వజ్రోత్సవాల వేళ మువ్వన్నెల పతాకం మురిసింది.. పల్లె పల్లెన సగర్వంగా రెపరెపలాడింది.. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం ఉమ్మడి జిల్లాలో నిర్వహించిన ‘ఫ్రీడమ్ రన్’ కొత్త జోష్ తీసుకొచ్చింది. ప్రతి మదిలో జాతీయ భావాన్ని నింపింది. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఉత్సాహంగా ‘రన్’లో పాల్గొన్నారు. మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ పరుగు తీశారు.
దేశభక్తిని ద్విగుణీకృతం చేసేలా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఉమ్మడి జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. గురువారం అంతటా ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. చిన్నారులు మొదలుకొని వృద్ధుల వరకు మువ్వన్నెల జెండాలను చేబూని స్వేచ్ఛా పరుగులో పాల్గొన్నారు. జాతీయ సమైక్యతను చాటేలా నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఇంటింటికీ జెండాల పంపిణీ కార్యక్రమం కొనసాగుతున్నది. కార్యాలయాలను విద్యుద్దీపాలతో అందంగా ముస్తాబు చేస్తున్నారు. బాన్సువాడలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, కామారెడ్డిలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, బోధన్‌లో ఎమ్మెల్యే షకీల్, పిట్లంలో ఎమ్మెల్యే షిండే, ఎల్లారెడ్డిలో ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఫ్రీడమ్ రన్లో పాల్గొన్నారు.