వినాయక్‌నగర్, నవంబర్ 2: డిమాండ్ల సాధన కోసం పోరుబాట పట్టాలని భావించిన హోంగార్డులను ఉన్నతాధికారులు కట్టడి చేశారు. సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో శనివారం తలపెట్టిన ‘చలో హైదరాబాద్’ కార్యక్రమానికి వెళ్లకుండా ఆరు గంటలకు పైగా పోలీస్ పరెడ్ గ్రౌండ్స్‌లోనే ఖాళీగా కూర్చోబెట్టారు. హోంగార్డులు హైదరాబాద్ రాకుండా కట్టడి చేయాలని ఒకరోజు ముందే ఉన్నతాధికారులు జిల్లా బాధ్యులకు ఆదేశాలు జారీ చేశారు.
దీంతో నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో పని చేసే హోంగార్డులు ఆందోళనకు వెళ్లకుండా జిల్లా అధికారులు ఆంక్షలు విధించారు. శనివారం ఉదయం 5.30 గంటలకే పోలీస్‌పరేడ్ గ్రౌండ్‌కు రావాలని ఆదేశించడంతో హోంగార్డులు తెల్లవారుజామునే చేరుకున్నారు. అందరినీ దాదాపు నిర్బంధించినంత పని చేసిన అధికారులు.. పరేడ్ నిర్వహించి, అటెండెన్స్ తీసుకున్నారు. అల్పాహారం కోసం కాసేపు వదిలి, టిఫిన్ చేసి మళ్లీ గ్రౌండ్‌కు రావల్సిందిగా ఆర్ఐలు, ఆర్ఎస్సైలు ఆదేశించారు.
టిఫిన్స్ చేసి వచ్చాక మధ్యాహ్నం వరకు గ్రౌండ్ నుంచి బయటికి వెళ్లనివ్వలేదు. మధ్యాహ్నం తర్వాత హోంగార్డులందరితో రిజిస్ట్రార్‌లో సంతకాలు తీసుకున్న అనంతరం ఎవ్వరూ ఎలాంటి ఆందోళన కార్యక్రమాలకు వెళ్లకూడదని చెప్పి, బయటకు పంపించారు. ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలో సైతం విధులు నిర్వహిస్తున్న హోంగార్డులను ఆ ఏరియాలోని పోలీస్ అధికారుల కార్యాలయాలకు రప్పించుకుని, వారిని సైతం మధ్యాహ్నం వరకు ఆఫీసుల్లోనే కూర్చోబెట్టారు.
సిరికొండ, నవంబర్ 2: ‘చలో హైదరాబాద్’ కార్యక్రమానికి బయల్దేరుతున్న మాజీ హోంగార్డు, బీఆర్ఎస్ నేత భూక్యా గంగాధర్‌ను సిరికొండ పోలీసులు శనివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ధర్నాకు వెళ్తుండగా అరెస్టు చేసి, పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారం కోసం హోంగార్డులు తలపెట్టిన శాంతియుత కార్యక్రమాన్ని అడ్డుకోవడం సరికాదన్నారు. హోంగార్డుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.