ఉమ్మడి జిల్లాలో చెరువులు, వాగులకు జలకళ నీట మునిగిన పంట పొలాలు పలుచోట్ల కూలిపోయిన
నివాస గృహాలు కామారెడ్డి జిల్లాలో 39.7 మి.మీ., నిజామాబాద్‌లో 88.1 మి.మీ నమోదు.
నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూలై 21: ఉమ్మడి జిల్లాలో రెండురోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు మండలాల్లో చెరువులు, వాగు లు జలకళను సంతరించుకుంటున్నాయి. పలు గ్రామాల్లో చెరువులు నిండి అలుగులు పొంగి పొర్లుతున్నాయి. శని,ఆదివారాల్లో కురిసిన వర్షానికి మోర్తాడ్, ధర్మోరా మొండివాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గాండ్లపేట్ శివారులో వరదకాలువ పక్కన పంటలు నీటమునిగాయి. నవీపేట మండలంలోని జన్నేపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. వరద ఉధృతికి జన్నేపల్లి తదితర గ్రామాల్లో పంట పొలాల్లోకి వర్షపునీరు చేరింది.

రెంజల్ మండంలోని కందకుర్తి గోదావరి నది నిండుగా పారుతున్నది. మహారాష్ట్ర నుంచి వస్తున్న వదరతో త్రివేణి సంగమ క్షేత్ర ప్రదేశం వద్ద గోదారమ్మ పరుగులు తీస్తోంది. ఆదివారం మొదటిసారిగా హరిద్రా, మంజీరా,గోదావరి నదులు సమానంగా ప్రవహిస్తుండడం విశేషం.
భారీ వర్షాలకు నవీపేట మండలంలోని ఫత్తేనగర్, కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని బోనాల్ తండా, కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 47 వార్డులో ఇండ్లు కూలిపోయాయి.
మోర్తాడ్, జూలై 21: ఎస్సారెస్పీకి ఎగువ ప్రాంతం నుంచి వరద వచ్చి చేరుతోంది. ఆదివారం ప్రాజెక్ట్‌లోకి 18,518 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగింది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు(80.5 టీఎంసీలు) కాగా, మధ్యాహ్నం మూడు గంటలకు 1067. 50 అడుగులు (19.380 టీఎంసీల) నీటినిల్వ ఉన్నది. మొత్తం అవుట్‌ఫ్లో 503 క్యూసెక్కులు కొనసాగుతున్నది. సరస్వతీకాలువకు 10క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, 262 క్యూసెక్కుల నీరు ఆవిరిరూపంలో వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. కామారెడ్డి జిల్లాలో 39.7 మి.మీ వర్షపాతం నమోదుకాగా, అత్యధికంగా ఎల్లారెడ్డిలో 19.5 మి.మీ, అత్యల్పంగా జుక్కల్, డోంగ్లీలో 0.5 మి.మీ. నమోదైంది. నిజామాబాద్‌లో 88.1 మి.మీ, కమ్మర్‌పల్లిలో అత్యధికంగా 25. 8 మి.మీ, ఆలూర్‌లో 7.0 మి.మీ నమోదైంది.