బీర్కూర్, జూలై 23: బాన్సువాడ ప్రాంతంలో ఉర్దూ మీడియం డిగ్రీ కళాశాల ఏర్పాటు ఈప్రాంత వాసుల కల అని, అది నిజమైందని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలోని సభాపతి తన స్వగృహంలో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ నూతన రాష్ట్రంలో విద్యా విధానంలో పెను మార్పులను తెచ్చారని, దానిలో భాగంగానే తాను బాన్సువాడ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎన్నో గురుకులాలు, జూనియర్ కళాశాల, ఉర్దూ మీడియం డిగ్రీ కళాశాల సాధించగలిగానని అన్నారు. ఈ ఏడాది బాన్సువాడ పట్టణానికి ఉర్దూ మీడియం డిగ్రీ కళాశాలను మంజూరు చేయడంతో ఈ ప్రాంత వాసులంతా రుణపడి ఉంటారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పేరు సంపాదించిన బాన్సువాడలోని శ్రీరాం నారాయణ్ ఖేడియా ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అనుబంధంగా నూతనంగా ఉర్మూ మీడియం డిగ్రీ కళాశాలను మంజూరు చేస్తూ శనివారం రాష్ట్ర ప్రభుత్వం జీవో నం.25ను జారీ చేసిందన్నారు. ఆ కళాశాలలో ఈ విద్యా సంవత్సరంలోనే అడ్మిషన్లను ప్రారంభిస్తారని అన్నారు. ఈ ఏడాది బీఏ, బీకాం, బీఎస్సీ (ఎంపీసీ, బీజెడ్సీ) నాలుగు కోర్సులతో తరగతులు ప్రారంభం కానున్నాయని ఆయన తెలిపారు.
నూతన కళాశాలలో మౌలిక వసతులు, అదనపు తరగతి గదుల కోసం రూ.3.19 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. దీని నిర్వహణకు 15 టీచింగ్ పోస్టులు మంజూరు అయ్యాయని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు దోస్త్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. బాన్సువాడ ప్రాంతంలో ఉర్దూ మీడియం డిగ్రీ కళాశాల కల నెరవేరిందని అన్నారు. బాన్సువాడ, కోటగిరిలో ఇప్పటికే ఉర్మూ మీడియం పాఠశాలలు అప్గ్రేడ్ సాధించి, జూనియర్ కళాశాలలుగా మారాయని అన్నారు. ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులు డిగ్రీ చదవడానికి మంచి అవకాశం లభించిందన్నారు. ఈ డిగ్రీ కళాశాల జుక్కల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లోని విద్యార్థులకు కూడా ఉపయోగపడుతుందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చినందుకు ఆనందంగా ఉందని అన్నారు. ఉర్మూ మీడియం డిగ్రీ కళాశాల మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలను తెలిపారు. సహకరించిన అధికారులు, యంత్రాంగానికి ధన్యవాదములు తెలియజేశారు. మైనారిటీ శాఖ ద్వారా వివిధ పనుల కోసం కామారెడ్డి జిల్లాకు 5.28 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని ఆయన తెలియజేశారు. జిల్లా అభివృద్ధికి నిధులు అందుబాటులో ఉన్నందున పనులను వేగంగా పూర్తి చేసుకోవచ్చని ఆయన వివరించారు. సమావేశంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు దుద్దాల అంజిరెడ్డి, సొసైటీ చైర్మన్ ఎర్వాల కృష్ణారెడ్డి, గురువినయ్ కుమార్ పాల్గొన్నారు.