సిటీబ్యూరో, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ అస్తిత్వ శిఖరం, స్వరాష్ట్ర సాధకుడు, బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను గ్రేటర్ వ్యాప్తంగా పండుగలా నిర్వహించుకున్నారు. మంగళవారం 72వ జన్మదినం సందర్భంగా గల్లీ నుంచి తెలంగాణ భవన్ దాకా కేసీఆర్ నామస్మరణతో మార్మోగింది. ‘జై తెలంగాణ.. జై కేసీఆర్’ నినాదాలు మిన్నంటాయి. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అభిమానులు, మహిళలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కేక్ కట్ చేయడంతో పాటు కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం, రక్తదాన శిబిరాలు, పేదలకు పండ్లు పంపిణీ, పారిశుధ్య కార్మికులకు చీరల పంపిణీ కార్యక్రమాలను నిర్వహించారు. తమ అభిమాన నాయకుడి జన్మదినాన్ని ప్రత్యేకంగా జరుపుకునేందుకు బీఆర్ఎస్ శ్రేణులంతా సందడి చేశారు.
నల్లకుంట డివిజన్ ఫీవర్ దవాఖాన చౌరస్తాలో బీఆర్ఎస్ మహిళా సీనియర్ నేత అనుముల లావణ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ నాయకులతో కలిసి దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మహేశ్వరం మండలంలోని హర్ష గూడలో ఇంద్రా రెడ్డి ట్రస్టు ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జి పటోళ్ల కార్తీక్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సైకిళ్లను అందజేశారు. బడంగ్పేట్ అంబేద్కర్ విగ్రహం దగ్గర బీఆర్ఎస్ బడంగ్పేట్ అధ్యక్షుడు రామిడి ఆంరెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

కేక్ కట్ చేసి మిఠాయిలను పంచి పెట్టారు. సనత్‌నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్, సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి తలసాని సాయికిరణ్‌యాదవ్ ఆదేశాల మేరకు నాగరాజ్‌గౌడ్ తన సొంత డబ్బులతో దివ్యాంగులకు 10 వీల్ చైర్లు, ఎలక్ట్రిక్ సైకిల్‌తో పాటు, స్పెయిన్ బెల్టులు, జీవనోపాధి నిమిత్తం రూ.లక్ష నగదు ఆర్థిక సహాయంగా అందజేశారు. ఆల్విన్ కాలనీ డివిజన్ బీఆర్ఎస్ నాయకుడు ఎర్రబెల్లి సతీశ్‌రావు ఆధ్వర్యంలో ఎల్లమ్మబండలో ఘనంగా వేడుకలను నిర్వహించారు. సోషల్ మీడియా వేదికగా చాలా మంది అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.

మల్కాజిగిరి, ఫిబ్రవరి 17 : బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి మంగళవారం ఎర్రవెల్లి వ్యవసాయక్షేత్రంలో కేసీఆర్‌ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతోపాటు, అభివృద్ధి పథంలో నడిపించిన మహనీయుడు కేసీఆర్ అని కొనియాడారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రజలకు మరింత సేవ చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.