కంఠేశ్వర్, మార్చి 11 : కాంగ్రెస్ మాటల పార్టీ కాదు.. చేతల పార్టీ అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. జిల్లా అభివృద్ధిలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. నిజామాబాద్ రూరల్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, తెలంగాణ యూనివర్సిటీ, జవహర్ నవోదయను కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొచ్చిందని గుర్తుచేశారు.
పసుపు బోర్డు అడిగితే మెరుగైన స్పైసెస్ బోర్డు తెచ్చామని ఎంపీ అర్వింద్ చెప్పారని ఎమ్మెల్యే భూపతి రెడ్డి గుర్తుచేశారు. పసుపు బోర్డు తీసుకొచ్చినంత మాత్రాన రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో పసుపు బోర్డుకు నిధులు కేటాయించలేదని అన్నారు. బోర్డు ఇచ్చినా కూడా రైతులకు గిట్టుబాటు ధర రాక రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. పసుపు బోర్డు లేని సమయంలోనే క్వింటాలుకు 16 వేలకు పైగా ధర ఉండేదని, ప్రస్తుతం 12 వేలు కూడా రావడం లేదని అన్నారు. రైతులకు 25 వేలు మద్దతు ధర వచ్చేలా చూస్తామని గొప్పలు చెప్పుకున్న ఎంపీ అరవింద్, రైతులను ఎందుకు పట్టించుకోవడంలేదని నిలదీశారు.
పసుపు బోర్డు కార్యాలయం ఢిల్లీలో ఉండటంతో నిజామాబాద్‌లో రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చిందని అన్నారు. పసుపు రైతులకు బోనస్ ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని పేర్కొన్నారు. అరవింద్ వయసుకు గౌరవం ఇవ్వకుండా పెద్దమనిషిని పట్టుకొని మాజీ మంత్రికి మర్యాద ఇవ్వకుండా మాట్లాడడం సరికాదన్నారు. జవహర్ నవోదయ విషయంలో మా ఇద్దరి మధ్య గొడవలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, రూరల్ నియోజకవర్గంలో నవోదయ విద్యాలయం కోసం జక్రాన్‌పల్లిలో సూచించడం జరిగిందని, జిల్లా కలెక్టర్‌ను సైతం పరిశీలనకు పంపించడం జరిగిందని అన్నారు. ఎంపీ అరవింద్ కలిగోట్ ను ప్రతిపాదించారని, అలాగే మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సైతం బోధనలో ప్రతిపాదించడం జరిగిందని, తుది నిర్ణయం మాత్రం నవోదయ విద్యాలయ సమితి కమిటీ ఉంటుందని అన్నారు.
ఎంపీ అరవింద్ గెలిచిన ఆరేళ్లలో ఎన్ని నిధులు తీసుకువచ్చారో చెప్పాలని ఎమ్మెల్యే భూపతి రెడ్డి డిమాండ్ చేశారు. అభివృద్ధి చేయాలనుకుంటే కేంద్రాన్ని ఒప్పించి నిధులు తీసుకురావాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ ఎన్నికల్లో ఒక్కొక్కరికి 5 వేల చొప్పున ఇచ్చి, రెండు ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు.