వేల్పూర్, నవంబర్ 19: పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి రైతులను మోసం చేసిన ఎంపీ అర్వింద్‌ను గ్రామాల్లోకి రానివ్వడం లేదని రాష్ట్ర రోడ్లు-భవనాలు, హౌసింగ్, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. జిల్లాకు ఆయన చేసింది శూన్యమన్నారు. గ్రామాల్లోకి వెళ్లలేని పరిస్థితి లేదని, నిత్యం వార్తల్లో ఉండేందుకు సంచలన ప్రకటనలు చేస్తున్నాడని విమర్శించారు.
శనివారం ఆయన హైదరాబాద్‌లో ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, రాజేశ్వర్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.రాజకీయాల్లో సంస్కార హీనుడని పేర్కొన్నారు. అర్వింద్ వ్యవహరిస్తున్న తీరుకు కవిత తిట్టిన తిట్లు తక్కువేనని అన్నారు. చెప్పుతో కొడతా అని అనడం ముమ్మాటికీ కరెక్టేనని అన్నారు. అర్వింద్ రాజకీయాలకే కళంకమన్నారు. అర్వింద్ తీరు పిచ్చి కుక్కలా ఉందని విమర్శించారు. ఏదో ఒకటి మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తేవాలని బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపించారు.
సీఎం కేసీఆర్‌ను, కవితను అనరాని మాటలు అంటే అభిమానులు ఊరుకుంటారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు బీజేపీ డ్రామాలు ఆడుతున్నదని విమర్శించారు. ప్రత్యర్థి రాజకీయ పార్టీల కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెట్టడం ఆ పార్టీకి కొత్త కాదన్నారు.బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాకే రాజకీయాల స్థాయి దిగజారిందన్నారు. మునుగోడులో ఓటమి పాలైనా బీజేపీ బుద్ధి మారడంలేదన్నారు. అర్వింద్ తన తీరు మార్చుకోక పోతే ప్రజలు నిజామాబాద్‌లో ఉరికించి ఉరికించి కొడుతారని హెచ్చరించారు. అర్వింద్ భాషపై పౌర సమాజం, మీడియా కూడా స్పందించాలని కోరారు.
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా మాట్లాడుతూ…అర్వింద్ భాష శ్రుతి మించి పోయిందన్నారు. కేసీఆర్‌ను, కవితను వ్యక్తిగతంగా తిడితే అభిమానులు ఎంత కాలం ఓపిక పడుతారని, సంయమనానికి కూడా ఓ హద్దు ఉంటుందన్నారు. బీజేపీ నేతల తిట్లతో పోలిస్తే ఈ దాడి చాలా చిన్నదన్నారు. చిన్న సంఘటనపై బీజేపీ రాద్దాంతం చేస్తోందన్నారు. తమకు కూడా బూతులు వస్తాయన్నారు. ఇకనైనా బీజేపీ నేతల తీరు మార్చుకోవాలని హితవు పలికారు.
ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ మాట్లాడుతూ..తెలంగాణలో బీజేపీ హింసా రాజకీయాలు చేయాలని ప్రయత్నిస్తోందన్నారు. అర్వింద్‌కు తిట్ల దండకం తప్ప మరొకటి చేతకాదన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా అర్వింద్ చిత్తు చిత్తుగా ఓడి పోతారన్నారు. ఎంపీగా ఓడిపోవడం ఖాయమని తెలిసే ఇప్పుడు అర్వింద్ ఆర్మూర్‌లో మకాం వేశారన్నారు. తన నలభై ఏండ్ల రాజకీయ జీవితంలో అర్వింద్ తరహా భాషను చూడలేదన్నారు. కవితపై అర్వింద్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు.
ఎమ్మెల్సీ రాజేశ్వర్ మాట్లాడుతూ..అర్వింద్ మొదట్నుంచీ తప్పుడు మార్గంలో ఉన్నారన్నారు. తప్పులు చేయడం ఆయనకు పరిపాటిగా మారిందన్నారు.కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు బీ ఫారాలను అమ్ముకున్న వ్యక్తి అర్వింద్ అని ఆరోపించారు. అర్వింద్ మరోసారి నిజామాబాద్‌లో ఓడిపోవడం ఖాయమన్నారు. అర్వింద్ బట్టలు విప్పి హైదరాబాద్‌కు పంపిస్తారన్నారు.