సిటీబ్యూరో, మార్చి 17 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు రైళ్ల రాకపోకలతోపాటు రైళ్ల వేగం కూడా పెరగనున్నది. ‘మిషన్ ఎలక్ట్రిఫికేషన్’లో భాగంగా రైల్వే ట్రాకుల విద్యుద్దీకరణ పనులు దక్షిణ మధ్య రైల్వే జోనల్ ఆధ్వర్యంలో శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నిజామాబాద్-కామారెడ్డి, జాన్కంపేట్-బాసర సెక్షన్ పరిధిలో మొత్తం 73 కిలో మీటర్ల విద్యుద్దీకరణ పనులు పూర్తయినట్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు శుక్రవారం తెలిపారు.
నార్త్ తెలంగాణ ప్రాంతాల్లోని రైల్వే ట్రాకుల విద్యుద్దీకరణ పనులు పూర్తికావడంతో ఆయా మార్గంలో రైళ్ల రాకపోకలు పెరగడంతోపాటు వేగం కూడా పెరిగే అవకాశం ఉన్నదని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ప్రాజెక్టు 2015-16 సంవత్సరంలో మంజూరైందని తెలిపారు. మొత్తం 783 కిలోమీటర్ల విద్యుద్దీకరణ పనుల కోసం రూ.865 కోట్ల నిధుల అంచనా వ్యయంతో నాటి కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదనలు పెట్టినట్లు తెలిపారు. దశల వారీగా, పలు రైల్వే స్టేషన్ల వారీగా విద్యుద్దీకరణ పనులు పూర్తవుతూ వస్తున్నాయని వివరించారు.