నిజామాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):గంగాధర్ ఓ ప్రైవేటు మెడికల్ రిప్రజెంటేటివ్. నెలకు వచ్చే జీతం అక్షరాల రూ.18వేలు. భార్య, ఇద్దరు పిల్లలతో కుటుంబ పోషణకు గతంలో అయ్యే ఖర్చు రూ.3 వేల లోపు మాత్రమే. ఏడాది కాలంగా చిన్న కుటుంబానికే అవుతున్న వ్యయం ఏకంగా డబులైంది. అంటే రూ.5వేల -6వేలు వెచ్చిస్తే కానీ సరకులు ఇంటికి చేరడం లేదు. పైగా స్కూల్ ఫీజులు, ఇంటి కిరాయి, వంట గ్యాస్, టూ వీలర్ వాహనానికి పెట్రోల్ ఇలా వీటన్నింటినీ కలుపుకుంటే అదనంగా రూ.6వేలు వెచ్చించాల్సిందే. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూలంగా కుటుం బ పోషణకే సగానికి ఎక్కువ జీతం ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఇక రోజు వారీగా పాలు, పెరుగు, కూరగాయలు వంటి ఆహార పదార్థాలకు అయ్యే వ్యయం అదనమే. మొత్తంగా జీఎస్టీ రూపంలో కొంత భారం, ఇంధన ధరలతో ఎగబాకిన ధరల భారంతో సగటు మనిషి శ్రమంతా ముక్కచెక్కలవుతోంది. నెల గడవక ముందే జీతం కాస్తా మంచు గడ్డ మాదిరిగా క్షణాల్లో ఖర్చవుతోంది. మోదీ పాలనలో గొప్పలు ఎక్కువ, పేదలకు జరుగుతున్న లాభాలు తక్కువగా ఉన్నాయంటూ సామాన్యులు మండిపడుతున్నారు. బీజేపీ తీరు మార్చుకోక పోతే తగిన బుద్ధి తప్పదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చెప్పిందొకటి… చేసేదొకటి…
దేశం మొత్తం మీద ఒకే రకమైన పన్ను విధానం ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వస్తు సేవల పన్ను(జీఎస్టీ)ని ప్రవేశ పెట్టింది. వివిధ రాష్ర్టాల్లో పరోక్ష పన్నులకు సంబంధించి వివిధ రకమైన ట్యాక్స్ రేట్లు ఉన్నందున వస్తువుల ధరల్లో వ్యత్యాసాలు ఉన్నాయి. వ్యవసాయ ఉత్పత్తులకు కొన్ని రాష్ర్టాల్లో పన్ను ఉంది. కొన్ని రాష్ర్టాల్లో లేదు. వివిధ రకాల పరోక్ష పన్నులు, సెస్సులను క్రోడీకరించి దేశ వ్యాప్తంగా ఒకే పన్ను రేటును ప్రవేశ పెట్టడంతో ట్యాక్స్ రేట్లు తగ్గి ధరలు తగ్గుతాయన్నది ప్రధాని మోదీ ఐదేండ్ల క్రితం చెప్పారు. వ్యాపార లావాదేవీలన్నీ ఆన్లైన్లో నమోదు కావడంతో జీరో వ్యాపారం అరికట్టబడి ప్రభుత్వ ఆదాయం పెరుగుతోం ది. వ్యాపారులపై అధికారుల వేధింపులు తగ్గుముఖం పడతాయి. సరిహద్దుల్లో ఉన్న చెక్ పోస్టులు రద్దయినందున సమయం ఆదా అవుతుంది. చెక్ పోస్టుల వద్ద అధికారుల వేధింపులు ఉండే అవకాశం లేదు. వ్యాపారులు, వినియోగదారులకు లబ్ధి జరుగుతుందని భావించి ప్రభు త్వం జీఎస్టీ విధానాన్ని అమలు చేస్తోందని కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాటలన్ని ఉట్టివేనని తేలి పోయింది. దేశంలో అమలైన పాత పన్ను విధానానికి స్వస్తి పలకాలనే కుట్రతో కల్లబొల్లి మాటలతో జనాలను తప్పుదోవ పట్టించారు. వాస్తవంగా చూస్తే ఆచరణలో మాత్రం కేంద్ర ప్రభుత్వం చెప్పిందొక్కటీ అమలు కావడం లేదు.
ఇప్పటికే ధరాఘాతం…
దేశ చరిత్రలో ఇప్పటి వరకు కనీవిని ఎరుగని రీతిలో మోదీ సర్కారు ఇంధన ధరలను అమాంతం పెంచేసింది. క్రూడ్ ఆయిల్ ధరలతో సంబంధం లేకుండా అంతర్జాతీయ పరిస్థితులను బూచీగా చూపి పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్‌పై మోయలేని భారం వేసింది. గత ప్రభుత్వాలు అందించిన రాయితీని సున్నాకు తీసుకు వచ్చింది. దొడ్డి దారిలో రాయితీని కట్ చేసిన కేంద్రమే ఇప్పుడు వంట గ్యాస్ సిలిండర్‌ను ఏకంగా రూ.1200 లకు చేరువ చేసింది. ఒకప్పుడు కట్టెల పొయ్యితో వంట చేసుకున్న కుటుంబాలు తిరిగి పాత పద్ధతుల్లోకే నడుచుకునే దుస్థితికి చేరింది. పెట్రోల్ లీటర్‌కు రూ.112కు చేరడంతో సగటు ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులు తమ వాహనాలను బయటికి తీయాలంటే భయపడాల్సి వస్తోంది. ఇక డీజిల్ లీటర్ ధర రూ.99.55 చేరడంతో నిత్యావసర ధరలు ఏకంగా ఆకాశాన్ని తాకుతున్నాయి. పప్పు, ఉప్పు, నూనె సామగ్రి సహా కూరగాయల ధరలు భారీగా పెరిగి పోయాయి. తాజాగా వీటికి జీఎస్టీ జోడించడంతో బతికేది ఎట్లా? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నా రు. దేశ ప్రజలను పన్నుల రూపంలో చంపేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో నిజామాబాద్, కామారెడ్డి వాసులు అనేక రకాలుగా పోస్టులు పెడుతూ తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు.
పడిపోతున్న కొనుగోలు శక్తి
బీజేపీ ప్రభుత్వ తీరు ప్రజలకు మరణ శాసనం మాదిరిగా మారింది. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలి నిత్యం ఏదో ఒక రూపంలో పన్నులు విధిస్తుండడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదేమని అడిగితే జై శ్రీరాం… భారత్ మాతాకీ జై అంటూ నినాదాలిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ విధానాలను వ్యతిరేకించిన వారిపై దేశ ద్రోహ ముద్రలేస్తూ పబ్బం గడుపుతున్నారు. జీఎస్టీ రూపంలో ఇటీవల తీసుకు వచ్చిన పన్ను విధింపు చర్యలతో జనాలంతా విసిగి వేసాగి పో తున్నారు. ఇంధన ధరలతో మోయలేని భారం మో స్తున్న కుటుంబాలకు తాజాగా జీఎస్టీ పరిధిలోకి తీసుకు వచ్చిన పన్నేతర వస్తువులు, ఆహార పదార్థాలతో పైసా ఖర్చు పెట్టాలంటే భయానికి గురి కావాల్సి పరిస్థితి ఏర్పడింది. ద్రవ్యోల్బణం పెరుగుదలతో సంపాదనలో సగానికి ఎక్కువ ఖర్చులతో పొదుపు చర్యలు దాదాపుగా శూన్యమవుతున్నాయి. మోదీ వైఖరితో జనాలంతా తలలు పట్టుకుని నిట్టూర్పునకు గురికావాల్సిన దుస్థితి దాపురించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ పెంపుదల నిర్ణయం సామాన్య జనంపై పిడుగుపాటుగా మారింది. ఆయా ఉత్పత్తుల ధరల పెరుగుదలతో ప్రజల కొనుగోలు శక్తి దాదాపుగా తగ్గిపోనున్నది. ఇప్పటికే కష్టాలతో కునారిల్లుతోన్న పేద ప్రజలకు మరణ శాసనంగా కేంద్రం జీఎస్టీని పెంచుతోంది.
కేంద్రంపై దుమ్మెత్తిపోస్తున్నారు..
పెరిగిన జీఎస్టీ అమల్లోకి రావడంతో సామాన్యులు కేంద్రంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఏ టీస్టాల్, హోటల్, బస్టాప్ రచ్చబండలో ఎక్కడ చూసినా జీఎస్టీపై చర్చ జరుగుతుంది. నిత్యావసర వస్తువులపై పెంచిన జీఎస్టీ వెంటనే ఎత్తివేయాలి.
– పాలమూరి కాశమ్మ, హంగర్గాఫారం, కోటగిరి
ప్రజలే బుద్ధిచెబుతారు..
బీజేపీ ప్రభుత్వం వచ్చిన ఎనిమిదేండ్లలో అన్ని రకాల వస్తువులపై ధరలు పెంచింది. చివరకు నిత్యావసర వస్తువులపై కూడా ధరలు పెంచి పేద ప్రజలపై భారం మోపింది.
-శోభ, గృహిణి కోటగిరి
మోదీ అన్ని ధరలు పెంచిండు…
కోటగిరి, జూలై 22: మోదీ సర్కార్ అన్ని వస్తువులపై ధరలు విపరీతంగా పెంచింది. మొన్న గ్యాస్, పెట్రోల్‌పై ధరలు పెంచిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు నిత్యావసర వస్తువులపై జీఎస్టీ పేరిట పేదల నోట్లో మట్టి కొడుతుండ్రు. నోటి కాడి బువ్వను లాగేస్తుకుంటున్నడు గరీబోళ్ల మీద పడి పన్నులు వసూలు చేస్తున్నారు. కేంద్రానికి పోయే కాలం దగ్గర పడింది.
– కొండ లలిత, హంగర్గాఫారం, కోటగిరి మండలం
పేదల నడ్డి విరుస్తున్న మోదీ
బీజేపీ పాలనలో పేదల జీవనం అగమ్యగోచరంగా మారింది.పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఉపయోగించే వస్తువులపై జీఎస్టీ వేయడం ఎంత వరకు సమంజసం. మోదీ ప్రభుత్వం డీజిల్,పెట్రోల్ ధరలతో నిత్యావసర వస్తువుల ధరలను పెంచి సామాన్యుల నడ్డి విరుస్తోంది. నిరుద్యోగులకు ఇచ్చిన హామీని పూర్తిగా విస్మరించింది. నిత్యావసరాలపై వేసిన జీఎస్టీని వెంటనే ఎత్తివేయాలి.
-నాగరాణి, గృహిణి, ఎత్తొండ, కోటగిరి మండలం