రుద్రూర్, మార్చి 11 : కామారెడ్డి జిల్లా రుద్రూర్ మండలంలో మంగళవారం వరి పంట కోతలు మొదలయ్యాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను కోసిన రైతన్నలు దళారులకు అమ్మేస్తున్నారు. ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తుందన్న నమ్మకం లేకపోవడంతో దళారులకు విక్రయిస్తున్నారు. ఈ ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందన్న నమ్మకం అస్సలే లేదని రైతులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
కనీస మద్దతు ధర ఎంత అనేది కూడా తెలసుకోకుండానే తమ పంటను రైతన్నలు దళారులకు అప్పగించేస్తున్నారు. ఎంతైతే అంత.. ధాన్యం కొనుగోలు చేసి తీసుకెళ్తే చాలు అన్న విధంగా రైతులు ఎదురుచూస్తున్నారు. 100 -200 రూపాయల కోసం చూసుకుంటే.. వాతావరణం సహకరించకపోతే మొత్తం ధాన్యం నేలపాలవుతుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను త్వరగా ప్రారంభించి ధాన్యం కొనుగోలుచేస్తే రైతులు నష్టపోకుండా ఉంటారని చెబుతున్నారు.
‘ నాకు 25ఎకరాల పొలం ఉంది. మొత్తం వరి పంట వేశాను. ఇప్పుడు పొలం కోతకు వచ్చింది. కానీ ఈ ప్రభుత్వం పంట కొనుగోలు చేస్తుందనే నమ్మకం లేదు. అందుకే దళారులకే పంటను విక్రయిస్తున్నా. ధర తక్కువైనా సరే ఫర్వాలేదు కానీ.. కోసిన ధాన్యం ఆరబెట్టి విక్రయించే వరకు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే దళారులకు విక్రయిస్తున్నా.’ అని రుద్రూర్ రైతు మోహన్రావు తెలిపారు.