బోధన్, ఫిబ్రవరి 16 : సీఎం కేసీఆర్ ఎంతో మంచి మనసుతో సుమారు రూ.120 కోట్ల వ్య యంతో 12 వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు సిద్ధాపూర్ రిజర్వాయర్‌ను మంజూరు చేశారని, ఇక గిరిజన తండాలకు మహర్దశ పట్టబోతున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. వర్ని మండలం సిద్ధాపూర్ వద్ద రిజర్వాయర్‌కు రాష్ట్ర మంత్రి కేటీఆర్ బుధవారం శంకుస్థాపన చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో పోచారం శ్రీనివాసరెడ్డి ఎంతో ఉద్వేగంగా మాట్లాడారు. ఇంతటి మహత్తర రిజర్వాయర్‌ను అడిగిన వెంటనే మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ ఆమోదించిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ.. ‘ఆ రోజు కొండమ్మ పోచమ్మ సాగర్ నీటి విడుదల చేసిన వెంటనే ఎర్రవల్లి ఫాంహౌస్‌కు కేసీఆర్‌తో పాటు భోజనాలకు వచ్చాం.. భోజనాల త ర్వాత సీఎంతో ‘నాదో కోరిక సార్’.. తమరి దయవల్ల కొండమ్మ పోచమ్మసాగర్, మల్లన్నసాగర్ ద్వారా నిజాంసాగర్‌కు నీరు పుష్కలంగా వస్తది. దీంతో గతంలో ఎంతో గోసపడిన నిజాంసాగర్ ఆ యకట్టు సమస్య తీరుతుంది. అయితే, బాన్సువాడ ప్రాంతంలోని నాన్ కమాండింగ్ ఏరియాకు సాగునీరు లేదని చెప్పాను.. ఇందుకు సీఎం ‘మరి ఏం కావాలో చెప్పు శీనన్న’ అన్నారు. వెంటనే నేను ‘సార్.. గుట్టల్లో చెరువు కట్టాలి అని చెప్పా.. వెంటనే సీఎం ఒక నిమిషం కూడా ఆలస్యం చేయకుండా తన ఎదురుగా ఉన్న అధికారులకు సర్వే చేయాలని ఆదేశించారు. ‘వెంటనే నేను సర్వే చేయించిన సార్.. ఎస్టిమేట్ చేసుడు దగ్గర పడింది సార్..’ అన్నాను. హైదరాబాద్‌కు వెళ్లిన తర్వాత సీఎం వద్దకు ఎస్టిమేట్లు వెళ్లడం.. ఇందుకు ఆయన తాను సంత కం తర్వాత చేస్తాను.. ఆలస్యం కాకుండా ముందు జీవో ఇవ్వాలని ఆదేశించడం, వెంటనే రూ. 72 కోట్ల 40 లక్షల వ్యయం తో చెరువు నిర్మాణానికి జీవో జారీచేయ డం చకచకా జరిగిపోయాయి… ఆ చెరువే ఈరోజున శంకుస్థాపన చేసుకున్న సిద్ధా పూర్ రిజర్వాయర్.. ఇలా చెరువు ఇచ్చి గిరిజన ప్రాంతానికి సీఎం కేసీఆర్ ఎంతో గొప్ప మేలు చేశారన్నారు. ఆ తర్వాత ఇదే రిజర్వాయర్ కు కాల్వల తవ్వకం కోసం మరో రూ. 46 లక్షలు మంజూరు చేశారని, ఇది కూడా అడిగిన మూడు రోజులకే సీఎం కేసీఆర్ ఇచ్చారని పోచారం చెప్పారు.
ఆ రోజుల్లో నిజాంసాగర్ ఆయకట్టుకు సింగూరు రిజర్వాయర్‌ను ఒక టీఎంసీ నీటినైనా వదలమని, నాటి సీఎం చంద్రబాబును వారం రోజులు బతిమిలాడిన కనికరించలేదని అన్నారు. సింగూరు నీళ్ల కోసం తాను మొండిపట్టు పట్టానని, ఒకసారి ఏడ్చానని ఆయన నాటి సంఘటనలను గుర్తుచేసుకున్నారు. అప్పుడు పరిస్థితి అలా ఉండగా, ఇప్పుడు సీఎం కేసీఆర్ వద్దకు తాను వెళ్లగానే, అడగక ముందే సింగూరు నుంచి నీటిని విడుదలచేయించారన్నారు.
చిన్న వయస్సు ఉన్నప్పటికీ, తన నిరంతర కృషితో కేటీఆర్ దేశ, విదేశాల్లోని పారిశ్రామికవేత్తలను ఒప్పించి రాష్ర్టానికి 17 వేల పరిశ్రమలను తీసుకువచ్చారని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రశంసించారు. ఐటీ రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని కేటీఆర్ ఎంతో అభివృద్ధిచేయడంతో సుమారు 20 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధిని కలిగిందన్నారు.