జిల్లాలోని పలు గ్రామాల్లో ఉన్న ఆలయాల వద్ద ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఆయా గ్రామాల్లో దేవతామూర్తులకు కల్యాణాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నదానం ఏర్పాటుచేశారు.
కమ్మర్పల్లి, ఫిబ్రవరి 16: కమ్మర్‌పల్లిలో వీడీసీ ఆధ్వర్యంలో శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి కల్యాణం, జాతరను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. వీరబ్రహ్మం, శివ, సరస్వతి, జంబి హనుమాన్, వాసవీ మాత, శ్రీరామ, పోలేరమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల కోసం అన్నదానం ఏర్పాటుచేశారు. గ్రామ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
ముప్కాల్‌లో గుట్టమీది జాతర..
ముప్కాల్, ఫిబ్రవరి 16: శ్రీ శివశ్రీనివాసుల కల్యా ణం, మల్లన్నదేవుని గుట్టమీది జాతరను గ్రామభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ముప్కాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఉదయం గోదావరి నది నుంచి నీళ్లు తెచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం ఏర్పాటుచేశారు. కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా భక్తులకు పులిహోర ప్యాకెట్లను టీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు ముస్కు భూమేశ్వర్‌రెడ్డి స్థానిక నాయకులతో కలిసి పంపిణీ చేశారు. వీడీసీ సభ్యులు పాల్గొన్నారు.
దూదిగాంలో మల్లన్న కల్యాణం..
మెండోరా, ఫిబ్రవరి 16: మండలంలోని దూదిగాంలో ఉన్న అగ్గు మల్లన్న స్వామి ఆలయ ఉత్సవాల్లో భాగంగా బుధవారం మల్లన్న కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఆలయంలో ఉదయం పల్లకీ సేవ, రథయాత్ర నిర్వహించారు. అనంతరం స్వామివారి కల్యాణాన్ని జరిపించారు. మధ్యాహ్నం చల్ల అంబలి కుండలను డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా వెలుతురును పంచేలా దీపాల నైవేద్యాన్ని స్వామికి సమర్పించారు. అర్ధరాత్రి అగ్నిగుండం, 18వ తేదీన అన్నదానం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
అలరించిన కుస్తీపోటీలు..
బోధన్ రూరల్, ఫిబ్రవరి 16: మండలంలోని కల్దుర్కి గ్రామంలో వీరభద్ర స్వామి ఆలయ జాతర సందర్భంగా బుధవారం కుస్తీపోటీలను నిర్వహించారు. పోటీలకు జిల్లాతో పాటు మహారాష్ట్ర నుంచి మల్లయోధులు తరలివచ్చారు. పోటీలను తిలకించడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జాతరకు వచ్చిన ప్రజలకు జననీ యూత్ సొసైటీ ఆధ్వర్యంలో మజ్జిగ, వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. సర్పంచ్ నానాపటేల్తో పాటు గ్రామపెద్దలు పాల్గొన్నారు.
మంథనిలో రంగనాథ స్వామి రథోత్సవం..
ఆర్మూర్, ఫిబ్రవరి 16: మండలంలోని మంథని గ్రామంలో శ్రీరంగనాథ స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీమన్నారాయణుడు అందమైన రథంపై ఊరేగాడు. గిరి మొత్తం గోవింద నామస్మరణతో మార్మోగింది. భక్తులు అక్కడే వంటలు చేసి నైవేద్యాలు సమర్పించారు. ఆలయానికి 15 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చిన కుంట గంగారెడ్డి కుటుంబ సభ్యుల పేరిట వీడీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేయించారు. భక్తులకు అన్నదానం ఏర్పాటుచేశారు.
కన్నుల పండువగా జాతర..
ధర్పల్లి, ఫిబ్రవరి 16 : మండలంలోని దుబ్బాక గ్రామపరిధిలో ఉన్న నల్లగుట్ట నర్సింహస్వామి ఆలయ జాతరోత్సవాలు కన్నుల పండువగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరాగా, వారికి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయడంతోపాటు అన్నదానం చేశారు. ఎంపీపీ నల్ల సారికాహన్మంత్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు, మండల కన్వీనర్ పీసు రాజ్‌పాల్‌రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలోని కల్యాణమండపంలో స్వామివారి కల్యాణోత్సవాన్ని శాస్ర్తోక్తంగా నిర్వహించారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్, ధర్పల్లి సర్పంచ్ ఆర్మూర్ పెద్దబాల్‌రాజ్, వైస్ ఎంపీపీ కె.నవీన్‌రెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ జీయర్ కిశోర్‌రెడ్డి, దుబ్బాక సర్పంచ్ వెంకటేశ్, ఎంపీటీసీ పెండ గంగాధర్, ఆలయ కమిటీ చైర్మన్ ఎం.గోవర్ధన్‌రెడ్డి, స భ్యులు శేఖర్‌రెడ్డి, శంకర్‌నాయక్, నాయకులు నల్ల హ న్మంత్‌రెడ్డి, సురేందర్‌గౌడ్, భూమేశ్, గంగాధర్, సొసైటీ డైరెక్టర్ సబావత్ శ్రీనివాస్‌నాయక్, స్వామి, పోశన్న, శర్మన్నాయక్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా లక్ష్మీనర్సింహస్వామి జాతర..
జక్రాన్‌పల్లి, ఫిబ్రవరి 16 : మండలంలోని కొలిప్యాక్‌లో ఆనందగిరి లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. స్వామివారి రథోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. గురువారం చక్ర తీర్థంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఎంపీపీ డీకొండ హరిత, సర్పంచ్ గంగు, ఉపసర్పంచ్ అజయ్, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు డీకొండ శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ గణేశ్‌రెడ్డి, టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు డిష్ బాలయ్య, ఆలయ గ్రామకమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
జాన్కంపేట్‌లో రథోత్సవం ..
ఎడపల్లి (శక్కర్‌నగర్) 16: ఎడపల్లి మండలంలోని జాన్కపేట్ శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. యజ్ఙ గుండం వద్ద పల్లకీలో ఏర్పాటుచేసిన ఉత్సవముర్తులతో యజ్ఞం నిర్వహించారు. అనంతరం ఉత్సవముర్తులను రథంపై ప్రతిష్ఠించారు. అనంతరం భక్త జన సందోహం మధ్య ఆలయ ్రప్రాంగణంలో రథోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ వంశ పారంపర్య యాజ్ఞికులు వనరాజుశర్మ ఆధ్వర్యంలో అర్చకులు శ్రీధర్ శర్మ, శ్రీరంగం కొండమాచార్యుల వేదమంత్రోచ్ఛారణల మధ్య కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమాలను దేవదాయ శాఖ ఉత్సవ కార్యనిర్వహణ అధికారి రవీందర్ పర్యవేక్షించారు. ఆలయ కమిటీ చైర్మన్ పురం సాయిలు, వీడీసీ అధ్యక్షుడు లక్ష్మణ్‌రాజు, మాజీ చైర్మన్లు వెల్మల హన్మాండ్లు, మిద్దె చిన్నయ్య, ఎంపీటీసీ మంద సంజీవ్, పిట్ల సాయన్న, సత్యనారాయణ, గ్రామ పెద్దలు, భక్తులు హాజరయ్యారు. ఎడపల్లి ఎస్సై పాండేరావు, ఎస్సై నవీన్, ఏఎస్సైలు రాజు, గంగాప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహిచారు.