగా పిల్లలో జ్వరం 100 ఫారన్‌హీట్‌ కన్నా ఎక్కువగా మూడు రోజుల పాటు ఉంటే, సంవత్సరంలోపు పిల్లల్లో 102 ఫారన్‌హీట్‌ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు, మూత్రం తగ్గిపోవడం, కాళ్లుచేతులు చల్లబడిపోవడం, అపస్మారక పరిస్థితిలోకి వెళ్లి ఫిట్స్‌ రావడం ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఇల్లే.. పిల్లలకు రక్ష

ట్రెండింగ్‌

Advertisement