బోధన్, జూలై 23: ర్యాగింగ్ చేయడం చట్ట ప్రకారం నేరమని, ర్యాగింగ్‌తో విద్యార్థుల జీవితాలు అర్థాంతరంగా ముగుస్తాయని బోధన్ సీనియర్ సివిల్ జడ్జి శివరాం ప్రసాద్ అన్నారు. శనివారం బోధన్ పట్టణంలోని విద్యావికాస్ జూనియర్ కళాశాలలో న్యాయ విజ్ఞాన చైతన్య సదస్సు జరిగింది. సదస్సులో ర్యాగింగ్‌పై సీనియర్ సివిల్ జడ్జి మాట్లాడుతూ.. జూనియర్లతో సీనియర్లు ఎంతో అన్యోన్యంగా ఉండాలన్నారు. తోటి విద్యార్థులను ర్యాగింగ్ పేరిట వేధించడం అమానుషమని అన్నారు.
ర్యాగింగ్‌కు పాల్పడితే చట్టం తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. సదస్సులో విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడరాదని చెబుతూ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గౌస్ పాషా, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి మల్లాడి అపర్ణ పలు సూచనలు చేశారు. సదస్సులో సీనియర్ న్యాయవాదులు మారుతీరావు కులకర్ణి, దత్తాత్రి కులకర్ణి, డాక్టర్ సమ్మయ్య, ఎస్సై మశ్ఛేందర్రెడ్డి, విద్యావికాస్ జూనియర్ కళాశాల చైర్మన్ యార్లగడ్డ శ్రీనివాస్, కోర్టు, పోలీస్ సిబ్బంది అశోక్‌చారి, శంకర్, లక్ష్మణ్ పాల్గొన్నారు.