నిజామాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ధాన్యం సేకరణలో నిజామాబాద్ జిల్లా మరోసారి సత్తా చాటింది. రాష్ట్రంలోనే అత్యధికంగా ధాన్యాన్ని సేకరించి టాప్‌లో నిలిచింది. 32 జిల్లాలతో పోలిస్తే నంబర్ వన్ స్థానంలో నిలిచింది. కామారెడ్డి జిల్లాలోనూ గతంలో మాదిరిగానే జోరు గా కొనుగోళ్లు జరిగాయి. టాప్ 10 స్థానాల్లో కామారెడ్డికి చోటు దక్కడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఉభయ జిల్లాల్లో ధాన్యం సేకరణ ప్రక్రియలో ముందంజలో నిలువడంతో ప్రభుత్వ యంత్రాంగం పనితీరుకు మరోసారి రాష్ట్ర స్థాయి లో గుర్తింపును తీసుకు వచ్చింది. వాస్తవానికి ధాన్యం సేకరణ ప్రక్రియ చాలా క్లిష్టమైన్నది. రైతుల నుంచి పంట దిగుబడులను సేకరించే క్రమంలో ఎదురయ్యే సవాళ్లు అనేకం. ఇందులో పౌరసరఫరాల శాఖ, పౌరసరఫరాల సంస్థలతో పాటు వ్యవసాయ, సహకార, రవాణా, రెవెన్యూ, పోలీస్ శాఖలు సైతం కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఉమ్మడిగా ఆయా శాఖల అధికారులు పూర్తి స్థాయిలో సమన్వయంతో పని చేస్తేనే ప్రక్రియ అన్నది విజయవంతం అవుతుంది. అలాంటి సమన్వయమే రెండు జిల్లాల్లోనూ కుదురుకోవడం మూలంగా ధాన్యం సేకరణ ఎలాంటి ఆటంకాలు లేకుండా ముగిసింది. రాష్ట్రంలోనే నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది. ఉమ్మడి జిల్లాలో రూ.2,181.17 కోట్లు విలువ చేసే 10.59లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం విశేషం.
రాష్ట్ర మంత్రి వేముల మార్గదర్శనం…
ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను ప్రతి సీజన్లోనూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నది. కేంద్ర సర్కారు అనేక ఇక్కట్లకు గురి చేస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ముందు చూపుతో ధాన్యం కొనుగోళ్లలో మానవీయతను చూపుతున్నారు. పంట దిగుబడులను సేకరించకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉన్నందున ప్రైవేటు దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వమే ధాన్యాన్ని సేకరిస్తున్నది. తెలంగాణ రాకమునుపు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో చితికిపోయిన రైతన్నలకు ఇప్పుడు కేసీఆర్ సర్కారు ద్వారా కనీస మద్దతు ధర అన్నది ఠంచన్‌గా అందుతున్నది. నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే అమ్ముకున్న ధాన్యం డబ్బులు నిర్ణీత వ్యవధిలోనే జమ అవుతుండడం విశేషం. కేసీఆర్ ఆదేశాలతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లా ప్రభుత్వ యం త్రాంగాన్ని నిరంతరం సమన్వయం చేయడంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్ర శాంత్ రెడ్డి నిర్విరామ కృషి చేశారు. ఎక్కడ ఇబ్బందులు తలెత్తినా వెంటనే కలెక్టర్లను అప్రమత్తం చేయడం.. రైతులకు మేలు చేయడంలో మంత్రి చూపిన చొరవ అంతా ఇంతా కాదు. ఏటా సమన్వయ సమావేశాలతో ప్రభుత్వ యంత్రాంగానికి సలహాలు, సూచనలు అందిస్తూ వారికి అండగా నిలవడంతో ఆయా శాఖల అధికారులు సైతం ధైర్యంగా ముందుకు పోయారు. రాష్ట్ర స్థాయిలో సాంకేతిక సమస్యలు ఎదురైనా… మంత్రి ముందుండి వాటిని పరిష్కరించడం ద్వారా సమస్య అన్నదే ఈసారి కనిపించలేదు.
నిజామాబాద్ నంబర్ వన్
రాష్ట్రంలో అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 5 లక్షల 85వేల 661 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడంతో నంబర్ వన్‌గా నిలిచింది. మొత్తం 33 మండలాల పరిధిలో 530 గ్రామ పంచాయతీలున్నాయి. ఇందులో 467 చోట్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. 65 ఐకేపీ, 5 మెప్మా, 11 వ్యవసాయ మార్కెట్లు, 386 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో కేంద్రాలను తెరిచారు. వచ్చిన ధాన్యాన్ని వచ్చినట్లే కొనడం వెంటనే రైస్ మిల్లులకు తరలించడం, రైతుల ఖాతాల్లో మద్దతు ధరను జమ చేయడం కోసం పకడ్బందీగా వ్యవహరించారు. 2022 వానకాలం సమయానికి నిజామాబాద్ జిల్లాలో పౌరసరఫరాల సంస్థ మేనేజర్ లేకపోవడంతో పౌరసరఫరాల శాఖ అధికారికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఈ రెండు పోస్టుల్లోనూ సమన్వయంతో చక్కదిద్దడంలో డీఎస్వో చంద్రప్రకాశ్ సఫలం అయ్యారు. ధాన్యం రవాణా విషయంలో గతంలో తలెత్తిన లోపాలను ఎక్కడికక్కడ సరిదిద్దడం ద్వారా ఇబ్బందులు తలెత్తలేదు. 79వేల 77 మంది రైతుల నుంచి 5లక్షల 85వేల 661 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా రూ.1204.36 కోట్లు చెల్లింపులు జరిపారు. నిజామాబాద్ జిల్లాలో 1.73 కోట్ల గన్నీ సంచులను ఈసారి వినియోగించారు. కొరత తలెత్తినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం అధిగమించింది.
కామారెడ్డిలో 4.74లక్షలు మెట్రిక్ టన్నులు
కామారెడ్డి జిల్లాలో వానకాలం సీజన్‌కి ధాన్యం కొనుగోలు కేంద్రాలను 350 ఏర్పాటు చేశారు. ఇందులో 21 ఐకేపీ ఆధ్వర్యంలో, 9 వ్యవసాయ మార్కెట్లలో, 320 ప్రాథమిక వ్యవసాయ సహకార సమాఖ్యలలో నెలకొల్పారు. ప్రతిపాదనలకు అనుగుణంగానే కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించారు. మొత్తం 78వేల 415 మంది రైతుల నుంచి సీజన్ మొత్తంలో 4లక్షల 74వేల 189 మెట్రిక్ టన్నులు సేకరించారు. ఈ మొత్తం ధాన్యం విలువ అక్షరాల రూ.976.81 కోట్లు కావడం విశేషం. దాదాపు వేయి కోట్లు విలువ చేసే ధాన్యాన్ని కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా సేకరించారు. ధాన్యం సేకరణ కోసం కోటీ 18లక్షల గన్నీ సంచులను వినియోగించారు. ఈ సీజన్లో పంట చేతికొచ్చిన సమయానికి చెడగొట్టు వానలేవీ లేకపోవడం రైతులకు, ప్రభుత్వ యం త్రాంగానికి ఎంతగానో ఉపకరించింది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 526 గ్రామ పంచాయతీలున్నాయి.
ఇందులో 350 కేంద్రాల ఏర్పాటుతో దాదాపు అన్ని గ్రామాలను అధికార యంత్రాంగం కవర్ చేసింది. పలు చోట్ల ఊరి శివారులో కేంద్రా న్ని పెట్టడం ద్వారా రెండు గ్రామాలకు ఫలితం దక్కేలా ప్రణాళికలను రచించి అమలు చేయడం కలిసి వచ్చింది. ఇలా చాకచక్యంగా వ్యవహరించడంతోనే కామారెడ్డి జిల్లాలో ఈసారి ఇసుమంతైనా ఇబ్బందులనేవి బహిర్గతం కాకపోవడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.
సమన్వయంతోనే సాధ్యమైంది…
నిజామాబాద్‌లో వానకాలంలో ధాన్యం సేకరణ విజయవంతం కావడం ఆనందంగా ఉంది. ప్రధానంగా రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ల సహకారంతోనే సాధ్యమైంది. క్షేత్ర స్థాయిలో ఆయా శాఖల సిబ్బందికి రైతులకు ఇబ్బంది తలెత్తకుండా అహర్నిశలు పని చేశారు. తద్వారానే ధాన్యం సేకరణలో నిజామాబాద్ జిల్లా నంబర్ వన్ స్థానంలో నిలిచింది.
– చంద్రప్రకాశ్, నిజామాబాద్ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి
రైతుల వద్దకెళ్లి ధాన్యం సేకరించాం…
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతుల వద్దకెళ్లి పంట దిగుబడిని సేకరించాం. ఎక్కడ అవసరమైతే అక్కడ కేంద్రాన్ని నెలకొల్పడం ద్వారా ఎవరికీ ఇబ్బంది జరగలేదు. 350 కేంద్రాలను ప్రారంభించి ధాన్యాన్ని కొనడం కామారెడ్డిలో రికార్డే. మద్దతు ధర చెల్లింపుల్లో ఎలాంటి సమస్యల్లేకుండా సాంకేతిక సహకారంతో పూర్తి చేశాం. సిబ్బందికి ఇచ్చిన శిక్షణ కార్యక్రమాలు పనికొచ్చాయి.
– జితేంద్ర ప్రసాద్, కామారెడ్డి జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్