బాన్సువాడ, జూలై 22: అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అందించడంలో ప్రజాప్రతినిధులు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. శుక్రవారం ఆయన బాన్సువాడ పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాలులో చందూరు, మోస్రా మండలాల ప్రజా ప్రతినిధులు,నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ర్టానికి పరిపాలనా దక్షత కలిగిన సీఎం కేసీఆర్ ఉన్నారని, అభివృద్ధి కోసం కావాల్సిన నిధులను మంజూరు చేస్తున్నారని అన్నారు. గ్రామాల్లో ప్రజాప్రతినిధులు , నాయకులు సమష్టి నిర్ణయాలు తీసుకోవడంతో సత్ఫలితాలు సాధించవచ్చని అన్నారు. క్షేత్ర స్థాయిలో పేదలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందించడంలో గ్రామ స్థాయిలోని ప్రజా ప్రతినిధులు , నాయకులు కీలకమన్నారు. గ్రామస్థాయిల్లో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకొని సమష్టి నిర్ణయాలు తీసుకోవడంతో మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు.
నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రతి గ్రామంలో ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై నివేదిక తయారుచేసుకోవాలని సూచించారు. వీటితో పాటు సామాజిక వివరాలను కూడా సేకరించాలన్నారు. సమావేశంలో ఆయా మండలాల ఎంపీపీ పిట్ల ఉమ శ్రీరాములు, జడ్పీటీసీ భాస్కర్ రెడ్డి, చందు, హన్మంత్ రెడ్డి, సర్పంచులు సాయిరెడ్డి, హన్మంత్ రెడ్డి, సత్యనారాయణ రావు , రవి, గంగాధర్, ఎంపీటీసీ శ్యామ్‌రావ్ ,లింగన్న, భూమన్న, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం బాన్సువాడలోని ఏఎంసీ కార్యాలయ పాలకవర్గ సభ్యుల ఆహ్వానం మేరకు కార్యాలయాన్ని స్పీకర్ పోచారం సందర్శించారు. ఈ సందర్భంగా సభాపతిని ఏఎంసీ చైర్మన్ పాత బాలకృష్ణ ఆధ్వర్యంలో పాలక వర్గ సభ్యులు శాలువాతో సన్మానించి, జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ డాక్టర్ అంజిరెడ్డి, విండో చైర్మన్ వై కృష్ణారెడ్డి, పిట్ల శ్రీధర్, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, హనుమాన్ వ్యాయామశాల అధ్యక్షుడు గురు వినయ్‌కుమార్ , వైస్ చైర్మన్ దాసరి శ్రీనివాస్, మహ్మద్ ఎజాస్, తదితరులు ఉన్నారు.
కిరాణా వర్తక వ్యాపార సంఘ భవన నిర్మాణ పనుల పరిశీలన..
బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని కిరాణా వర్తక వ్యాపార సంఘం భవన నిర్మాణ పనులను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి శుక్రవారం పరిశీలించారు. కమ్యూనిటీ భవనం నిర్మాణం కోసం రూ.10 లక్షల నిధులు మంజూరుచేస్తానని హామీ ఇచ్చారు.